చంద్రబాబు, లిక్కర్‌.. ఈ లింకేంటి.?

స్వర్గీయ నందమూరి తారకరామారావు 'మద్య నిషేధాన్ని' అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా అమలు చేశారు. ముఖ్యమంత్రిగా అప్పట్లో ఎన్టీఆర్‌ తీసుకున్న ఆ నిర్ణయం ఓ సంచలనం. అన్ని అనర్ధాలకీ మద్యమే కారణం గనుక, దాన్ని నిషేధిస్తే వ్యవస్థ బాగుపడ్తుందన్న ఆలోచనతో ఎన్టీఆర్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అఫ్‌కోర్స్‌, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, దాన్ని ఎత్తేశారనుకోండి.. అది వేరే విషయం. 

దేశంలో చాలా రాష్ట్రాలకి మద్యమే ప్రధాన ఆదాయ వనరు. ఓ సినిమాలో తాగుబోతు కమెడియన్‌, తాగుబోతుల్ని ట్యాక్స్‌ పేయర్స్‌గా అభివర్ణిస్తాడు. అందులో చాలావరకు నిజం లేకపోలేదు. జనాన్ని మద్యానికి బానిసలుగా మార్చేసి, తద్వారా ఖజానా పెంచుకోవాలని పాలకులు చూస్తున్నారు గనుక.. అది నిజమే. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం, జనం నోట్లో ఇంకా ఎక్కువగా లిక్కరక్ష పోసేసి, ఇంకా ఎక్కువగా ఖజానా నింపుకోవాలనే చూస్తుంటుంది. 

పైకి మాత్రం, 'మద్య నియంత్రణ' అంటూ కొత్త పద ప్రయోగాన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేయడం మామూలే. ముందే చెప్పుకున్నాం కదా, చంద్రబాబుకి లిక్కర్‌ అంటే అదో ఇది. వైఎస్‌ హయాంలో బెల్ట్‌ షాపులపై నానా యాగీ చేసిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం బెల్ట్‌ షాపుల ఊసెత్తడంలేదు. పైగా, తాగండి.. తాగి ఊగండి.. అంటూ తాగుబోతులకి వీలుగా సరికొత్త మద్యం పాలసీలను ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తూనే వున్నారు. 

చంద్రబాబు మంత్రి వర్గంలోనే ఒకాయన, 'బీరు ఆరోగ్యానికి చాలా మంచిది..' అంటూ సెలవిచ్చారంటే, పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం.. మద్యం మహిళల జీవితాల్లో నిప్పు పెడుతోంది. కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది.. రోడ్డు ప్రమాదాల్లో మెజార్టీ మద్యం కారణంగా జరిగేవే. అత్యాచారాలు, హత్యల విషయంలోనూ మద్యం వాటా తక్కువేమీ కాదు. అయినాసరే, ప్రభుత్వాలకి మద్యం ఇచ్చే కిక్కే వేరప్పా.!  Readmore!

ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఇప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా మహిళలు నడుం బిగించారు. మద్యం సీసాలు పగులుతున్నాయ్‌.. రేపో మాపో ఆ మహిళల మీద లాఠీలు విరగబోతున్నాయ్‌. ఎందుకంటే, మద్యం లేకపోతే రాష్ట్ర ఖజానాకి దిక్కులేదు కదా.! పైగా అక్కడున్నది చంద్రబాబుగారాయె.!

చంద్రబాబుకి వ్యక్తిగతంగా చెడు అలవాట్లు లేకపోవచ్చుగాక.. కానీ, రాష్ట ప్రజలు మద్యానికి బానిసలైపోయేలా ’పాలసీలు‘ తీసుకొస్తున్నారంటే, ఆయనగారికి అందులో ఏం కిక్కు దొరుకుతుందో ేమో కదా.?

Show comments