కుటుంబమన్నాక కలహలు మామూలే. అయితే ఈ 'అమ్మ' కుటుంబంలోని కలహల తీరు వేరు. 'అమ్మ' ఫొటో పెట్టుకుని మరీ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు. 'నువ్వా.. నేనా..' అంటూ బాహాబాహీకి తలపడ్తున్నారు రాజకీయం అంటేనే అంత. అదో పెద్ద వింత.! 'అమ్మ' బతికున్న రోజుల్లో ఒక్కరైనా సరే, ఆమె ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించారా.? ఛాన్సే లేదు. 'అమ్మ' కూర్చున్న పదవిపై కన్నెత్తి చూసేవారా.? అవకాశమే లేదు. ఇప్పుడు అమ్మ లేదు గనుక, ఆ కుర్చీ నాదంటే నాదంటూ రచ్చకెక్కుతున్నారు. పైగా, అది 'అమ్మ ఆశయం' అట.!
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? ఇది రాజకీయాల్లో తరచూ వాడే మాట. రాజకీయమంటేనే సిగ్గుమాలినతనం అయిపోయింది. జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళినా, ఆ పదవిపై కన్నెత్తే సాహసం ఎవరూ చేయలేకపోయారు. 74 రోజులపాటు జయలలిత అచేతనావస్థలో ఆసుపత్రిలో వున్నా, ఆ పదవి గురించి ఆలోచించాలంటేనే భయమేసింది శశికళకి అయినా, పన్నీర్ సెల్వంకి అయినా. కాస్తలో కాస్త, అమ్మ జయలలిత స్వయంగా పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు గనుక, ఆయన తప్ప, శశికళ ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు.
జయలలిత ముఖ్యమంత్రి పీఠమెక్కించిన పన్నీర్ సెల్వంని, శశికళ పీకి పారేశారు. ఇదీ, అమ్మ మీద శశికళకి వున్న గౌరవం. పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితులు ఏర్పడినా, ముఖ్యమంత్రి పదవి మీద శశికళకి ఆశ చావలేదు. పైగా, ఇప్పుడు 'అన్నాడీఎంకే అంటే అమ్మ కుటుంబం.. ఆ కుటుంబం చీలిపోయే పరిస్థితి లేదు..' అంటూ శశికళ చెబుతోంటే, జనం నవ్విపోతున్నారు.
ఎమ్మెల్యేలను శశికళ దాచి పెట్టలేదట. ఔరా.? ఈ శతాబ్దానికే ఇది అతి పెద్ద జోక్. రిసార్టుల్లో దాచెయ్యడమేంటి.? దాచెయ్యలేదనడమేంటి.? ఎమ్మెల్యేలు వుండాల్సింది వారి వారి నియోజకవర్గాల్లో. కానీ, నియోజకవర్గ ప్రజల్ని వదిలేసి, రిసార్టుల్లో పండగ చేసుకుంటున్నారంటే, అదీ బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయేలా వారిని మాయం చేయడమంటే ఇంతకన్నా దిక్కమాలిన రాజకీయం ఇంకేముంటుంది.?
బీజేపీ ఓ దిక్కుమాలిన పొలిటికల్ గేమ్ ఆడింది.. తద్వారా శశికళకు తృటిలో ముఖ్యమంత్రి పదవి దూరమైపోయింది.. ఇప్పుడు ఎంత గింజుకున్నా ఆ పదవి ఆమెకు దక్కే అవకాశమే కన్పించడంలేదు. దాంతో, శశికళలో ఈ స్థాయి అసహనం మామూలే. కానీ, అసలామె రాజకీయాలకు పనికొస్తుందా.? 'అమ్మ' వారసురాలినని చెప్పుకునే నైతిక హక్కు ఆమెకు వుందా.? లేనే లేదు.