జగన్‌, ప్రశాంత్‌.. క్లాసులే క్లాసులు

ఎన్నికల్లో గెలవడానికీ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ వుండాలి. రాజకీయ పార్టీలకు ఈ స్కిల్స్‌ తక్కువయ్యాయేమో.. అందుకే, అలా పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ చెయ్యగల సమర్థులకు గిరాకీ పెరుగుతోందిప్పుడు. నిజానికి ఇది విదేశాల్లో ఎప్పటినుంచో అందుబాటులో వున్న విషయమే. మన దేశంలో ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెంగా ఈ పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ పాపులర్‌ అవుతూ వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ 'పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌'ని షురూ చేసింది. ఈ విభాగంలో దిట్ట అన్పించుకున్న ప్రశాంత్‌ కిషోర్‌ని రంగంలోకి దించింది వైఎస్సార్సీపీ. ఇప్పటికే పని ప్రారంభించేసిన ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేయడం గమనార్హం.

నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఓ అంచనాకి వచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌, జగన్‌తో కలిసి పార్టీ ముఖ్య నేతలకు 'క్లాస్‌' తీసుకున్నారు. మనోళ్ళకి ఇలాంటి క్లాసులు కొత్తే. ఆ క్లాసులు ఒక్కోసారి చిరాకు తెప్పించేస్తాయి కూడా. అందుకే, అవి వెగటు పుట్టకుండా వైఎస్ జగన్ తనవంతుగా పార్టీ నేతలు,  ప్రశాంత్ కిషోర్ టీమ్ మధ్య సానుకూల వాతావరణం కోసం ప్రయత్నించాల్సి వస్తోంది.

ఏ పార్టీకి అయినా ఏ నాయకుడికి అయినా కొన్ని లూప్‌ హోల్స్‌ వుంటాయి. నియోజకవర్గాల్లో సెన్సిటివిటీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ లూప్‌ హోల్స్‌, ఆ సెన్సిటివిటీ.. వీటికి తోడు పొలిటికల్‌ వాక్యూమ్‌.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని, లెక్కలన్నీ పక్కాగా వేసి, గెలుపు ముంగిట పార్టీలను నిలబెట్టడం ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ బాధ్యత. 

2014 ఎన్నికల్లో నరేంద్రమోడీకీ.. ఆ తర్వాత జరిగిన బీహార్‌ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌కీ.. ప్రశాంత్‌ కిషోరే 'సలహాదారు'. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు బెడిసి కొట్టాయనుకోండి.. అది వేరే విషయం. గెలిస్తే అది తన ఘనత, ఓడితే ఆయా పార్టీలు తన సూచనల్ని తిరస్కరించాయని చెప్పుకోవడంలోనూ ప్రశాంత్‌ కిషోర్‌ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

మొత్తమ్మీద, జగన్‌ అండ్‌ టీమ్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ 'కనెక్ట్‌' అవడం ఆ పార్టీ శ్రేణుల్లో ప్రస్తుతానికి కొత్త ఉత్సాహమిస్తోంది. మరోపక్క, ప్రశాంత్‌ కిషోర్‌ ద్వారా వైఎస్సార్సీపీకి అందుతోన్న ఇన్‌పుట్స్‌పై చంద్రబాబు వేగులూ సమాచారం సేకరిస్తున్నారట. చూద్దాం.. ప్రశాంత్‌ కిషోర్‌ పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎలా లాభిస్తుందో.!

Show comments