అక్షయ్‌కుమార్‌ నిలబెడ్తాడా.?

బాలీవుడ్‌కి ఈ మధ్య అస్సలేమాత్రం కలిసిరావట్లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టే బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడిపోతోంది. పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న తేడాల్లేవ్‌. యాదృశ్చికమే కావొచ్చుగాక.. కానీ, 'బాహుబలి ది కంక్లూజన్‌' తర్వాత, బాలీవుడ్‌లో వచ్చిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడం బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితుల్నే విస్మయానికి గురిచేస్తోంది. 

'ట్యూబ్‌లైట్‌', 'జబ్‌ హ్యారీ మెట్స్‌ షెజాల్‌', 'మున్నా మైఖేల్‌', 'జగ్గా జాసూస్‌', 'రాబ్తా'.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌లో చాలానే వున్నాయి. వరుస ఫ్లాపుల దెబ్బకి ఒక్కసారిగా బాలీవుడ్‌ మార్కెట్‌ కుదేలయ్యింది. ఓవర్సీస్‌లో అయితే బాలీవుడ్‌ సినిమాలు బెంబేలెత్తించేస్తుండడం గమనార్హం. ఇది బాలీవుడ్‌కి అత్యంత బ్యాడ్‌ ఫేజ్‌ అని బాలీవుడ్‌ సినీ జనాలే చెప్పుకుంటోన్న పరిస్థితి. 

సరిగ్గా ఈ టైమ్‌లోనే అక్షయ్‌కుమార్‌ 'టాయిలెట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజానికి ఇది భారీ చిత్రం ఏమీ కాదు. అయితే, సినిమా మీద మాత్రం భారీ అంచనాలున్నాయి. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. సొసైటీకి మంచి మెసేజ్‌ ఇచ్చే సినిమా కావడంతో, ఏమాత్రం బాగున్నా.. సినిమాకి చేసిన తక్కువ ఖర్చు నేపథ్యంలో, సినిమా బంపర్‌ హిట్‌ అయ్యే అవకాశాలున్నాయి. 

అందుకే, అక్షయ్‌కుమార్‌ని ఇప్పుడు 'బాలీవుడ్‌ సినిమాని నిలబెట్టే మొనగాడు' అంటోంది బాలీవుడ్‌ మీడియా. నిజమేనా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

Show comments