పవన్ 'దేశ్‌ బచావో': కొత్త సీసాలో..

ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్న 'దేశ్‌ బచావో' మ్యూజికల్‌ ఆల్బమ్‌ని, 'కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా' నేడే విడుదల చేసేస్తున్నారు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌. ఇంతకీ, ఈ ఆల్బమ్‌లో ఏముంటుంది.? ఈ విషయమై చాలా ఉత్కంఠ నెలకొంది. దానిక్కారణం.. పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీ కోసం ఈ ఆల్బమ్‌ రూపొందించారనే ప్రచారం జరగడమే. అయితే, ఈ ఆల్బమ్‌లో కొత్తగా ఏమీ లేదనే విషయం తొలి పాటని విడుదల చేసిన వెంటనే అర్థమయిపోయింది. 

'తమ్ముడు' సినిమాలోని 'ట్రావెలింగ్‌ సోల్జర్‌' పాటని రీమిక్స్‌ చేశారు.. అదీ బాంగ్రా స్టయిల్‌లో. దీంట్లోకి, అనూహ్యంగా పవన్‌కళ్యాణ్‌ వాయిస్‌తో కొన్ని పొలిటికల్‌ డైలాగులు వస్తాయి. అదీ ప్రత్యేక హోదా కోసం ఇటీవల పవన్‌కళ్యాణ్‌ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు. 'పాచిపోయిన లడ్డూ' అంటూ పవన్‌ చేసిన ఆ వ్యాఖ్యలు ఈ వీడియోలో విన్పించాయి.. అదీ హై ఓల్టేజ్‌ వాయిస్‌తో. కొత్తగా ఇందులో ఏమీ చేసినట్లు అనిపించదు. 

ఇక, రెండో పాట విషయానికొస్తే, దీన్ని 'జానీ' సినిమాలోంచి తీసుకున్నారు. 'నారాజుగాకురా..' అంటూ సాగే ఈ పాటకి ముందు, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి కొన్ని వాయిస్‌ ఇన్‌పుట్స్‌ ఉన్నాయి. పాట, రీమిక్స్‌ షరామామూలే. మొదటి పాట కంటే రెండో పాట, డల్ అనిపిస్తుంది.

ప్రస్తుతానికి (3 గంటల సమయానికి) విడుదలైన రెండు పాటలూ ఒకప్పుడు సూపర్‌ హిట్స్‌ అయినా, ఆ స్థాయిలో కొత్త పాటల్లో జోష్ కనిపించలేదు. ఒరిజినల్ పాటలు చాలా ఆలోచనాత్మకంగా వుంటాయి. వాటిని, సింపుల్‌గా రీమిక్స్‌ చేసి వదిలేశారంతే. ఇంపార్టెంట్ లిరిక్స్ మాయమైపోయాయి రీమిక్స్ పాటల్లో. పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లో చెప్పిన డైలాగుల తాలూకు పాత వాయిస్‌ని ఈ కొత్త ఆల్బమ్స్‌కి మిక్స్‌ చేయడం వల్ల అభిమానుల్లో జోష్‌ వస్తుందేమోగానీ, మామూలుగా అయితే ఒరిజినల్‌ పాటలే బెటర్‌.. అన్పించకామనవు. 

ఇంకో నాలుగు పాటలు విడుదలవ్వాల్సి వుండగా, ఆల్రెడీ రెండు పాటల తాలూకు మేటర్‌ తెలిసిపోయింది గనుక.. అద్భుతాలు ఆశించలేమేమో.!

Show comments