అమీర్‌ఖాన్ మరోసారి క్రిస్మస్ సీజన్‌లో తనకి ఎదురు లేదని 'దంగల్'తో చాటుకుంటున్నాడు. ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. గత వారం విడుదలైన తెలుగు చిత్రాలు నిరాశ పరిచాయి. రామ్‌గోపాల్‌వర్మ తీసిన వంగవీటిలో విషయం లేకపోవడంతో ఓపెనింగ్స్‌కే పరిమితం అయింది.
సప్తగిరి ఫ్యాక్టర్ వల్ల సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఓపెనింగ్స్ పరంగా ఫర్వాలేదనిపించుకుంది. కానీ సినిమాకి బ్యాడ్ టాక్ బాగా ఉంది కనుక పెట్టుబడి వెనక్కి రాబట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. పిట్టగోడ చిత్రం గురించి సోషల్ మీడియాలో హంగామా జరిగింది కానీ ఈ చిత్రం ప్రేక్షకాదరణకి నోచుకోలేకపోయింది.
విశాల్ నటించిన 'ఒక్కడొచ్చాడు' చిత్రం తమిళంతో పాటు తెలుగులోను ఫ్లాపయింది. తెలుగులో దీనికి నామమాత్రపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. 'ధృవ' ఇప్పటికీ వారాంతాల్లో బాగానే పర్‌ఫార్మ్ చేస్తోంది. యాభై కోట్ల షేర్ దాటిన ఈ చిత్రం యాభై అయిదు కోట్ల స్థాయిలో ఆగుతుందని అంచనాలున్నాయి. ఆ లెక్కన ట్రేడ్ సూత్రాల ప్రకారం ఇది అబౌ యావరేజ్ అనిపించుకుంటుంది.