కాంగ్రెస్ ఆ ఛానల్ సపోర్ట్ నూ కోల్పోయినట్టే!

ఏపీలో తెలుగుదేశం పార్టీ కోసం జాకీలు వేసే మీడియా తెలంగాణలో జై కేసీఆర్ అంటోంది. ఏపీలో చంద్రబాబును నెత్తిన ఎత్తుకోవడం.. తెలంగాణలో కేసీఆర్ ను భుజాల మీద మోయడమే తన బాధ్యతగా వ్యవహరిస్తోంది ఒక వర్గం మీడియా. ఎలాంటి మొహమాటలకూ పోకుండా… ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం ఏమీ లేకుండా.. అధికారంలో ఉన్న పార్టీల భజన చేస్తోంది ఈ వర్గం మీడియా. రాసే ప్రతి వార్తలోనూ ఈ మీడియా వర్గాల ఉద్ధేశాలు ప్రస్ఫుటమవుతున్నాయి.

తెలంగాణలో కేసీఆర్ భజన ద్వారా తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ తీస్తున్నామని కూడా పచ్చ మీడియా మరిచిపోయింది. అధికారంలో ఉన్న వాడితో పని తప్ప.. ప్రతిపక్షాల వాయిస్ నో, ప్రజానీకం వాయిస్ నో వినిపించడం మా పని కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి మీడియా వర్గాలు. పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు కానీ.. ఏపీ వరకూ తెలుగుదేశం పార్టీ ని మోసే మీడియా వర్గం అంతా తెలంగాణ వరకూ కేసీఆర్ ను కీర్తిస్తోంది.

ఈ పనిలో తెలుగుదేశం పార్టీనే పట్టించుకోని ఈ మీడియా కాంగ్రెస్ ను అస్సలు ఖాతరు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకూ ఒక ఛానల్ అండ ఉండేది. మాజీ ఎంపీ వివేక్ కు చెందిన ఛానల్ ఇది. వివేక్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నంత కాలం ఈ ఛానల్ ఆ పార్టీ కార్యక్రమాల గురించి అంతో ఇంతో కవరేజీ ఇచ్చేది. పక్క తెలంగాణ అనిపించుకుంటున్న ఈ ఛానల్ రేటింగ్స్ విషయంలో కేసీఆర్ సొంత ఛానల్ కన్నా బెటర్ పొజిషన్ లోనే ఉంది. ఇలాంటి ఛానల్ కు వివేక్ ఓనర్ కావడం వల్ల.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ చేపట్టే ప్రతి కార్యక్రమానికీ అంతో ఇంతో కవరేజీ దక్కేది.

ఇప్పుడు వివేక్ కూడా కాంగ్రెస్ కు తలాక్ చెప్పేస్తుండటంతో.. తెలంగాణలో కాంగ్రెస్ ను గుర్తించే మీడియా వర్గం ఏదీ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో .. తెలంగాణలో ప్రభుత్వంలోని లొసుగుల వార్తలకు చిన్నపాటి ప్రాధాన్యత అయినా దక్కుతోందంటే అది జగన్ కు చెందిన మీడియాలోనే. మిగతా మీడియా వర్గాలన్నీ కేసీఆర్ అనుకూల వార్తలతోనే తరిస్తున్నాయి. మరి అంతర్గత కలహాలు, ఫిరాయింపులతో తప్ప మరో రకంగా వార్తల్లో నిలవలేకపోతున్న కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి ఊతమిచ్చే మీడియా ఏది? 

Show comments