ఆ సీఎం గొప్పోడు.. చంద్రబాబో మరి.?

టీడీపీలో ఫైర్‌ బ్రాండ్‌గా మారిన ఎంపీ కేశినేని నాని మరోమారు వార్తల్లోకెక్కారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి హేట్సాప్‌ చెప్పిన కేశినేని నాని, వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇరకాటంలో పడేశారు. 'అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.. అక్రమంగా నడుస్తోన్న ప్రైవేటు బస్సులకు వత్తాసు పలుకుతున్నారు..' అంటూ విరుచుకుపడిన కేశినేని నాని, అక్కడ ఓ ఎంపీ లేఖతో ప్రభుత్వం స్పందిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. 

అయినాసరే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవినీతిని ఉపేక్షించడంలేదట. చంద్రబాబు ఆశయాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయకపోవడమే ఈ సమస్యకు కారణమని తేల్చారు. రవాణా శాఖ అధికారుల వల్ల ప్రభుత్వానికీ చెడ్డపేరు వస్తుందని కేశినేని నాని గుస్సా అయ్యారు. 'మంచి చెబితే అధికారులు వినాల్సిందే.. ఆ మంచి చెప్పిన వ్యక్తి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఇంకెవరైనా అది రాజకీయ కోణంలో చూడకూడదు.. ప్రజలకు మేలు చేసే పని చెయ్యాల్సిందే..' అని అధికారులకు ఉచిత సలహాలలిచ్చేశారు నాని. ఈసారి నాని, కేశినేని ట్రావెల్స్‌ అధినేతగా కాకుండా ఎంపీ హోదాలో మీడియా ముందుకొచ్చారట. 

మార్చ్‌ నెలలో తన ట్రావెల్స్‌ సంస్థని మూసివేస్తున్నట్లు ప్రకటించి నాని, వార్తల్లోకెక్కిన విషయం విదితమే. రవాణా శాఖ కమిషనర్‌పై దాడికి యత్నించిన కేసులో కేశినేని నాని సహా, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీకే చెందిన ఎమ్మెల్యేపై ఆరోపణలున్నాయి. ఆ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా తెలివిగా 'సెటిల్‌' చేఉసేశారనుకోండి.. అది వేరే విషయం. 

అంతలా కేశినేని నానిని చంద్రబాబు వెనకేసుకొస్తే, అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి హేట్సాఫ్‌ చెప్పి, కేశినేని నాని - చంద్రబాబు పరువు తీసేస్తారా.? రాజుగారి మొదటి భార్య మంచిది.. అంటే రెండో భార్య చెడ్డదనే కదా అర్థం.! 

అన్నట్టు, ప్రైవేటు ట్రావెల్స్‌పై నాని మరో ఆసక్తికరమైన ఆరోపణా చేశారండోయ్‌. బస్సుల పొడవుని మూడున్నర అడుగుల మేర పెంచడం ద్వారా 'సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ'ని పాడుచేస్తున్నారనీ, ప్రమాదాలకు కారణం డ్రైవర్లు కానే కాదనీ, యజమానులేనని కేశినేని నాని సెలవిచ్చారు. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

Show comments