చెప్పుదెబ్బకి నిషేధం దెబ్బ.!

ఓ పార్లమెంటు సభ్యుడ్ని నిషేధ జాబితాలో చేర్చడమంటే అంతకన్నా అవమానం ఇంకేముంటుంది.? చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే మరి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై భారత విమానయాన సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) నిషేధం విధిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆయన చేసిన తప్పు అందరికీ తెల్సిన విషయమే. అది తప్పు కాదు, నేరం. ఢిల్లీ విమానాశ్రయంలో సుకుమార్‌ అనే మేనేజర్‌పై దాడి చేశారు ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌. పైగా, అక్కడికేదో తాను ఘనకార్యం చేసినట్టు చెప్పుకున్నారు కూడా.! 

ఇప్పుడు ఆ గొప్పలే, రవీంద్ర గైక్వాడ్‌ కొంప ముంచేసింది. శివసేన ఇప్పటికే, ఆ ఎంపీకి నోటీసులు జారీ చేయడం, తమ ఎంపీ తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించడం తెల్సిన విషయాలే. 'ఒక్కసారి కాదు, మొత్తం 25 సార్లు కొట్టాను.. సాధారణ చెప్పుతో కాదు.. గట్టిగానే కొట్టాను.. కొట్టినందుకు గర్వపడుతున్నాను.. ఇకపైనా అలాంటివి చేస్తాను..' అని చెప్పుకున్న రవీంద్ర గైక్వాడ్‌ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎఫ్‌ఐఏ నిషేధంతో, ఇకపై రవీంద్ర గైక్వాడ్‌ అసలంటూ విమానం ఎక్కే అవకాశాన్నే కోల్పోయాడు. సిబ్బందికి క్షమాపణ చెప్పడం తప్ప, ఆయనకిప్పుడు వేరే మార్గం లేదు. ఆల్రెడీ కేసులు నమోదు కాగా, కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Show comments