హైద్రాబాద్‌పై హక్కు మాటేమిటి.?

ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడ, గుంటూరు వైపు పరుగులు పెడ్తున్నాయి. ఇప్పటికే పలు కార్యాలయాలు విజయవాడ, గుంటూరు నుంచి పనిచేసేస్తున్నాయి కూడా. ఉద్యోగులూ, అక్కడికే షిఫ్ట్‌ అయ్యేందుకు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు కూడా. ఇక, హైద్రాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి పరిపాలన పరంగా ఎలాంటి సంబంధాలూ వుండకపోవచ్చు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఇంకో రెండు మూడు నెలల తర్వాత హైద్రాబాద్‌తో, ఆంధ్రప్రదేశ్‌కి పెద్దగా అవసరం వుండదు. 

అంతా బాగానే వుందిగానీ, హైద్రాబాద్‌ మీద ఇంకో ఎనిమిదేళ్ళపాటు విభజన చట్టం కల్పించిన 'ఉమ్మడి రాజధాని' అనే హక్కు మాటేమిటి.? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది సర్వత్రా. వాస్తవానికి విభజన చట్టం పేర్కొన్నది 'మేగ్జిమమ్‌ పదేళ్ళు' అని. పదేళ్ళకు మించకుండా హైద్రాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది విభజన చట్టం. 

ప్రస్తుతానికైతే అమరావతిలో సచివాలయం ఇంకా అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ, శాసన మండలి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. సో, ఇంకో దఫా అసెంబ్లీ సమావేశాలు హైద్రాబాద్‌లోనే జరుగుతాయా.? లేదంటే, అప్పటికల్లా అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని అసెంబ్లీ, శాసనమండలి అందుబాటులోకి వస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. 

ఇక, ఉద్యోగులకు ఏదో ఒక రూపంలో హైకోర్టుతో అవసరాలుంటాయి. ఆ లెక్కన ప్రతి విషయానికీ ఉద్యోగులు అమరావతి నుంచి హైద్రాబాద్‌కి రావాల్సి వస్తే, అదో పెద్ద సమస్య. తెలంగాణ న్యాయవాదులు ఎలాగూ హైకోర్టు విభజన కోసం ఉద్యమిస్తున్నారు గనుక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కోసం తగిన చర్యలు చేపట్టాల్సి వుంటుంది. అంతేనా, కథ ఇంకా చాలా వుంది. విభజన చట్టంలో ఇంకా అనేక కన్‌ఫ్యూజన్‌లు వున్నాయి. కొన్ని సంస్థలు ఇంకా విభజనకు నోచుకోలేదు. వాటి విషయంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 'తగాదా' ముదిరి పాకాన పడ్తోంది. 

సో, ఉద్యోగులు పూర్తిగా హైద్రాబాద్‌ నుంచి అమరావతికి వెళ్ళిపోయినా, హైద్రాబాద్‌ మీద 'హక్కు'ని ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వదులుకునే అవకాశం వుండకపోవచ్చు. కేంద్రం గనుక రంగంలోకి దిగి, విభజన సమస్యల్ని పరిష్కరించి, ఇరు రాష్ట్రాల మధ్యా సఖ్యతతో కూడిన వాతావరణానికి బాటలేస్తే.. ఉమ్మడి సంస్థల విభజన పూర్తయి, హైకోర్టు విభజన కూడా జరిగితే.. అప్పుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌, హైద్రాబాద్‌ని వదులుకునే అవకాశముంటుంది.

Show comments