సూపర్‌ స్టార్‌ 'పొలిటికల్‌' దేవుడు.!

రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాలు ప్రతిసారీ బెడిసికొడ్తుండడంతో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'వేదాంత ధోరణి'లో అభిమానులకు క్లాస్‌ తీసుకున్నారు. పలుమార్లు అభిమానుల్ని ఊరించిన రజనీకాంత్‌, ఎట్టకేలకు తాజాగా నేడు అభిమానులతో భేటీ అయ్యారు. రజనీకాంత్‌ రాజకీయాలపై ప్రకటన చేస్తారని ఆశించిన అభిమానులు, ఉస్సూరుమనాల్సి వచ్చింది.. ఈ భేటీలో.! 

అవును మరి, సినిమాల్లోకి రావాలన్నది దైవేచ్ఛ అనీ, రాజకీయ రంగ ప్రవేశంపైనా తానిప్పుడు ఎలాంటి స్పష్టతా ఇవ్వబోననీ, దేవుడు ఆదేశించినట్లే నడచుకుంటాననీ రజనీకాంత్‌ చెప్పుకొచ్చారు. దాంతో, అభిమానులు ఒకింత షాక్‌కి గురయ్యారు. 'రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాల్సిందే..' అంటూ అభిమానులు నినాదాలైతే చేశారుగానీ, వారి నినాదాలకు విలువ లేకుండా పోయింది. నిజానికి, అభిమానుల్లో 'పొలిటికల్‌ ఆకాంక్ష' రగిలించిందే రజనీకాంత్‌. 

రెండు దశాబ్దాల క్రితమే, రజనీకాంత్‌ రాజకీయాల వైపుగా అడుగులేసి, అడుగు వెనక్కి తీసుకున్నారు. 'అప్పట్లో ఓ తప్పిదం జరిగింది.. మళ్ళీ అలాంటి తప్పు చేయదలచుకోలేదు..' అని అటూ ఇటూగా ఆనాటి రాజకీయ పరిస్థితులపై క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్‌. అప్పుడు సరే, 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీతో స్నేహం సంగతేంటి.? అన్న ప్రశ్న అభిమానుల నుంచి రాకముందే, 'కొందరు నా పేరుని రాజకీయాల్లో వాడుకుంటున్నారు..' అంటూ వివరణ ఇచ్చుకున్నాడీ సూపర్‌ స్టార్‌. 

రజనీకాంత్‌ దేవుడు చెప్పినట్లు నడచుకుంటారేమోగానీ, రజనీకాంత్‌నే దేవుడనుకుంటున్నారు అభిమానులు. అలా రజనీకాంత్‌ని దేవుడిలా భావించబట్టే, ఆయన్నుంచి డిజాస్టర్‌ సినిమాలొచ్చినా.. ఇంకా తమ అభిమాన హీరోకి బ్రహ్మరథం పడ్తున్నారు. రాజకీయాలపై రజనీకాంత్‌ ఎన్ని నాటకాలాడుతున్నాసరే, తమ అభిమాన హీరో పొలిటికల్‌ లీడర్‌ అవుతాడనీ, ముఖ్యమంత్రి అవుతాడనీ ఎదురుచూస్తున్నారు. ప్చ్‌.. రజనీకాంత్‌, తన అభిమానుల్ని మరోసారి నిరాశపర్చాడు. 

రజనీకాంత్‌ని రాజకీయ పార్టీలు వాడుకోవడం సంగతి తర్వాత.. రజనీకాంత్‌ మాత్రం తన అభిమానుల్ని మేగ్జిమమ్‌ వాడేసుకుంటున్నాడు. రజనీకాంత్‌ ఒకరే కాదు, సినీ గ్లామర్‌ని రాజకీయాలకు ఆపాదించి, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నవారంతా అభిమానులతో ఆడుకోవడం, వారిని వాడుకోవడం మామూలే.!

Show comments