ఒవైసీ సాబ్‌.. మీరున్నది ఇండియాలో.!

భారతవని తన ఒడిలో అన్ని మతాల్నీ నిక్షిప్తం చేసుకుంది. 'హిందూస్తాన్‌' అన్న పేరున్నా, అన్ని మతాలకు చెందినవారూ భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఆయా మతాల స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టాలున్నాయి. రాజ్యాంగం అన్ని మతాలకు చెందినవారికీ సమానమైన రీతిలో రక్షణ కల్పిస్తోంది. అసలు, మతం పేరుతో రాజకీయాలు చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి. న్యాయస్థానాలు ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి.

కానీ, దేశ ప్రజల దౌర్భాగ్యమేంటంటే, ఇంకా దేశంలో మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తుండడం. అసలంటూ మతం పేరుతో రాజకీయాలు చేసేవారిని రాజకీయాల్లో వుండనీయరాదనే చర్చ ఓ వైపు జరుగుతున్న వేళ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ 'ముస్లింలు తేరుకోకపోతే.. ముస్లింలు తలచుకుంటే.. ముస్లింలు ఆలోచించుకోవాలి.. ముస్లింలకు వ్యతిరేకంగా..' అంటూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు.

గతంలో ఇదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసులు నమోదవడం, ఆయన్ని అరెస్ట్‌ చేయడం తెల్సిన విషయాలే. ఓ ప్రజా ప్రతినిథిగా వుంటూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అదీ మతం ప్రాతిపదికన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అక్బరుద్దీన్‌ ఒవైసీకి కొత్తమీ కాదు. అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యల్ని ఆయన సోదరుడు, మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సమర్థించడమూ కొత్త కాదు.

'చట్ట సభల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారు..' అంటూ అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేషనల్‌ మీడియాలో అయితే, ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతోంది. చిత్రంగా, తెలుగు మీడియాలో మాత్రం ఒవైసీ వ్యాఖ్యల్ని దాదాపుగా అంతా లైట్‌ తీసుకున్నారు.

ఇంతకీ, అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తారా.? టీఆర్‌ఎస్‌కి బయటనుంచి మద్దతిస్తున్న మజ్లిస్‌ పార్టీ ఏం చేసినా, ఆ పార్టీ నేతలెలాంటి వివాదాలకు కారకులవుతున్నా, 'స్నేహధర్మం' పాటించి లైట్‌ తీసుకుంటారా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే. 

ఒక్కటి మాత్రం నిజం. సర్వ మతాల సమ్మేళనంతో, పరమత సహనంతో వర్దిల్లుతున్న భారతదేశంలో తామున్నానన్న విషయాన్ని చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఆయన సోదరుడు అసదుద్దీన్‌ ఒవైసీ మర్చిపోకూడదు.

Show comments