నోటితో పొగడి నొసటితో వెక్కిరించడం అంటే ఇదే. పైకి రాష్ట్రానికి రావాల్సిన అన్నింటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా సాధించుకోవడం కోసమే.. కేంద్రంతో మంచిగా ఉంటున్నా అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం.. చాన్సు దొరికినప్పుడు కేంద్రం చేతగానితనం మీద ఎడాపెడా సెటైర్లు వేయడం.. ఇదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరులాగా కనిపిస్తోంది. తన మీద వస్తున్న నిందలనుంచి జనం దృష్టిని పక్కకు మళ్లించడానికి, లేదా, తన మీద వస్తున్న నిందల్లో నిజం లేదన్నట్లుగా జనాన్ని భ్రమింపజేయడానికి ఆయన కేంద్ర ప్రభుత్వపు చేతగానితనాన్ని హైలైట్ చేస్తూ మాటల గారడీ చేస్తున్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రాతిపదిక మీదనే రాష్ట్ర విభజన జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చుపెట్టి, ప్రాజెక్టు తాలూకు ప్రతి పనినీ కేంద్రమే పూర్తి చేయాల్సి ఉంది. అయితే చంద్రబాబునాయుడు తన చేతుల మీదుగానే అంతా జరగాలన్నట్లుగా పని నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అడ్డగోలుగా దోచిపెడుతున్నదనే అనుమానాలు కలిగేలాగా.. దాదాపు 20వేల కోట్ల రూపాయల మేర ఎస్టిమేట్ అంచనా మొత్తాలను ప్రభుత్వం తరఫున సవరించేశారు. ఈ అడ్డగోలు దోపిడీ సవరింపులు అన్నీ అసలు ప్రాజెక్టుకు సొంతదారుగా పేర్కొనవలసిన కేంద్రప్రభుత్వంతో నిమిత్తం లేకుండానే చేసేశారు. రాయపాటి సాంబశివరావుకు చెందిన ఈ నిర్మాణ కంపెనీలకు ఈ ఎస్టిమేట్ల సవరింపు ద్వారా వేల కోట్ల రూపాయలను చంద్రబాబు దోచిపెట్టారనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. అసలు కేంద్రం చేయవలసిన ప్రాజెక్టుకు తగుదునమ్మా అంటూ తాను నెత్తిన వేసుకోవడం ఎందుకు? అని అడిగేవారు కూడా ఉన్నారు. ఇలాంటి విమర్శలు కూడా శృతిమించుతూ.. ప్రజలను ఆ దిశగా ఆలోచింపజేసే వరకూ వెళ్తుండడంతో చంద్రబాబునాయుడు సోమవారం నాడు దాని గురించి కూడా వివరణ ఇచ్చారు.
కాకపోతే.. ఆయన కేంద్రప్రభుత్వం చేతగానిది గనుక.. పనిచేయించే బాధ్యత తాను తీసుకున్నట్లుగా కలరింగ్ ఇవ్వడం ఇక్కడ విశేషం. ‘పోలవరం మీరెందుకు తీసుకున్నారు? అని అంతా అంటున్నారు. కేంద్రమే గనుక చేస్తూ ఉంటే అసలు అక్కడ పని జరిగేదేనా? ఒక్కరాయి అయినా కదిలేదా..? ఒక్క తట్ట మట్టి అయినా తీసేవాళ్లా?’ అంటూ కేంద్రం చేపట్టి ఉంటే అసలు ప్రాజెక్టు పనులే జరిగేవి కాదు.. వాళ్లు పట్టించుకోరు లేదా చేతగానివాళ్లు అని అర్థం వచ్చేలా చంద్రబాబునాయుడు ఎడా పెడా విమర్శలు గుప్పించేశారు.
కేంద్రంతో తాను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా.. నాకసలు ఢిల్లీలో ఏం పని? రాష్ట్రం కోసమే వారితో మంచిగా ఉంటున్నా.. లాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూనే.. కేంద్రం చేతగానిది.. వారు చేపట్టి ఉంటే అసలు ప్రాజెక్టును పట్టించుకునేవారు కాదు అన్నట్లుగా పుల్లవిరుపు మాటలు తనను సమర్థించుకోవడానికి సంధించడం చంద్రబాబుకే చెల్లింది. ఈ మాటలు గనుక కేంద్రప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తే.. పోలవరం పనులకోసం కనీసం అప్పులరూపంలో విదిలిస్తున్న నిధులకు కూడా అంటకత్తెర వేస్తుందేమోనని.. అసలే ప్యాకేజీకి చట్టబద్ధత అంటూ చంద్రబాబునాయుడు చేస్తున్న విన్నపాలను ఖాతరు చేయని కేంద్రం మరింత కన్నెర్ర చేస్తుందేమోనని పలువురు భావిస్తున్నారు.