లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి-చంద్రబాబు చాకచక్యం

ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న తెలివితేటలు ఎవరికి లేవనే అనుకోవాలి. ఆయన తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించిన తీరు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన వైనం, మంత్రిగా ఆయనను నియమించడానికి రంగం సిద్ధం చేస్తున్న పద్దతి.. అందుకోసం ఎమ్మెల్సీగా టీడీపీ పాలిట్‌బ్యూరోతో తీర్మానం చేయించిన విషయం.. ఇవన్ని ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. ఇదే పని మరెవరైనా చేస్తే వారిని నానాయాగి చేయడంలో కూడా ఆయనే దిట్ట అని చెప్పాలి. ఒకప్పుడు ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడు అని ప్రకటించారు. దానిని చంద్రబాబు తెలివిగా మళ్లీ ఎన్‌టీఆరే వెనక్కి తీసుకునేలా చేశారు. ఎన్‌టీఆర్‌ అమాయకుడు. అల్లుడు చంద్రబాబుని నమ్మి మునిగిపోయాడు. ఆ సమయంలో చంద్రబాబును ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా నమ్మారు.

ఎన్‌టీఆర్‌ను దించితే తన క్యాబినెట్‌లో దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి అని నమ్మించారు. తన బావమరిది హరికృష్ణకు మంత్రిపదవి పక్కా అన్నారు. చివరికి బాలకృష్ణ కూడా చంద్రబాబుకే మద్దతు ఇచ్చారు. అంతా కలిసి వైస్రాయ్‌ హోటల్‌లో మకాంచేసి ఎన్‌టీఆర్‌ను ఒంటరిని చేసి ఆయనను పార్టీ అద్యక్షపదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేశారు. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో తనకు అనుకూల మీడియాలో తోడల్లుడు దగ్గుబాటికి మంత్రి పదవా అంటూ ఆగ్రహపూరిత సంపాదకీయాలు వచ్చేలా జాగ్రత్తపడ్డారని అంటారు. ఇదేదో కుటుంబ వ్యవహారం అంటారని సాకుచూపి దగ్గుబాటిని పక్కనబెట్టేశారు. అప్పటికే దగ్గుబాటికి అర్దం అయింది తాను మోసపోయానని, ఆ తర్వాత హరికృష్ణకు మంత్రిపదవి ఇచ్చారు కాని అది ఆరునెలల చందమే అయింది. ఆయన ఎమ్మెల్యే కాకపోవడమే కారణం. ఆ తర్వాత ఎన్‌టీఆర్‌ మరణంతో ఏర్పడిన ఖాళీలో తిరిగి శాసనసభకు ఎన్నికైనా మంత్రిపదవి మాత్రం దక్కలేదు. 

ఆ రోజులలో వారసత్వ రాజకీయాలు కాదు. సమర్ధత ఉండాలని అనేవారు. తదుపరి రోజులలో ఎవరైనా కుమారుడు లోకేష్‌ రాజకీయాలలోకి తీసుకువస్తారా అని అడిగితే మీకు ఎవరైనా చెప్పారా అని ఎదురు ప్రశ్నించేవారు. ఆ మాటకు వస్తే కుటుంబ నియంత్రణ, మేనరికాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. కాని ఇప్పుడు ఎంతమందిని వీలైతే అంతమందిని కనండి అని చంద్రబాబే చెబుతున్నారు. తదనంతర పరిణామాలలో ఏమి అంచనా వేసుకున్నారో తెలియదు కాని బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకుని కుమారుడికి మేనరికపు పెళ్లి చేశారు. కొంతకాలం లోకేష్‌ వ్యాపారాలలోనే ఉంటారని అనుకునేవారు. కాని ఆయనను కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్‌ అన్నారు. తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. లోకేష్‌ అవకాశం వస్తే వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని ప్రకటించేవారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కాని లోకేష్‌కు  మంత్రిపదవి ఇవ్వాలని ఇంటి నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిందన్న ప్రచారం వచ్చింది. చివరికి చంద్రబాబు ఆ ఒత్తిడికి లొంగి ఎమ్మెల్సీగా తీసుకువచ్చి కుమారుడిని తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి రంగం రెడీ చేసుకున్నారు. 

నిజానికి లోకేష్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉంటే రావడంలో తప్పులేదు. కాకపోతే.. ఎంత వ్యూహాత్మకంగా చేశారన్నదే చర్చ. తాము చెప్పిన మాటలకు ఎంత విరుద్ధంగా చేయగలుగుతున్నారన్నది పాయింట్‌. రాహుల్‌ గాంధీకి అవకాశం వచ్చినా ప్రధాని పదవి చేపట్టకపోవడంతో నష్టపోయారన్న అభిప్రాయం ఉంది. దానిని కూడా గమనంలోకి తీసుకుని చంద్రబాబు కుటుంబంలో లోకేష్‌కు మంత్రిపదవి ప్రతిపాదన గట్టిగా చేశారని అంటారు. అయితే ఇరవై మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యేలలో  ఒకరిద్దరు లోకేష్‌ కోసం రాజీనామా చేస్తామని కూడా ప్రకటించారు. అయినా చంద్రబాబునాయుడు ఉపఎన్నికలకు సిద్దపడక, పరోక్ష ఎన్నిక ద్వారానే అంటే దొడ్డిదారినే తన కుమారుడిని చట్టసభలోకి తీసుకురావాలని నిర్ణయించడం ఆయన బలహీనతగానే కనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్‌టీ రామారావు శాసనమండలిని రద్దు చేయించారు. 

దొడ్డిదారిన పదవులలోకి వస్తున్నారని ఆయన భావంచేవారు. ఇప్పుడు పలువురు ఓడిపోయిన నేతలకు, ఎన్నికలలో పోటీచేయని నేతలకు ఇది ఆశ్రయిస్తుండడం విశేషమే కదా. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కేశవ్‌ వంటివారు శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినా ఎమ్మెల్సీలు కాగలిగారు. అలాగే టీడీపీకి నిధులు బాగా ఖర్చు పెట్టారనుకునే విద్యాసంస్థల అధినేత నారాయణతో పాటు, ఇప్పుడు స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు కూడా ఇది ఆశ్రయం ఇస్తోంది. ఒకనాటి తెలుగుదేశం రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు ఎంత తేడానో గమనించారా!

Show comments