హిట్ కాదు పంతం ముఖ్యం: బోయపాటి బ్లడ్

మొత్తానికి బోయపాటి శ్రీను అనుకున్నది సాధించాడు. జయజానకి నాయక సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన ఈ దర్శకుడు సినిమా రిలీజ్ విషయంలో కూడా తన పంతం నెగ్గించుకున్నాడు. మరో 2 సినిమాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఈరోజు తన సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. కేవలం బోయపాటి పంతం వల్లనే జయజానకి నాయక ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. తెరవెనక చాలా రభస చేసిన ఈ వివాదంపై బోయపాటి స్పందించాడు. నేనేందుకు తగ్గాలంటూ ప్రశ్నిస్తున్నాడు.

"ఎవరి సమస్యలు వాళ్లకున్నాయి. వాళ్ల కోసం నేనెందుకు తగ్గాలి. నా సినిమా ప్రింట్లు 5రోజుల కిందటే వెళ్లిపోయాయి. ఈ పరిస్థితుల్లో నా సినిమాను ఆపుకోలేను. మొదట ఈ సినిమాను జూన్ 23న అనుకున్నాం. తర్వాత జులై 7న అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆగిపోయాం. ఇప్పుడు ఈ తేదీని అందరికంటే ముందు మేం ప్రకటించాం. కానీ ఈరోజు సడెన్ గా ఓ రెండు సినిమాలు వచ్చిపడ్డాయి. కానీ ఈసారి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు". బోయపాటి శ్రీను రియాక్షన్ ఇది. 

బడ్జెట్ పెరిగినా, వడ్డీలు కట్టాల్సి వచ్చినా తను పట్టించుకోనని.. కానీ చెప్పిన తేదీకి రాకపోతే మాత్రం తనపై బయ్యర్లు పెట్టుకున్న నమ్మకం పోతుందని అంటున్నాడు బోయపాటి.

"బడ్జెట్ పెరిగి సినిమా అయిపోయిన తర్వాత నేను దాన్ని నా దగ్గరే ఉంచుకుంటే, నెలకు 4కోట్లు వడ్డీలే కట్టాల్సి ఉంటుంది. అయినా డబ్బుతో నాకు సంబంధం లేదు.

మేం 11వ తేదీ అనుకున్నాం. అదే తేదీ ఎనౌన్స్ చేశాం. ప్రింట్స్ వెళ్లిపోయాయి. కాబట్టి రిలీజ్ చేయాల్సిందే. నేను ఆగను. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే.. మహా అయితే నా సినిమాకు వంద థియేటర్లు తగ్గుతాయి. అదేం పెద్ద సమస్య కాదు. మా డిస్ట్రిబ్యూటర్లు మామూలోళ్లు కాదు. వాళ్లు బాగానే ప్లాన్ చేశారు". సినిమాపై ఇలా తనదైన ధీమా వ్యక్తం చేశాడు బోయపాటి. 

నిజానికి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు మరో స్టార్ తో పోటీపడేంత స్టామినా లేదు. పోనీ డేర్ చేసి రిలీజ్ చేసేద్దామంటే చిన్న బడ్జెట్ సినిమా కూడా కాదు. 40కోట్ల రూపాయల బడ్జెట్ దాటిపోయింది మూవీ. అలాంటి మూవీని సేఫ్ టైమ్ లో లాంచ్ చేయకుండా, థియేటర్లు తగ్గినప్పటికీ ఈరోజే విడుదల చేశారు.

"ప్రతి మనిషికి బ్లడ్ లో ఓ యాటిట్యూట్ ఉంటుంది. ఆ బ్లడ్ ను మనం ఆపలేం." ఈ మొత్తం వ్యవహారంలో బోయపాటి పంచ్ లైన్ ఇది.

Show comments