ఇవ్వాళ, రేపు ఒక కథ తయారు చేసుకుంటే, ఏ హీరోకి అయినా సెట్ అయిపోతోంది. అందుకే దర్శకులు ఓ కథ పట్టుకుని ఈ హీరో కాదంటే, ఆ హీరో..ఆ హీరో కాదంటే మరో హీరో దగ్గరకు తిరిగేస్తున్నారు. అనిల్ రావిపూడి రామ్ నుంచి ఎన్టీఆర్ మీదుగా రవితేజ వరకు అలాగే వెళ్లిపోయాడు. వక్కంతం వంశీ కూడా ఎన్టీఆర్ దగ్గర నుంచి బన్నీ దగ్గరకు అలాగే చేరిపోయాడు. ఇప్పుడు ఓ కొత్త దర్శకుడు కూడా ఇదే బాటలో వున్నాడు.
శ్రీను వైట్ల దగ్గర, అనిల్ రావిపూడి దగ్గర పనిచేసాడు ఉపేంద్ర అనే అసిస్టెంట్. మాంచి కథ తయారుచేసుకున్నాడు. హీరో సునీల్ కు చాలా కాలం కిందటే చెప్పాడు. సునీల్ కు కూడా ఆ కథ బాగా నచ్చింది. కానీ ప్రొడ్యూసర్ సెట్ కావాలి. అందుకు కొంచెం టైమ్ పట్టేలా వుంది.
దీంతో ఇప్పుడు ఆ డైరక్టర్ ఆ కథను పట్టుకుని, హీరో కళ్యాణ్ రామ్ దగ్గరకు చేరిపోయినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఆ స్క్రిప్ట్ కు ఓకె అనేసారు. త్వరలో పట్టాలు ఎక్కించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ సినిమా కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ లో కాకుండా బయట బ్యానర్ లో వుంటుంది. ఇక మీదట బయటి బ్యానర్ ల్లో కూడా సినిమాలు చేయాలని కళ్యాణ్ రామ్ డిసైడ్ అయ్యారు.
ఈ కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరక్షన్ లో ఒకటి, గతంలో నారా రోహిత్ తో సావిత్రి సినిమా అందించిన పవన్ సాధినేనితో ఒకటి చేయబోతున్నారు. పవన్ సాధినేని రూపొందించే సినిమాలో అయితే నందమూరి హరికృష్ణ, లేదంటే ఎవరైనా సీనియర్ హీరో కూడా నటించే అవకాశం వుంది.