చిరంజీవి వెండితెరపై మెగాస్టార్.. ఆయనకు సినిమాల్లో తిరుగులేదని మరోమారు 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో నిరూపితమయ్యింది. రాజకీయాల్లో మాత్రం చిరంజీవి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారన్నది నిర్వివాదాంశం. మరి, బుల్లితెరపై మెగాస్టార్ హవా ఎంత.? అన్నదే ఇప్పుడు ప్రశ్న.
గతంలో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో, ఇప్పుడు చిరంజీవి నిర్వహిస్తున్నారు. నాగార్జునతో పోల్చితే, చిరంజీవి స్టార్‌డమ్ చాలా ఎక్కువ. ఆ లెక్కన, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోకి స్పందన అదిరిపోవాలి. అయితే, ఆ షోకి హాజరవుతున్న పార్టిసిపెంట్లు చిరంజీవిని చూసి కొత్త అనుభూతిని పొందడం, షోకి మెగా గ్లామర్ రావడం మినహా, షోలో కంటెంట్ మాత్రం 'అంతకు మించి' అనే స్థాయిలో లేదన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.
మొదట హిందీలో, అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' పేరుతో ఈ గేమ్ షోని రక్తికట్టించారు. అప్పట్లో అది సెన్సేషనల్ గేమ్ షో. అసలు గేమ్ షోలకే 'బాప్' అనే స్థాయిలో అదరగొట్టేసింది కౌన్ బనేగా కరోడ్ పతి. ఆ స్థాయిలో, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రక్తి కట్టించాలంటే, అక్కడ హోస్ట్‌కి వుండాల్సిన స్టార్‌డమ్‌తోపాటుగా గేమ్ షోలో పార్టిసిపెంట్లకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా వుండాలి. క్వశ్చన్ అడగడం దగ్గర్నుంచి, సమాధానం రాబట్టేదాకా.. వ్యవహారం ఉత్కంఠభరితంగా సాగాలి. అయితే, అలాంటివేమీ కన్పించడంలేదిప్పుడు.
సెలబ్రిటీలు హల్‌చల్ చేస్తున్నప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు‘ కాస్తంత సందడిగానే కన్పిస్తోంది. సాధారణ పార్టిసిపెంట్లు వచ్చినప్పుడే మరీ డల్‌గా మారిపోతోంది ఈ గేమ్ షో. అయితే మొదటి ఎపిసోడ్‌కీ, ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్స్‌కీ చిరంజీవిలో ఈజ్ పెరిగిందన్నది నిర్వివాదాంశం. చాలా కంఫర్టబుల్‌గా కనిపిస్తున్నారు చిరంజీవి. అయినాసరే, గేమ్ షోలో ఏదో లోటు కన్పిస్తోంది. ఆ లోటు అలాగే కొనసాగితే, బుల్లితెరపై మెగా గ్లామర్ చిన్నబోయే ప్రమాదముంది. మెగాస్టార్ సినిమాలకి వసూళ్ళపై భారీ అంచనాలున్నట్టే, ఈ గేమ్ షో టీఆర్పీల మీదా చాలా అంచనాలున్నాయి.. మరి, మెగాస్టార్ ఆ అంచనాల్ని ఎప్పటికి అందుకుంటారో ఏమో.!