గల్ఫ్ దేశాలకు నాయకత్వం వహించడానికి సౌదీ అరేబియా ఉబలాటపడుతూంటుంది. పైగా దానికి అమెరికా మద్దతు కూడా వుంది. మధ్యప్రాచ్యంలో వున్న కొన్ని దేశాల పాలకులలో కొందరితో శత్రుత్వం, కొందరితో స్నేహం నెరపుతూంటుంది. పడని దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో వుంది. ఎమిరేట్స్ వంటి దేశాలు సౌదీ బాటలో నడుస్తూ వుంటాయి. కానీ 27 లక్షల జనాభా వున్న చిన్న దేశమైన కతార్ మాత్రం తన బాటన తను పోతూ వుంటుంది. ఇరాన్ వంటి దేశాలతో సఖ్యంగా వుంటుంది. సౌదీకి దాన్ని చూస్తే ఒళ్లు మంట.
ఇరాన్ పేరెత్తితేనే కంపర మెత్తిపోయే ట్రంప్ మే 22న సౌదీ అరేబియా సందర్శించి దానికి పూర్తి మద్దతు ప్రకటించాడు. రెండు రోజుల తర్వాత కతార్ అధికారిక వెబ్‌సైట్‌లలో ట్రంప్‌పై విమర్శలు, ఇరాన్‌పై ప్రశంసలు గుప్పిస్తూ వ్యాసాలు వచ్చాయి. 'ఇజ్రాయేల్‌తో స్నేహాన్ని కొనసాగిస్తాం, సౌదీ అరేబియా, యుఎఇ, ఈజిప్టుల నుంచి అవసరమైతే రాయబారులను వెనక్కి రప్పిస్తాం' అనే ప్రకటనలు కనబడ్డాయి.
ఇది చూడగానే సౌదీ తదితర దేశాలకు గంగవెర్రులెత్తాయి. కతార్ మీడియాను బహిష్కరించాయి. 'ఆ పోస్టింగ్స్ మేం పెట్టలేదు. మా వెబ్‌సైట్ ఎవరో గానీ హ్యాక్ చేశారు.' అని కతార్ ప్రకటించింది. కానీ అప్పటికే కతార్ మీడియాపై నిషేధం ప్రకటించాయి కాబట్టి సౌదీ తదితర దేశాల ప్రజలకు కతార్ వెర్షన్ తెలియరాలేదు. అవి అక్కడితో ఆగలేదు. జూన్ 5న కతార్‌తో అన్ని దౌత్య సంబంధాలు తెంపుకున్నాయి. భూ, సముద్ర, వాయు ప్రయాణాలను, రవాణాను నిషేధించాయి.
రెండు వారాల్లోగా తమ పౌరులను కతార్ నుంచి వెనక్కి రప్పించుకోవాలని, తమ దేశాల్లో వున్న కతారీలను వెనక్కి పంపేయాలని ఆజ్ఞలు జారీ చేశాయి. దాని వలన కతార్ విమానాలను తమ భూభాగాలపై అనుమతించటం లేదు. కతార్ ఓడలను తమ నౌకాశ్రయాల్లోకి రానీయటం లేదు. వీరు ప్రకటన చేసిన మర్నాడు బెహరైన్, మాల్దీవులు, యెమెన్, లిబియాలు కూడా అటువంటి ప్రకటనే చేశాయి. కతార్‌పై సానుభూతి చూపుతూ వ్యాసాలు ప్రచురించేవారికి 15 సం||ల శిక్ష వేస్తామని యుఎఇ హెచ్చరించింది.
దీంతో కతార్‌లో కల్లోలం ప్రారంభమైంది. వారి ఆహార పదార్థాల దిగుమతుల్లో 40% సౌదీ నుంచే వస్తాయి. ప్రస్తుతం కతార్ విమానాలు చుట్టు తిరిగి వెళుతున్నాయి. ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా కతార్ వెబ్‌సైట్ హ్యాక్ అయిందా? అయిందనే అని అమెరికన్ గూఢచారి సంస్థ ఎఫ్‌బిఐ అంటుంది. గల్ఫ్ దేశాల మధ్య కలతలు సృష్టించడానికి రష్యాయే హ్యాక్ చేయించిందని వారి ఆరోపణ.
కానీ కతార్ ప్రతినిథి మంగళవారం ఒక ప్రకటనలో సౌదీ తదితర దేశాలనే దోషులుగా పేర్కొన్నారు. ఆ దేశాలే తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఆ ప్రకటన పెట్టి, దాన్ని సాకుగా చూపి, తమను యిరకాటంలో పెట్టాయని ఆరోపించారు. ఒక ప్రకటన యింతటి వివాదానికి దారి తీస్తుందా అనే సందేహం రావచ్చు. దానికి చాలా నేపథ్యం వుంది.
సౌదీ అరేబియాకు కతార్‌ను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలనే కోరిక ఎప్పణ్నుంచో వుంది. షేక్ ఖలీఫా తానీ (1932-2016)ని కతార్ ఎమిర్ (పాలకుడు)గా చేయడానికి, కొనసాగడానికి అది దోహదపడింది. ఖలీఫా 1957 నుంచి తన సోదరుడు అహ్మద్ బిన్ అలీ కాబినెట్‌లో మంత్రిగా వుండేవాడు. తర్వాత ప్రధానిగా కూడా చేశాడు. 1972లో అతని నుంచి అధికారాన్ని గుంజుకుని తనే ఎమిర్ అయిపోయాడు. దానికి సౌదీ సహకరించింది. కతార్‌లో సహజవాయు నిక్షేపాలు చాలా వున్నాయి. వాటిని మరీ ఎక్కువగా వాడవద్దని సౌదీ యిచ్చిన సలహాను అతను మన్నించాడు.
1995లో అతను స్విజర్లండ్‌లో వుండగా అతని కొడుకు హమాద్ తిరుగుబాటు చేసి తను ఎమిర్ అయిపోయాడు. ఇతను ఆర్థిక విధానాల్లో కానీ, విదేశాంగ విధానాల్లో కానీ సౌదీని ఎదిరించి స్వతంత్రంగా వ్యవహరించాడు. తండ్రి విధానాలకు విరుద్ధంగా తమ కున్న వాయునిక్షేపాలను విస్తారంగా వాడకంలోకి తెచ్చాడు. ప్రపంచంలో గ్యాస్ నిలువలు అధికంగా వున్న రష్యా, ఇరాన్‌ల సరసన చేరాడు. ఇరాన్‌తో చేతులు కలిపి సౌత్ పార్స్ అని ప్రపంచంలోనే పెద్ద గ్యాస్ ఫీల్డ్‌ను అభివృద్ధి పరిచాడు. సహజవాయువు ఎగుమతి చేసే దేశాల్లో ప్రథమస్థానాన్ని అందుకుని, గల్ఫ్‌లో అత్యంత సంపన్న దేశంగా మార్చాడు.
కతార్ జనాభాలో 25% మంది భారతీయులే. అక్కడి ప్రజల తలసరి ఆదాయం 1.40 లక్షల డాలర్లు. తనకున్న ఆర్థికబలంతో రాజధాని దోహాలో అనేక అంతర్జాతీయ పోటీలు నిర్వహించసాగాడు. 2022లో ఫీఫా వ(ర)ల్డ్ కప్ అక్కడే నిర్వహించబడుతోంది. వీటితో బాటు ప్రపంచంలో అనేక చోట్ల స్థిరాస్తులు కొన్నాడు. సౌదీని లక్ష్యపెట్టడం మానేశాడు.
ఇదంతా సౌదీకి రుచించలేదు. ఇతన్ని దింపేసి ఫ్రాన్సులో తలదాచుకున్న తండ్రిని మళ్లీ అధికారంలోకి తేవాలని 1996లోను, 2005లోని తిరుగుబాటు చేయించబోయింది కానీ అవి సఫలం కాలేదు. ఈ కుట్రలలో సౌదీలతో చేతులు కలిపారన్న అనుమానంపై హమాద్ 5 వేల మంది కతార్ పౌరులకు పౌరసత్వ హక్కులు తీసివేశాడు. చివరకు పెద్దాయన 2016లో పోయాడు. సౌదీకి నచ్చని అంశాల్లో కతార్ ఆర్థికంగా బలపడడం ఒకటే కాదు, రాజకీయంగా అది వీళ్లకు ప్రతికూలంగా మారింది.
2011లో ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్‌కి వ్యతిరేకంగా ముస్లిం బ్రదర్‌హుడ్ ఆందోళనలు ప్రారంభించినపుడు ముబారక్‌కి సౌదీ తదితర దేశాలు మద్దతివ్వగా, హమాద్ బ్రదర్‌హుడ్‌కి మద్దతిచ్చాడు. బ్రదర్‌హుడ్ గెలిచి, మోర్సీ ప్రధాని అయినపుడు అతని ప్రభుత్వానికీ యిచ్చాడు. కానీ కొన్నాళ్లకు మిలటరీ కుట్ర చేసి మోర్సీని దింపేసింది. అలాగే పాలస్తీనా తీవ్రవాద సంస్థ ఐన హమాస్‌కు హమాద్ మద్దతివ్వగా మితవాద సంస్థ ఫతాకు చెందిన పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు సౌదీ మద్దతిస్తుంది. అరబ్ స్ప్రింగ్ రోజుల్లో లిబియా, సిరియాలలో తిరుగుబాటు సంస్థలకు హమాద్ ఆర్థిక, హార్దిక సహాయాలు అందించాడు.
వీటన్నిటినీ మించి గల్ఫ్ దేశాలను మండించిన చర్య ఏమిటంటే అల్-జజీరా టీవీ నెట్‌వర్క్‌ను కతార్ ప్రారంభించడం! అరబ్ స్ప్రింగ్ సమయంలో అది గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాలలోని తిరుగుబాటుదారులకు మద్దతిస్తూ వారి ప్రభుత్వాలకు ముప్పు తెచ్చిపెట్టింది. పాశ్చాత్య మీడియా దాచేసిన కోణాలను వెలికి తీస్తూ అల్-జజీరా తన ఇంగ్లీషు, అరబిక్ భాషల ప్రసారాల ద్వారా అరబ్ దేశాల్లో చాలామంది అభిమానులను సంపాదించుకుని ప్రాచుర్యంలోకి వచ్చింది.
అది ప్రజల్లో అసంతృప్తిని పెంచి, తీవ్రవాదాన్ని పోషిస్తోందని సౌదీ తదితర దేశాల ఆరోపణ. 2002లో సౌదీ రాచకుటుంబాన్ని విమర్శిస్తూ అల్ జజీరా ఒక కార్యక్రమం ప్రసారం చేసినపుడు సౌదీ ప్రభుత్వం దోహా నుండి తన రాయబారిని వెనక్కి రప్పించేసి ఐదేళ్లపాటు ఏ ఉన్నతాధికారినీ పంపలేదు.
ఎవరేమన్నా కతార్ తన దారిలో తను దూసుకుపోతోంది. కొన్ని ప్రాంతాల ఆధిపత్యంపై బెహరైన్‌తో దానికి వివాదం వుంది. అది 2001లో పరిష్కారమైంది. సౌదీతో సరిహద్దు సమస్య వుంది. పరిస్థితులు యిలా వుండగానే హమాద్ తన 61వ యేట 2013లో తన అధికారాన్ని కొడుకు తామీమ్‌కు అప్పగించి స్వచ్ఛందంగా గద్దె దిగిపోయాడు. కొడుకు వచ్చిన తర్వాతైనా కతార్ విధానాల్లో మార్పు వస్తుందేమో అనుకుని సౌదీ ఆశపడింది కానీ తామీమ్ తండ్రి విధానాలే పాటిస్తున్నాడు.
2014 మార్చిలో సౌదీ, బహరైన్, యుఏఇ తమ రాయబారులను కతార్ నుంచి వెనక్కి రప్పించుకున్నపుడు, రాజీ యత్నాలు జరిగి, కాస్త దిగి వచ్చాడు. 1979లో ఇరాన్‌లో రాజరికాన్ని కూలదోసి విప్లవ ప్రభుత్వం ఏర్పడ్డాక, దానికి వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలన్నీ కలిసి జిసిసి (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) ఏర్పరచుకున్నాయి. దానికి అమెరికా సైనిక సహాయం అందిస్తోంది.
విదేశ వ్యవహారాల్లో, భద్రతాపరమైన విషయాల్లో జిసిసి చెప్పినట్లు వింటానని, బ్రదర్‌హుడ్ సభ్యులను తమ దేశం నుంచి పంపించివేస్తాననీ, ఈజిప్టులో అల్ జజీరా ఆఫీసు మూసేస్తాననీ తామీమ్ ఒప్పుకున్నాడు. సౌదీకి రాజు కావాలని ఆశపడుతున్న ప్రస్తుత యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఎఇ యువరాజు మొహమ్మద్ బిన్ జాయేద్ యిది చాలదని, తామీమ్‌కు యింకా బాగా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ ఘటన జరిగింది.
2015 డిసెంబరులో కతార్ రాజకుటుంబానికి చెందిన కొందరు, వారి స్నేహితులు మొత్తం 26 మంది ఇరాక్‌లో ముతన్నా ప్రాంతంలోని అడవిలోకి వేటకు వెళదామనుకున్నారు. అక్కడ టెర్రరిస్టులు ఎవరూ రారు కదా అని ఇరాక్‌ను సంప్రదిస్తే రారు, సురక్షిత ప్రాంతమే అని హామీ యిచ్చింది. సరే అని వెళ్లారు. ఇరాన్ మద్దతిచ్చే షియా మిలిటెంట్ గ్రూపు కతేబ్ హెజ్‌బొల్లా అనే సంస్థ వారిని కిడ్నాప్ చేసింది. వదలాలంటే పెద్ద మొత్తం యివ్వాలంది.
కతార్ వాళ్లకు యివ్వడం యిష్టం లేదు. నెలల తరబడి చర్చలు జరిగాయి. 15 నెలల తర్వాత రాచకుటుంబీకులు కూడా వున్నారు కాబట్టి వాళ్లడిగినంతా యివ్వక తప్పదనుకున్నారు. ఈ ఏప్రిల్ 15న అర బిలియన్ డాలర్ల విలువైన కరెన్సీని 23 సంచుల్లో పట్టుకెళ్లి బాగ్దాద్‌కు వెళ్లి యిచ్చారట. మేం ఏమీ ఏమీ యివ్వలేదని కతార్ అంటోంది కానీ ఆరు రోజుల తర్వాత బందీలందరూ విడుదలయ్యారు. ఈ విధంగా ఇరాన్‌కు, అది మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులకు డబ్బు సమకూర్చినందుకు సౌదీ తదితరులకు కతార్‌పై విపరీతంగా కోపం వచ్చింది.
అది జరిగిన నెల్లాళ్లకే ట్రంప్ సౌదీ రావడం, కతార్ వెబ్‌సైట్‌లో కామెంట్స్ రావడం, తన్మూలంగా నిషేధం విధించడం జరిగాయి. పరిస్థితి చక్కదిద్దుదామని కువాయిత్ రాజు షేక్ సబా అల్-అహ్మద్ జూన్ 6న రియాఢ్‌కు వెళ్లాడు. అవేళ తమీమ్ తమపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రసంగిద్దామనుకున్నా సబా సలహాపై ఆగిపోయాడు. గతంలో సబా కతార్-సౌదీ వివాదాల్లో పెద్దమనిషిగా వ్యవహరించాడు. అందుకే యీ గౌరవం.
కానీ యీసారి పని కాలేదు. టర్కీ, సుదాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తున్నాయి. సౌదీ, యుఎఇ దురుసుగా వున్నాయి. ''ముస్లిమ్ బ్రదర్‌హుడ్‌తో, ఇరాన్‌తో, హమామ్‌తో కతార్ అన్ని సంబంధం బాంధవ్యాలు తెంచుకోవాలి.'' అంటున్నాయి. కతార్ ఒక్కటే టెర్రరిస్టులకు సాయం చేస్తోందనడానికి లేదు. అలాటి ఆరోపణలు సౌదీలపై, ఎమిరేట్స్‌పై కూడా వున్నాయి.
ఈ వివాదంలో ఎటువైపు మొగ్గాలి అనే విషయంపై అమెరికాలో కాస్త గందరగోళం వుంది. రెండవ గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా సౌదీ అరేబియా, బహరైన్‌లతో బాటు కతార్‌లోని అల్ ఉదీద్ వద్ద కూడా మిలటరీ బేస్‌లు నెలకొల్పింది. అక్కడ 11 వేల మంది అమెరికన్, సహచర దేశాల సైనికులు పనిచేస్తున్నారు. అక్కణ్నుంచి 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆపరేట్ అవుతున్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకింగా అక్కడి దేశాలన్నీ కూడగట్టాలని చూస్తున్న ట్రంప్‌కు సౌదీ డబ్బిచ్చి ఆకట్టుకుంటోంది.
కానీ కతార్‌ను పూర్తిగా వ్యతిరేకం చేసుకునే స్థితిలో అమెరికా లేదు. రాజీకి ప్రయత్నించినా సౌదీ, యుఎఇ దిగి రావటం లేదు. 'మేం చెప్పబోయే దానికి కతార్ తల ఒగ్గకపోతే యీ బహిష్కారం ఏళ్ల తరబడి సాగుతుంది' అని ప్రకటనలు చేస్తున్నాయి. దానితో విసిగిన యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ట్రంప్ గతంలో మాట్లాడినదానికి భిన్నంగా మంగళవారం నాడు సౌదీ, యుఎఇలను నిలదీసింది - ''ఏ కారణాల చేత మీరు కతార్ దిగ్బంధం చేస్తున్నారు? అది మొదలై రెండు వారాలైనా మీకేం కావాలో యిప్పటివరకు మీరెందుకు చెప్పటం లేదు? కతార్ వెబ్‌సైట్ హ్యాక్ కాలేదనడానికి, కతార్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని అనడానికి మీ వద్ద వున్న ఆధారాలేమిటి?'' అని.
స్టేట్ డిపార్టుమెంటుకు అధినేతగా వున్న రెక్స్ టిల్లర్‌సన్ గతంలో ఎక్సాన్ మోబిల్ అనే ఆయిల్ కంపెనీని నిర్వహించాడు. దానికి కతార్‌లో చాలా పెట్టుబడులున్నాయి. అందుకే కాబోలు అతను 'అందరూ దిగి రావాలి.'' అంటున్నాడు. ''ముందు మా మీద విధించిన ఆంక్షలు ఎత్తివేస్తేనే చర్చలకు వస్తాం.'' అంటున్నాడు కతార్ విదేశాంగ మంత్రి. ఇది ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి.
(ఫోటోలు - సౌదీ అరేబియాలో ట్రంప్, కతార్ పాలకుడు తమీమ్)
- ఎమ్బీయస్ ప్రసాద్
-mbsprasad@gmail.com