స్పెషల్ వార్: రన్‌ వేపై జగన్‌ బైఠాయింపు

హైద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్ళిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని, విశాఖ విమానాశ్రయంలోని రన్‌ వే మీదనే పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదాకి మద్దతుగా వైఎస్‌ జగన్‌ ఈ రోజు విశాఖలోని రామకృష్ణ బీచ్‌లో 'కొవ్వొత్తుల ర్యాలీ'లో పాల్గొననున్న విషయం విదితమే. అయితే, గణతంత్ర దినోత్సవం కావడం, రేపు ఎల్లుండి విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుండడంతో, ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలకూ అనుమతి లేదన్నది పోలీసుల వాదన. 

స్వయంగా డీజీపీ సాంబశివరావు, విశాఖలో పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా, డీజీపీ విశాఖ విమానాశ్రయంలోనే ఎక్కువసేపు గడిపారు. వైఎస్‌ జగన్‌ వస్తుండడంతో, ఆయన్ను అడ్డుకునేందుకుగాను వ్యూహరచన చేశారు. విశాఖ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విమానాశ్రయం చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. వైఎస్‌ జగన్‌, విశాఖలో ల్యాండ్‌ అవగానే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలన్నది పోలీసుల వ్యూహం. 

తనను అరెస్టు చేసేందుకు పోలీసులు రన్‌ వే మీదకు రావడంతో, అక్కడే ఆయన బైఠాయించినట్లు తెలుస్తోంది. మరోపక్క, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అమర్‌నాథ్‌ తదితరుల్ని విశాఖలో ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Show comments