మోడీ మౌనం - రాహుల్‌ రౌద్రం.!

మౌనం అర్థాంగీకారం.. అన్నది పెద్దలు చెప్పిన మాట. ఆ లెక్కన, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై చేస్తున్న ఆరోపణల్ని నిజమే అనుకోవాలి. ఎందుకంటే, రాహుల్‌ ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించడంలేదు. బహిరంగ సభల్లో పులి గాండ్రింపులు.. పార్లమెంటులోకొచ్చేసరికి పిల్లికూతలు కూడా లేవాయె.! ఇదీ గత కొన్నాళ్ళుగా పార్లమెంటులో నరేంద్రమోడీ తీరు. పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటులో ఇప్పటిదాకా నరేంద్రమోడీ పెదవి విప్పలేదు. 

నిజానికి, చట్ట సభల వేదికగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. దాదాపు 100 మంది సామాన్యులు, తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకోసం బ్యాంకులకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు బాధ్యత వహించాల్సింది ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. ఆయన తీసుకున్న అతి చెత్త నిర్ణయం ఫలితమిది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద పాత నోట్లను రద్దు చేయడంతో, దేశం అల్లకల్లోలమైపోతోంది. ఇంత జరుగుతున్నా, పార్లమెంటు సాక్షిగా ప్రజలకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన నరేంద్రమోడీకి ఇంకా కలగకపోవడం శోచనీయం. 

పైగా, 'నన్ను విపక్షాలు మాట్లాడనివ్వట్లేదు..' అంటూ, మోడీ బహిరంగ సభల్లో 'కొత్త ఏడుపు' షురూ చేశారు. ఇక్కడే, మోడీ భయపడుతున్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ పసిగట్టేసింది. పార్లమెంటులో ఇక మోడీ మాట్లాడే అవకాశం లేదని కాంగ్రెస్‌ పార్టీకి అర్థమయిపోయింది. 'యువరాజు'ని రంగంలోకి దించింది. మొదట్నుంచీ, ఈ వ్యవహారంలో రాహుల్‌ యాక్టివ్‌గానే వుంటున్నారు. క్యూ లైన్లలోకి వెళ్ళి జనం వెతల్ని రాహుల్‌ తెలుసుకున్నారు. సరే, రాహుల్‌ నిజంగానే అంత 'సీరియస్‌' పొలిటీషియనా.? అన్న ప్రశ్న దేశ ప్రజానీకంలో మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌లా ఎప్పుడూ వుంటుందనుకోండి.. అది వేరే విషయం. 

ఈ ఎపిసోడ్‌లో.. ఈ పెద్ద పాత నోట్ల ఎపిసోడ్‌లో మాత్రం, రాహుల్‌ చాలా సీరియస్‌ పొలిటీషియన్‌లానే కన్పిస్తున్నారు. అవతలి వ్యక్తి బెదరుతున్నప్పుడు, ఇంకా బెదిరించడం చాలా చాలా తేలిక. రాజకీయాల్లో ఒక్కసారి, పట్టుకి దొరికితే, ఇక ఆ పట్టు బిగించడం భలే క్రేజీగా వుంటుంది. రాహుల్‌ ఇప్పుడు చేస్తున్నది అదే. పార్లమెంటులో చర్చ జరిగితే, దాని పర్యవసానాలు ఎలా వుంటాయో మోడీకి తెలుసు. ఎందుకంటే, నిజంగానే పెద్ద పాత నోట్ల రద్దుతో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అంతే కాదు, నోట్ల రద్దు వ్యవహారం తర్వాత, పలువురు బీజేపీ నేతల దగ్గరే కట్టలకొద్దీ కొత్త నోట్లు దొరికాయి. 'మాకు ముందే తెలుసు.. ఇంకొందరికీ ఈ విషయం తెలుసు..' అని బీజేపీ నేతలే, పెద్ద పాత నోట్ల రద్దు సీక్రెట్‌ని వివరించేశారు. 

ఇన్ని ప్రతికూలతల నడుమ, 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు..' అన్న పద్ధతినే ఫాలో అవుతున్నారు నరేంద్రమోడీ. ఇకనేం, రాహుల్‌ చెలరేగిపోతున్నారు. 'పెద్ద పాత నోట్ల రద్దు ఓ కుంభకోణం.. నాకు లోక్‌సభలో మాట్లాడే అవకాశమిస్తే, నరేంద్రమోడీ కుట్రల్ని, అవినీతినీ బయటపెడ్తాను.. దానికి తగ్గ ఆధారాలు నా దగ్గర వున్నాయి..' అంటూ రాహుల్‌ నేడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత, బీజేపీలో 'వార్నింగ్‌ బెల్స్‌' మోగాయన్నది నిర్వివాదాంశం. 

తప్పించుకోడానికి వీల్లేని పరిస్థితుల్లోకి మోడీని రాహుల్‌ నెట్టేశారు. మరిప్పుడు, ఇంకా 'తప్పించుకు..' అన్న ధోరణితోనే నరేంద్రమోడీ వ్యవహరిస్తారా.? పార్లమెంటులో ఇప్పటికైనా పెదవి విప్పుతారా.? వేచి చూడాల్సిందే.

Show comments