నారా క్రియేషన్స్‌: 'ఇళ్ళు' కట్టి చూడు

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ పట్టణ పేదల కోసం ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని షురూ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఇళ్ళను అత్యద్భుతంగా నిర్మించేస్తారట.

ఒకటి కాదు రెండు కాదు.. వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా లక్షన్నర ఇళ్ళను నిర్మించేస్తామంటూ చంద్రబాబు బహు గొప్పగా ప్రకటించేశారండోయ్‌.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ముచ్చటగా మూడేళ్ళయ్యింది. ఈ మూడేళ్ళ కాలంలో చంద్రబాబు, సొంతంగా హైద్రాబాద్‌లో అత్యద్భుతమైన 'రాజప్రసాదాన్ని' తన కుటుంబం కోసం నిర్మించేసుకున్నారు.

అప్పటికే వున్న ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని కట్టాల్సి రావడంతో, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో తన కుటుంబాన్ని వుంచడం అప్పట్లో విమర్శలకు తావిచ్చిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, క్యాంప్‌ ఆఫీస్‌ కోసం హైద్రాబాద్‌లోనూ భారీగా ఖర్చు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో చంద్రబాబు ఇంటి కోసం చేసిన ఖర్చూ అంతా ఇంతా కాదు.

గడచిన మూడేళ్ళలో చంద్రబాబు తన సొంత ఇళ్ళ కోసం చేసిన ఖర్చులు, ఈ క్రమంలో తెరపైకొచ్చిన వివాదాలూ అన్నీ ఇన్నీ కావు. అదే, ప్రజల దగ్గరకొచ్చేసరికి మాత్రం ముహూర్తం కుదరలేదాయె. ఎలాగైతేనేం, ఎట్టకేలకు 'పేదల గూడు మీద' చంద్రబాబు సర్కార్‌కి కనికరం లభించింది.

కేంద్రం ఇచ్చే నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధుల్ని వెచ్చించి పట్టణ పేదల కోసం ఇళ్ళ నిర్మాణం అనే బృహత్‌ కార్యక్రమాన్ని చేపడుతోంది. అన్నట్టు, ఈ పథకానికి సంబంధించి చాలాకాలం క్రితమే కేంద్రం ప్రకటన చేసింది. ఇక్కడా, జరిగిన ఈ జాప్యమంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే కావడం గమనార్హం.

మరోపక్క, తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ 'డబుల్‌ బెడ్రూమ్‌' ఇళ్ళ పథకాన్ని బీభత్సమైన పబ్లిసిటీ కోసం వాడేసుకుంటోంది. నిర్మించిన ఇళ్ళ సంఖ్యకీ, నిర్మిస్తామని చెబుతున్న ఇళ్ళ సంఖ్యకీ పొంతనే లేదు.

మూడేళ్ళలో జరిగిన నిర్మాణాల్ని లెక్కల్లోకి తీసుకుంటే, లక్ష కాదు కదా.. వెయ్యి ఇళ్ళనైనా కేసీఆర్‌ సర్కార్‌ పూర్తి చేస్తుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అయినాసరే చంద్రబాబుతో పోల్చితే కేసీఆర్‌ కాస్త బెటర్‌.

ఎందుకంటే, పదో పాతికో వందో రెండొందలో ఇళ్ళయితే నిర్మించేసి లబ్దిదారులకి కేసీఆర్‌ అందజేసేశారు. చంద్రబాబు ఇంకా మాటల దశలోనే వున్నారు. ఆయనగారి మాటలు కోటలు దాటేయడం మామూలే. మరి, లక్షన్నర ఇళ్ళ సంగతేంటంటారా.? ప్రస్తుతానికి మాటల్లో వుంది.. చేతల్లోకి ఎప్పుడొస్తుందో ఏమో.!

Show comments