గుజరాత్‌లోనూ యూపీ తరహా ప్రయోగమా?

దశాబ్దాల క్రితం కోల్పోయిన ఉత్తరప్రదేశ్‌ను మళ్లీ గెలుచుకోవాలని కాంగ్రెసు పార్టీ ఎంతగానో తాపత్రయపడింది. కాని ఘోరంగా విఫలమైంది. ఆ చరిత్ర ముగిసిపోయింది. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ చూపు గుజరాత్‌ పైన పడింది. ఇక్కడా పార్టీ వైభవం అంతరించి దశాబ్దాలు గడిచిపోయాయి. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌ కాబట్టి అక్కడ అధికారం చేపడితే మోదీపై విజయం సాధించినట్లే. అందుకే గుజరాత్‌పై కాంగ్రెసు పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై పార్టీలోని పెద్ద నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ పార్టీ మొట్టమొదటిసారిగా యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి కొత్త సంప్రదాయానికి (కాంగ్రెసులో) తెరతీసింది.

ఇలా ప్రకటించడం కాంగ్రెసుకు కొత్త. బీజేపీ అసోంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించి విజయం సాధించడంతో ఇది తనకూ లాభదాయకంగా ఉంటుందని భావించిన కాంగ్రెసు యూపీ ఎన్నికల్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి కొన్ని నెలల ముందుగానే ప్రచారం ప్రారంభించింది. కాని చివరకు కథ మరో ములుపు తిరిగి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో షీలా తెరమరుగయ్యారు. చివరకు కాంగ్రెసు ఘోర పరాజయం మూటగట్టుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అనేదానిపై చర్చ జరుగుతోంది. పార్టీ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ ఈమధ్య నాలుగు రోజులపాటు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శంకర్‌ సింగ్‌ వాఘేలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌సింహ్‌ సోలంకీ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు.

అసెంబ్లీలో కాంగ్రెసుకు 54 మంది ఎమ్మెల్యేలు ఉండగా 36 మంది అహ్మద్‌ పటేల్‌ను కలుసుకొని సమావేశమయ్యారు. ఈ ఎమ్మెల్యేలంతా శంకర్‌సింగ్‌ వాఘేలాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. ఒకవేళ వాఘేలాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఎన్నికల కమిటీ ఇన్‌చార్జిగా నియమించాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో ముఖ్యమంత్రిని అభ్యర్థిని ప్రకటించాలా? వద్దా? అనేది ఇంకా పార్టీ నాయకత్వం నిర్ణయించుకోలేదని అహ్మద్‌ పటేల్‌ చెప్పారు. త్వరలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన పార్టీ నాయకులతో జరిపే చర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఓ అవగాహనకు రావొచ్చు. గుజరాత్‌లో బీజేపీ వ్యూహమేమిటో తెలియదు. అసోంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి విజయం సాధించింది కాబట్టి యూపీలోనూ అదే పని చేస్తుందనుకున్నారు. కాని చేయలేదు.

భారీ మెజారిటీ సాధించినప్పటికీ పార్లమెంటు సభ్యుడైన ఆదిత్యనాథ్‌ యోగిని ముఖ్యమంత్రిని చేశారు. గుజరాత్‌ మోదీ, అమిత్‌షా సొంత రాష్ట్రం కాబట్టి బీజేపీ వ్యూహం పకడ్బందీగానే ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏ వ్యూహం విజయవంతమైంతుందో, ఏది విఫలమవుతుందో చెప్పలేం. ఒక రాష్ట్రంలో విజయవంతమైంది మరో రాష్ట్రంలో విఫలమవుతుంది. అందుకే ఆయా రాష్ట్రాల రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు ఉండాల్సిందే తప్ప ఒకసారి విజయవంతమైన వ్యూహం మరోసారి ప్రయోగిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. ప్రస్తుతం గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. కాని కాంగ్రెసు దాన్ని సొమ్ము చేసుకుంటుందా అనేది సందేహమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాహుల్‌ గాంధీ అంతర్గతంగా జరిపించిన సర్వేలో కాంగ్రెసుకు 35 నుంచి 40 సీట్లకు మించి రావని తేలిందట...! 

Show comments