పాకిస్తాన్‌తో వాటర్‌ వార్‌కి మోడీ ‘సై’

పాపాల పాకిస్తాన్‌తో నీటి యుద్ధానికి తెరలేపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సింధూ నది జలాలు భారత ఆస్థి అనీ, అందులోంచి ఒక్క చుక్కని కూడా పాకిస్తాన్‌కి ఇచ్చేది లేదని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. భారత్‌ నుంచి సింధు నది పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ నదికి సంబంధించి కొన్ని ఉపశాఖల విషయంలో 1960లోనే ఇరు దేశాల మధ్యా ఒప్పందం కుదిరింది. 'ఇండస్‌ ఒప్పందం' అనే పేరుంది ఆ ఒప్పందానికి. 

అప్పటినుంచీ, భారత్‌ కన్నా పాకిస్తాన్‌ ఎక్కువగా నీటిని వినియోగించుకుంటోంది. దానికి ప్రతిగా భారత్‌ కూడా కొన్ని ఉపనదుల నీటిని వినియోగించుకుంటోంది. భారత్‌ - పాక్‌ మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ నీటి యుద్ధం కూడా భాగం కాబోతోందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ ప్రచారంపై తాజాగా ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. 

అయితే, నీటి ఒప్పందాల విషయంలో భారత్‌ ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా, తాము ఊరుకునేది లేదంటూ పాకిస్తాన్‌కి మద్దతుగా చైనా నిలిచింది. ఇప్పటికే భారత్‌కి చైనా గుండా వచ్చే బ్రహ్మపుత్రా నది విషయంలో ఝలక్‌ ఇచ్చింది. బ్రహ్మపుత్రా నది మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతూ, ఆ నదిలోంచి భారత్‌కి నీరు రాకుండా కట్టడి చేస్తోంది. ఇదంతా భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాతనే జరుగుతోన్న తంతు. 

కాగా, నీటి విషయంలో భారత్‌ నుంచి ఈ స్థాయి ప్రకటనను తాము ముందే ఊహించామనీ, తమతో పూర్తిస్థాయి యుద్ధాన్ని భారత్‌ కోరుకుంటోందనడానికి భారత ప్రధాని వ్యాఖ్యలే నిదర్శనమని పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. అయితే, ఇరు దేశాల సఖ్యత కోసం గతంలో ఒప్పందాలు జరిగాయనీ, భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతూ, భారత్‌ నుంచి వచ్చే నీటిని పాకిస్తాన్‌ వాడుకుంటామంటే తాము అంగీకరించేది లేదన్నది భారత ప్రభుత్వం వాదన. 

ఏదిఏమైనా, ఇప్పటికే భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నీటి యుద్ధం కూడా దానికి తోడైతే, పరిస్థితులు భగ్గుమంటాయన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, నీటిని గనుక ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లుగా ఆపగలిగితే, ఆ నది మీద ఆధారపడే పరీవాహక ప్రాంత ప్రజలు పాకిస్తాన్‌పై తిరగబడే పరిస్థితులూ చోటుచేసుకోవచ్చు. సర్జికల్‌ స్ట్రైక్స్‌తోనే దిగిరాని పాకిస్తాన్‌, నదుల నీటిని అడ్డుకుంటామంటే దారికొస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments