చంద్రబాబు డైరెక్షన్‌లో 'నంద్యాల నాటకం'

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'నంద్యాల టీడీపీ నాటకాన్ని' అత్యద్భుతంగా నడిపించేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే విషయమై చంద్రబాబు, ఇటు మంత్రి అఖిలప్రియనీ, అదే సమయంలో శిల్పా మోహన్‌రెడ్డినీ 'ఆశల పల్లకీ'లో విడివిడిగా విహరింపజేస్తోంటే, స్థానిక నాయకత్వం.. ఈ నాటకాన్ని మరింత రక్తి కట్టించేస్తోంది. 

మంత్రి పదవి నుంచి పల్లె రఘునాథ్‌రెడ్డిని తొలగించినప్పుడు, బొజ్జల గోపాలకృష్ణని మంత్రి పదవి నుంచి ఊడబీకినప్పుడూ.. ఇలాంటి 'నాటకాలు' పెద్దగా నడిచిన దాఖలాల్లేవు. టీడీపీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకున్న అధికారాల్ని వినియోగించేసుకున్నారు.. ఆయా సందర్భాల్లో. ఇప్పుడూ అదే జరగబోతోంది. చంద్రబాబు మైండ్‌లో ఫలానా వ్యక్తి నంద్యాల అభ్యర్థి.. అని ఎప్పుడో ఫిక్స్‌ అయిపోయి వుంటుంది. ఆ లెక్కన, ఆయన ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టేసి వుండొచ్చు. 

కానీ, నాటకం రక్తికట్టాలంటే ఈ మాత్రం హంగామా తప్పదు. చివరిదాకా ఊరించి ఊరించి ఊస్సూరుమన్పించడంలో ఆ కిక్కే వేరప్పా.. అన్నట్లు చంద్రబాబు వ్యవహరించడం మామూలే. ఇప్పుడూ అదే జరుగుతోంది. చివరి నిమిషంలో దెబ్బ కొడితే, ఇక తేరుకోడానికి ఆస్కారం వుండదు. చంద్రబాబు చేయబోతున్నది అదే. వైఎస్సార్సీపీ వైపు శిల్పా మోహన్‌రెడ్డి అడుగులేస్తున్న దరిమిలా, ఆయన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు రచిస్తున్న వ్యూహంగా దీన్నంతా భావించాలా.? నంద్యాల నియోజకవర్గంలో భూమా అనుచరులకు పట్టు లేకుండా చేయడానికి ఆయన రచించిన వ్యూహంగా దీన్ని భావించాలా.? అన్నదానిపై రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఒక్కటి మాత్రం నిజం.. ఈ ఎపిసోడ్‌తో ఇటు శిల్పా వర్గం, అటు భూమా వర్గం.. కర్నూలు జిల్లాలో అభాసుపాలైపోతోంది. అదే చంద్రబాబు అసలు సిసలు వ్యూహం. 

Show comments