బస్టాండే.. విమానాశ్రయమయ్యింది

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో వున్నది ఒకే ఒక్క విమానాశ్రయం. అదే గన్నవరం విమానాశ్రయం. ఈ విమానాశ్రయం గురించి చెప్పాలంటే, 'బస్టాండ్‌ కన్నా హీనం' అనే మాట విన్పిస్తుంది. సాక్షాత్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు చేశారు ఈ వ్యాఖ్యలు. అప్పటికే, విజయవాడ తాత్కాలిక రాజధానిగా ప్రకటించబడింది కూడా.! 

కానీ, ఇప్పుడు ఆ గన్నవరం విమానాశ్రయం రూపురేఖలు మారిపోయాయి. త్వరలో 'అమరావతి విమానాశ్రయం'గా పేరు మార్చుకోనుంది. 18 నెలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఈ విమానాశ్రయ అభివృద్ధి పనుల్ని చేపట్టారు. కొత్త టెర్మినల్‌ నిర్మాణం పూర్తయ్యింది. కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు ఈ టెర్మినల్‌ని ప్రారంభించారు. కొత్తగా విమానాశ్రయ రన్‌వే విస్తరణ పనులకీ భూమి పూజ చేసేశారు. 

అంతా బాగానే వుంది.. ఇంతకీ, ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు వస్తుందా.? రాదా.? అంటే, అతి త్వరలోనే వచ్చేస్తుందని అధికారులు అంటున్నారు. విమానాశ్రయ రన్‌ వే విస్తరణ కోసం భూ సమీకరణ చేపట్టడం, ఆ ప్రక్రియ కొలిక్కి రావడంతో భూమి పూజ కూడా చేసెయ్యడంతో.. విస్తరణ పూర్తయిన వెంటనే అంతర్జాతీయ హోదా వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగైతేనేం, రాజధాని అమరావతిలో బస్టాండ్‌ కన్నా హీనం.. అనే స్థాయి నుంచి 'స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌' అనే స్థాయిలో విమానాశ్రయం అభివృద్ధి చెందడాన్ని ఆహ్వానించి తీరాల్సిందే. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చి, ఈ విమానాశ్రయం రైతులకు ఎంతో మేలు చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. 

వ్యవసాయమా.? అమరావతి పరిధిలో అదెక్కడుంది.? ఇప్పటికే 33 వేల ఎకరాలకు పైగా రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్‌ లాగేసుకుంది. దానికి అదనంగా ఇప్పుడు ఇదిగో విమానాశ్రయ విస్తరణ కోసం భూముల్ని లాగేసుకున్నారు. మరోపక్క ఔటర్‌ రింగ్‌రోడ్‌ అనీ, ఇంకోటనీ కొత్తగా మళ్ళీ భూ సమీకరణ లేదా సేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో అమరావతి పరిధిలో వ్యవసాయం అన్న మాటకే తావు లేనప్పుడు వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కోసం.. అంటూ వెంకయ్య సన్నాయి నొక్కులేమిటో.! 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, తిరుపతి విమానాశ్రయాలు ముఖ్యమైన విమానాశ్రయాలుగా వెలుగొందుతున్నాయి. కొత్తగా భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టారు. మరోపక్క కడప, రాజమండ్రి తదితర విమానాశ్రయాలు డొమెస్టిక్‌ విమానాలకు సేవలందిస్తున్న విషయం విదితమే.

Show comments