ప్రభాస్‌ అభిమానులకి ఓ గుడ్‌ న్యూస్‌

'బాహుబలి' కోసం చాలా ఎక్కువ టైమ్‌ కేటాయించిన ప్రభాస్‌, ఇకపై చకచకా సినిమాలు చేసేస్తాడని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టే, 'బాహుబలి' రిలీజ్‌ సందర్భంగా థియేటర్లలో తన కొత్త సినిమా 'సాహో'కి సంబంధించి ఓ చిన్న టీజర్‌ వదిలాడు ప్రభాస్‌. 'ఇట్స్‌ షో టైమ్‌' అంటూ 'సాహో' సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఆ టీజర్‌ అప్పట్లో పెద్ద సంచలనం. 

అయితే, అప్పటినుంచీ ఇప్పటిదాకా 'సాహో'కి సంబంధించి పెద్దగా అప్‌డేట్స్‌ లేకపోవడంతో ప్రభాస్‌ అభిమానులు ఒకింత డీలాపడ్డారు. అప్పుడప్పుడూ ప్రభాస్‌కి సంబంధించి డిఫరెంట్‌ గెటప్స్‌లో ఫొటోలు బయటకొస్తుండడంతో, ఆ మేకోవర్‌ చూసి, ఇది 'సాహో' కోసమేనని అభిమానులు పండగ చేసుకోవాల్సి వస్తోంది. కానీ, ప్రభాస్‌ గెటప్‌ విషయమై ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. 

ఇదిలా వుంటే, ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమయ్యిందనీ, ప్రభాస్‌ లేకుండానే కొన్ని రోజులు షూటింగ్‌ జరిపేశారనీ, అతి త్వరలో ప్రభాస్‌ షూటింగ్‌కి హాజరవుతాడనీ, ఏకబిగిన ఆరు నెలల్లో 'సాహో' షూటింగ్‌ పూర్తయిపోతుందనీ, ఈ సినిమాకి పనిచేస్తోన్న సినిమాటోగ్రాఫర్‌ 'మాది' ప్రకటించడం గమనార్హం. అదే గనుక జరిగితే, ప్రభాస్‌ అభిమానులకి అంతకన్నా కావాల్సిందేముంటుంది.? 

ఓ వైపు సినిమా నిర్మాణం, ఇంకో వైపు విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌.. వెరసి 'సాహో' శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుందట. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్‌ పేరు కూడా ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం.

Show comments