పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే ఒత్తిడి తీవ్రమైతే, ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలన్న యోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నారట. ఇది ఇప్పటి మాట కాదు, చాలాకాలంగా విన్పిస్తున్నదే. నిజానికి, ఈ 'గాసిప్' పుట్టిందే, గులాబీ వనంలో. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళబోతున్నారంటూ చాన్నాళ్ళ క్రితం ఈ గాసిప్ తెరపైకొచ్చింది.
ఎట్టకేలకు ఈ వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. అదీ చట్టసభల్లో. బడ్జెట్ స్పీచ్ సందర్భంగా శాసనమండలిలో మాట్లాడిన కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదనీ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనీ సెలవిచ్చారు. అయితే మొన్నటికి మొన్న, 'ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100కి పైగా సీట్లు మనవే..' అంటూ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కేసీఆర్ పంపిన 'ముందస్తు' సంకేతాల మాటేంటట.?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం కాకపోయినా, సవాలక్ష లెక్కలతో, తనదైన రాజకీయ వ్యూహాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాల్ని అయితే కొట్టి పారేయలేం. చట్టసభల సాక్షిగా కేసీఆర్ క్లారిటీ ఇచ్చినాసరే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ప్రచారమైతే కొనసాగుతూనే వుంటుంది. అందునా, ఈ ప్రచారానికి గులాబీ శ్రేణులే ఆజ్యం పోస్తుండడం గమనార్హమిక్కడ.
ముందస్తు వ్యూహాలతో, విపక్షాల్ని కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేయడమనే 'పెద్ద వ్యూహాన్నే' కేసీఆర్ అమలుపరుస్తున్నారు. అయితే, అన్ని సందర్బాల్లోనూ ఈ ముందస్తు వ్యూహాలు ఫలించకపోవచ్చు. ఆ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఎప్పటికప్పుడు తన వ్యూహాల్ని మార్చుకుని, రాజకీయంగా ముందడుగు వేయడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి, పరిస్థితులు పూర్తిగా తనకు అనుకూలమనుకుంటే.. ఏ క్షణాన అయినా కేసీఆర్, 'ముందస్తు' నగారా మోగించే అవకాశమైతే సుస్పష్టం.