జయలలిత.. ఎన్టీయార్‌.. వైఎస్సార్‌.!

తమిళనాడులో 'అమ్మ' అంటే జయలలితనే. తెలుగునాట అన్న అంటే స్వర్గీయ నందమూరి తారకరామారావు మాత్రమే. తెలుగు రాజకీయాల్లో 'రాజన్న'గా చెరగని ముద్ర వేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఇప్పుడీ ముగ్గురికీ మధ్య ఓ పోలిక వుంది. ఈ ముగ్గురి మరణాలూ వివాదాస్పదం కావడమే ఆ 'పోలిక'. జయలలిత 74 రోజులపాటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ 74 రోజుల్లో ఏం జరిగింది.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఆ మిస్టరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నందమూరి తారకరామారావు విషయాన్నే తీసుకుంటే, ఆయన పరిస్థితీ అంతే. ప్రజాదరణలో జయలలిత, ఎన్టీయార్‌, రాజశేఖర్‌రెడ్డి ఒకర్ని మించినవారు ఇంకొకరు. అత్యంత ప్రజాదరణ వున్న ముగ్గురు రాజకీయ నాయకులు.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే, ఆ మిస్టరీలను ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేకపోవడం శోచనీయం. ఎన్టీఆర్‌ సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి పదవిలో  వుండగానే.. జయలలిత, వైఎస్సార్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరిలోనూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం వెరీ వెరీ స్పెషల్‌. ఆయన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడమే ఆ ప్రత్యేకత.

ముందుగా ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుకుందాం. తెలుగునాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎన్టీఆర్‌ అనూహ్యంగా టీడీపీకి దూరమవ్వాల్సి వచ్చింది. రికార్డు సమయంలో పార్టీ పెట్టి, ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌, తెలుగు ప్రజల గుండెల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏం లాభం.? అల్లుడి రూపంలో ఆయనకు 'పక్కలో బల్లెం' తయారయ్యింది. 'నాయకత్వ మార్పు' అని సదరు అల్లుడుగారు చెప్పుకోవచ్చుగాక, కానీ జరిగింది వేరు. అదే వెన్నుపోటు. ఆ వెన్నుపోటు కారణంగానే మానసిక క్షోభ అనుభవించి మరీ ఎన్టీఆర్‌ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆయన మరణంపై స్వయానా ఆయన పుత్రరత్నం హరికృష్ణే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, చివరికి ఏం జరిగింది.? ఏ చంద్రబాబు మీద అయితే హరికృష్ణ ఆరోపణలు చేశారో, అదే చంద్రబాబు పంచన హరికృష్ణ చేరారు. రాజ్యసభ పదవి దక్కించుకుని, తండ్రి మరణంపై వ్యక్తం చేసిన అనుమానాల్ని సమాధి చేసేశారు. అలా స్వర్గీయ ఎన్టీఆర్‌ మరణం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇక, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విషయానికొస్తే, ఓ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ మిస్‌ అయ్యిందంటే, అదీ నక్సలిజం ఎక్కువగా వుండే ప్రాంతంలో మిస్‌ అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వేగంగా స్పందించాలి.? ఇక్కడే, చాలా ఆలస్యం జరిగింది. దానికన్నా ముందు, కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ కాకుండా, పాత హెలికాప్టర్‌ని వినియోగించడం, అది కాస్తా కుప్ప కూలిపోవడంతో అనుమానాలు పదింతలయ్యాయి. 'నా తండ్రి మరణం వెనుక కుట్ర వుంది మొర్రో..' అని రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ నెత్తీనోరూ బాదుకున్నా, 'అది జస్ట్‌ ప్రమాదమే..' అని తేల్చేశారు. అంతే తప్ప, ప్రమాదం కాదేమో.. అన్న కోణంలో తగిన విచారణ జరగలేదు. అలా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డెత్‌ మిస్టరీ సమాధానం లేని ప్రశ్న అయికూర్చుంది. వైఎస్‌ మరణానంతరం, ఆయన కుటుంబాన్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వేధించిన తీరుని బట్టి కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయనుకోండి.. అది వేరే విషయం.

చివరగా జయలలిత వంతు.. 74 రోజులపాటు ఓ ముఖ్యమంత్రి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే, ఆమెకు సంభవించిన అనారోగ్యమేంటి.? దానికి ఆమె పొందుతున్న చికిత్స ఏంటి.? అన్నవి వెల్లడవ్వాలి కదా.! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. క్రిటికల్‌ కండిషన్‌లో ఆయన ఆసుపత్రిలో చేరితే, వెంట వెంటనే హెల్త్‌ బులెటిన్లు వచ్చాయి. ఇదీ అనారోగ్యం, ఇదీ వైద్యం, ఇదిగో పరిస్థితి.. అంటూ ఆ హెల్త్‌ బులెటిన్లలో పేర్కొన్నారు. అంతెందుకు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ కిడ్నీ పాడైతే, ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ జరిగింది. ఆమెకు సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ ఎలా బయటకు వచ్చింది.? ఆ తరహాలో జయలలితకు సంబంధించి ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడం చూస్తోంటే, అనుమానాలు రాకుండా వుంటాయా.? ఛాన్సే లేదు. పైగా, జయలలిత ఆసుపత్రిలో వుండగానే తమిళనాడులో రాజకీయం వెర్రితలలు వేసింది. జయలలిత వెంటే వుంటూ, ఆమె సన్నిహితురాలు శశికళ మొత్తం వ్యవహారాల్ని చక్కబెట్టేశారు. జయలలిత మరణించాక, శశికళ చక్రం తిప్పేశారు. ప్రస్తుతానికి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళ లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. పార్టీ సర్వసభ్య సమావేశం ఆమెను అధినేత్రిగా డిసైడ్‌ చేసేసింది కూడా. గతంలో, జయలలిత బయటకు గెంటేసిన శశికళ ఇప్పుడు 'చిన్నమ్మ' ఎలా అవుతుందో అన్నాడీఎంకేలో శశికళ వర్గంగా చెప్పుకుంటున్న నేతలే సమాధానం చెప్పాలి. Readmore!

'అమ్మ' మరణం గురించి దాదాపుగా అన్నాడీఎంకే పార్టీ మర్చిపోయింది. శశికళ మేనియాలో ఊగిపోతోందిప్పుడు. అంటే, తెరవెనుక కథ ఏదో జరిగింది. అదేంటన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అమ్మ జయలలిత, అన్న ఎన్టీఆర్‌, రాజన్న వైఎస్సార్‌.. ఈ ముగ్గురి మరణాలూ అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోతాయ్‌. కారణం.. అవి పొలిటికల్‌ డెత్స్‌ గనుక.

Show comments