ముద్రగడ హౌస్‌ అరెస్ట్‌.. పవన్‌ సంగతేంటి.!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి హౌస్‌ అరెస్ట్‌ అయ్యారు. రేపట్నుంచి, తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ 'పాదయాత్ర'ను చేపట్టాలనుకున్నారాయన. ఈ నేపథ్యంలోనే, కాస్సేపటి క్రితం కిర్లంపూడిలోని తన ఇంటి నుంచి రావులపాలెంకు బయల్దేరుతుండగా, ఇంటి వద్దనే ఆయన్ని పోలీసులు అడ్డగించారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. 

ఇంకేముంది, ముద్రగడ షరామామూలుగానే చేతులెత్తేశారు. పాదయాత్ర కోసం ముద్రగడ ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం.. ఇదంతా రొటీన్ తంతుగా మారిపోయింది. ఆయన నిరాహార దీక్ష చేసినా అంతే. పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేయడం, తలుపులు వేసేసుకుని, ఇంట్లో దీక్ష చేయడం, దాన్ని పోలీసులు భగ్నం చేయడం.. ఇదంతా ఓ ప్రసహనం. 

ఇదిలా వుంటే, విశాఖలో 'ఆంధ్రప్రదేశ్‌ యువత' ప్రత్యేక హోదా కాంక్షిస్తూ శాంతియుత నిరసనలకు సమాయత్తమవుతోంది. జనవరి 26న విశాఖలోని ఆర్‌కె బీచ్‌ ఇందుకు వేదిక కానుంది. అయితే, పోలీసు శాఖ మాత్రం, అలాంటి నిరసనలకు అవకాశమే లేదని తేల్చేసింది. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి వుంటుందనీ, వారు పోలీసులను ఆశ్రయిస్తే, అనుమతి సంగతి ఆలోచించేవాళ్ళమనీ డీజీపీ చెఫ్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖలో ఎలాంటి ఆందోళనలకూ అవకాశమివ్వబోమని డీజీపీ స్పష్టం చేసేశారు. 

మరోపక్క, ఈ శాంతియుత నిరసనలకు మద్దతిచ్చిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, డీజీపీ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుందనీ, పాలకులు ఇచ్చిన మాట తప్పినప్పుడు, ప్రజలు ప్రశ్నించడం సహజమేనని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు. 'ఆంధ్రప్రదేశ్‌ యువత' పేరుతో సోషల్‌ మీడియాలో, జనవరి 26 - నిరసనకు సంబంధించి పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. పవన్‌కళ్యాణ్‌తోపాటు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చారు. సంపూర్ణేష్‌బాబు అయితే, విశాఖకు తాను టిక్కెట్‌ తీసేసుకున్నట్లు ప్రకటించేశాడు. ఇంకొందరు సినీ నటులూ అదే బాటలో నడుస్తున్నారు.

మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చిత్ర విచిత్రంగా కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభం దీక్షకు అనుమతి కావాలి.. అదే అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల్ని చితక్కొట్టినా ఫర్లేదు. అధికార పార్టీ నిర్వహించే జన్మభూమి కార్యక్రమాలు రసాభాస అవుతున్నా, అక్కడ కొట్లాటలు జరుగుతున్నా వాటికి మాత్రం అనుమతి వుంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం, అలా ప్రశ్నించేందుకోసం గుమికూడే ప్రజల్లో 'అసాంఘీక శక్తులు' పోలీసులకు కన్పిస్తాయి. ఇది కదా, చంద్రబాబు జమానా అంటే.!

కొసమెరుపు: విశాఖలో జరిగే నిరసన కార్యక్రమానికి పవన్ మద్దతు అయితే ప్రకటించారుగానీ, అందులో పాల్గొంటానని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పవన్, ఈ విషయమై స్పష్టతనివ్వాల్సి వుంటుంది. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి వుంటుందని డీజీపీ చెప్పిన దరిమిలా, ఆ బాధ్యతని పవన్ తీసుకుంటారా.? తీసుకుంటే, ప్రభుత్వం అనుమతిస్తుందా.? ఇస్తే, పవన్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతారా.? వేచి చూడాల్సిందే.

Show comments