నారా వారి రాజకీయం: ధైర్యం చాలలేదంతే.!

తెలంగాణలో పార్టీని నిండా ముంచేసిన ఘనత నారా లోకేష్‌కే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని ఆయన ఉద్ధరించేసిందేమీ లేదు. కానీ, అక్కడ పార్టీ అధికారంలో వుంది కాబట్టి.. 'చినబాబు' అలా వెలిగిపోతున్నారంతే. 'లోకేష్‌ కోసం నేను పదవిని త్యాగం చేస్తా..' అంటూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ మధ్య చాలా హడావిడి చేసేశారు. అదో టైపు పబ్లిసిటీ స్టంట్‌. 

లోకేష్‌కి మంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడ్డంతో చేసేది లేక, చంద్రబాబు లోకేష్‌ని శాసనమండలికి పంపుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్‌ని గెలిపించేసుకుని, తద్వారా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు వ్యూహానికి టీడీపీలో అడ్డు తగిలేదెవరు.? 'ఎమ్మెల్సీగా ఎందుకు.? ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిపించి.. మంత్రి పదవి ఇస్తే బాగుండేది కదా..' అని ఎవరన్నా అసహనం వ్యక్తం చేసినా, వారి నోరు మూయించేయడం చంద్రబాబుకి పెద్ద కష్టమేమీ కాదు. 

ఎమ్మెల్సీగా ఎంపికవడానికా.. ఇంత హంగామా చేసింది.? ప్రతిపక్షం మీద విమర్శలు, పార్టీ వేదికల మీద సీనియర్లకు క్లాసులు.. అబ్బో, గడచిన మూడేళ్ళలో లోకేష్‌ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. 'టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి' హోదాలో చినబాబు ప్రదర్శించిన డాబు, చేసిన ఓవరాక్షన్‌.. పార్టీ సీనియర్లకు చికాకు తెప్పించిందన్నది నిర్వివాదాంశం. కానీ, చినబాబుని ప్రశ్నిస్తే, పెదబాబుకి కోపమొచ్చేస్తుంది కాబట్టి.. అంతా సైలెంటయిపోయారు. 

మొత్తమ్మీద, ఇప్పటిదాకా తెరవెనుక వుండి చక్రం తిప్పిన చినబాబు, ఇక నుంచి తెరపైకొచ్చి చక్రం తిప్పుతారన్నమాట. మంత్రి వర్గంలో లాభదాయకమైన పోస్ట్‌ ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌ కోసం ఫిక్స్‌ చేసి వుంటారన్నది నిర్వివాదాంశం. అదేంటో, కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేంత ధైర్యం లేని వ్యక్తి.. నాయకుడట.. ఈయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అట.! ఏం చేస్తాం, నారా వారి రాజకీయం అంతే మరి.!

Show comments