పొత్తూరి గారు..ది రిపోర్టర్

జర్నలిస్ట్ ల్లో సీనియర్ జర్నలిస్టులు వేరు. వారి అనుభవం వారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది.అలాగే జర్నిలస్ట్ ల్లో రిపోర్టర్లు వేరు..విశ్లేషకులు వేరు. రిపోర్టర్లు కేవలం ఈవెంట్ ను రిపోర్టు మాత్రమే చేస్తారు. అనుభవం పండిన విశ్లేషకులు కేవలం రిపోర్టు చేసి ఊరుకోరు. ఆ వైనం మంచి చెడ్డలు చర్చిస్తారు. పాపులర్ పత్రికకు సంపాదకుడిగా పనిచేసి, తనకంటూ ఓ స్వంత అయిడెంటిటీ కలిగి, అపార అనుభవాన్ని సంతరించుకున్న పొత్తూరి వెంకటేశ్వర రావు లాంటి అనుభవం పండిన జర్నలిస్ట్ నుంచి నాలుగు వ్యాక్యాలు వచ్చాయి అంటే అవి ఎంతో విలువైనవిగా వుండాలి. అంతే కాక, మహరాజా సభలో ఆస్థానం విద్వాంసులు  తమ స్థానం మరింత పదిలం చేసుకోవడం కోసం చేసే గానాభజనాలా వుండకూడదు.

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు పేద్ద వ్యాసం రాసారు. పండగ వాతావరణంలో మహిళా పార్లమెంట్ అని. వెనకటికి ఓ సామెత వుంది. చదవేస్తే వున్న మతి పోయిందని. ఈ వ్యాసం చదివితే అదే గుర్తుకు వచ్చింది. ఇది వ్యాసం లా లేదు. జస్ట్ ఓ అమెచ్యూర్ జర్నలిస్ట్ మహిళా పార్లమెంట్ సదస్సు గురించి ఇచ్చిన బేసిక్ రిపోర్టు మాదిరిగా వుంది.

వార్త అంటే అయిదు డబ్ల్యులు అన్నది జర్నలిజం పాఠం. రిపోర్టులో అది కనిపిస్తుంది. కానీ సీనియర్లు రాసే విశ్లేషణలో కాదు. కానీ పొత్తూరి వారి వ్యాసం ఈ ప్రాధమిక రిపోర్టు మాదిరిగా నడిచింది. ఎక్కడ జరిగింది..ఏలాంటి ఏర్పాట్లు చేసారు..ఎంత విస్తీర్ణంలో జరిగింది. ఎన్ని కార్లు పట్టేంత పార్కింగ్ వుంది..ఎంత మంది వచ్చారు..వారిలో మచ్చుకు కొందరు ఏం మాట్లాడారు...ఇదీ వ్యాసం సారాంశం. పొత్తూరి వారి పేరు కిందన వుండడం తప్పితే, ఆంధ్రజ్యోతి లాంటి లీడింగ్ పత్రిక ఎడిటోరియల్ పేజీలో, అదీ సదస్సు ముగిసిన ఇన్నాళ్లకు వేసే అర్హత వున్న వ్యాసం అయితే కానే కాదని ఘంటాపథంగా చెప్పొచ్చు. సదస్సు తొలి రోజునో, మలి రోజునో అదే పత్రిక రిపోర్టరు ఎవరైనా ఇలాంటి వార్త రాయచ్చు..వేయచ్చు..అది రివాజు.

కానీ అనుభవం రంగరించుకున్న సంపాదకుడు ఇలా రాసి చేతులు దులుపుకోవడం ఏమిటో?
ఎమ్మెల్యే రోజా ఇన్సిడెంట్ నే పాపం మరిచిపోయారు పొత్తూరి వారు. వయస్సు రీత్యా వచ్చిన మరుపు అనుకోవాలా? ఏలిన వారి సేవలో తరిస్తే, ఈ వయోధిక సమయంలో కాస్త చేదోడు వాదోడుగా వుంటుందనుకునే భావన అనుకోవాలా? సీనియర్లు కూడా జర్నలిస్ట్ ధర్మాలు విస్మరిస్తే, కొత్త తరానికి ఎవరు దారి చూపుతారు?

Show comments