తుగ్లక్‌ జీఎస్‌టీనే.. ఎందుకంటే.!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ జీఎస్‌టీకి మద్దతిచ్చాయి. జమ్మూకాశ్మీర్‌ మినహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ జీఎస్‌టీకి అనుకూలంగా తీర్మానాలు జరిగాయి. ఆ లెక్కన, దేశమంతా జీఎస్‌టీకి అనుకూలంగా వున్నట్టే లెక్క. కానీ, జీఎస్‌టీ పట్ల ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తీర్మానాలు చేసిన రాష్ట్రాలే జీఎస్‌టీ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకుని, మింగలేక కక్కలేక నానా తంటాలూ పడ్తున్నారు. 

అసలెందుకు ఈ దుస్థితి దాపురించింది.? పార్లమెంటులో చర్చ సందర్భంగా అనుమానాలు వ్యక్తం కాలేదు. రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం సందర్బంగానూ ఎవరికీ ఎలాంటి సందేహాలు రాలేదు. మరి, ఇప్పుడే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తోంది.? అన్నది సామాన్యుడికి అర్థం కాని విషయం. కానీ, ఇక్కడే ప్రధాని నరేంద్రమోడీ తనదైన మంత్రాంగాన్ని రచించి, అందరి నోళ్ళూ మూయించేశారన్న వాస్తవాన్ని గుర్తించాలి. 

జీఎస్‌టీ అనేది పార్లమెంటు ఆమోదం పొందిన మాట వాస్తవం. రాష్ట్రాల అసెంబ్లీల్లో జీఎస్‌టీకి మద్దతు లభించిన మాట వాస్తవం. కానీ, జీఎస్‌టీ పేరుతో శ్లాబ్‌లను మాత్రం ఏ చట్ట సభలూ నిర్ణయించలేదు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం ఏర్పాటు చేసిన జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ శ్లాబ్‌లపై నిర్ణయం తీసుకుంది. అదీ, అసలు విషయం. 

ఓ సారి జీఎస్‌టీకి ఆమోదం లభించాక, రాష్ట్రాలు ఎంత గింజుకున్నా ఉపయోగం వుండదని ప్రధాని నరేంద్రమోడీకి ముందే తెలుసు. కేంద్రం నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలిస్తామంది. కొంతమేర ఆ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకున్న మాట వాస్తవం.

అదీ, కేంద్రానికి సానుకూలంగా వున్న అంశాలు మాత్రమే. నిర్ణయం కేంద్రానిది, పేరు జీఎస్‌టీ కౌన్సిల్‌దన్నమాట. రాష్ట్రాల హక్కుల్ని ఏ స్థాయిలో కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటుండదు. 

సర్వీస్‌ ట్యాక్స్‌ 15 శాతం నుంచి 18 శాతం పెరగడం అనేది బడ్జెట్‌ సెషన్‌లో జరిగితే, విపక్షాలు నానా యాగీ చేస్తాయి. అదే జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆ రేటుని ఫిక్స్‌ చేస్తే, ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ముందు ముందు తుగ్లక్‌ సినిమా చాలానే వుంది.

శ్లాబ్‌లు ఒకదాంట్లోంచి ఇంకోదాంట్లోకి మారిపోవడం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. 'కొన్ని తగ్గాయి..' అని సంబరపడిపోవడానికి వీల్లేదు. ఆ తగ్గినవన్నీ, ముందు ముదు షాక్‌ కొట్టబోతున్నాయి. ఎందుకంటే, పేరుకే కౌన్సిల్‌.. పెత్తనమంతా కేంద్రానిదే కదా.! 

28 శాతం అనేది టాప్‌ శ్లాబ్‌. ముందు ముందు అన్నీ, ఈ శ్లాబ్‌లోకి వచ్చేస్తే పరిస్థితి ఏంటట.? రాదన్న గ్యారంటీ ఏంటట.?

Show comments