చంద్రబాబు మారిన మనిషి.. సాక్ష్యమిదిగో

పెద్ద పాత నోట్ల రద్దు పుణ్యమా అని, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడులో చాలా మార్పులొచ్చాయి. 'నేనే మొదట డిమాండ్‌ చేశాను.. నా డిమాండ్‌తోనే పెద్ద పాత నోట్ల రద్దు జరిగింది..' అని చంద్రబాబు చెప్పేసుకుంటే, అంతకన్నా పెద్ద నోట్లను ప్రచారంలోకి తెచ్చి చంద్రబాబుకి పెద్ద షాకే ఇచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. అదే బహుశా, చంద్రబాబులో మార్పుకి కారణం కావొచ్చు. 

అయినా, చంద్రబాబు మారతారా.. ఛాన్సే లేదని అఉకోవద్దు. ఏమో, మారొచ్చుగాక. చిన్న మార్పు అయితే ఇప్పుడు కన్పిస్తోంది. మొన్నీమధ్యనే జీఎస్‌టీని తీసుకొచ్చింది కేంద్రం. అది తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకోవాలి.. కానీ చెప్పలేదంటే, చంద్రబాబు మారారనే కదా అర్థం.? 

ఇంకో సాక్ష్యం కావాలా.? అయితే, రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యవహారాన్నే తీసుకుందాం. 'రామ్‌నాథ్‌ కోవింద్‌కి అనుకూలంగా ఓటేయనుండడం నా అదృష్టం..' అని మాత్రమే సెలవిచ్చారు చంద్రబాబు. ఒకప్పటి చంద్రబాబు అయి వుంటే, నేనే నరేంద్రమోడీకి చెప్పి రామ్‌నాథ్‌ కోవింద్‌ని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టించానని చెప్పుకునేవారు. 

పై రెండు ఇన్సిడెంట్స్‌ని తీసుకుంటే, చంద్రబాబు మారారనే అనుకోవచ్చు. కానీ, మిగతా విషయాల్లో మాత్రం చంద్రబాబు మారలేదు. ఆయనంతే, మారరు.. మారరుగాక మారరు. ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన విషయాల్లో మాత్రం చంద్రబాబు మారారు. మారి తీరాల్సిందే. ఎందుకంటే, అక్కడ చంద్రబాబుని అంతలా మార్చేస్తున్నది నరేంద్రమోడీనే.! 

సరేగానీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ని ఇప్పుడు ఆకాశానికెత్తేస్తున్న చంద్రబాబు, 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోతే, ఆయన విషయంలో అప్పుడెలా స్పందిస్తారు.? అప్పుడు అధికారంలో వున్నవారిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు అనుకుంటే, అప్పుడు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోతే, చంద్రబాబు తీరు ఎలా వుంటుంది.? ఇంకెలా వుంటుంది, నాలిక మడతెయ్యడం చంద్రబాబుకి అలవాటే కదా.!

Show comments