పోసానీ ఏంటీ ఆవేశం.!

పోసాని కృష్ణమురళి ఒకప్పటి స్టార్‌ రైటర్‌.. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారాడు, నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇప్పుడు నటుడిగా సెటిలైపోయాడు. పోసాని కృష్ణమురళి పేరు చెప్పగానే, 'లవ్‌ యూ రాజా' అన్న మాట గుర్తుకొస్తుంది. అది ఆయన ఊతపదం. అదే సమయంలో, పోసాని అనగానే 'ఓ తరహా వీరావేశం' కన్పిస్తుంటుంది. కాస్తంత తింగరితనం అన్పించినా, మొండితనం అన్పించినా, అందులో ఏదో 'కిక్‌' వుంటుంది. దటీజ్‌ పోసాని కృష్ణమురళి. 

తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌ నుంచి విశాఖకో అమరావతికో తరలిపోతుందనే ప్రచారం నేపథ్యంలో పోసాని కృష్ణమురళి తనదైన స్టయిల్లో స్పందించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అరివీరభయంకరుడైన భక్తుడిలా మారిపోయాడాయన. 'చెన్నయ్‌ వదిలేసి, హైద్రాబాద్‌ వచ్చేస్తామా.. హైద్రాబాద్‌ వదిలేసి మళ్ళీ విశాఖకో అమరావతికో వెళ్ళిపోతామా.? తెలంగాణ ప్రజలు ఛీత్కరిస్తారు. తెలుగు సినీ పరిశ్రమ ఏమైపోవాలి.? తెలుగు సినిమాల్ని తెలంగాణలో బ్యాన్‌ చేసేస్తారు..' అంటూ ఆవేశంతో ఊగిపోయాడు పోసాని. 

'నేనిక్కడే వుంటా, తెలంగాణ సినిమాలు తీసుకుంటా.. నేనెక్కడికీ వెళ్ళను..' అని పోసాని కృష్ణమురళి తెగేసి చెప్పాడుగానీ, ఒకవేళ తెలుగు సినీ పరిశ్రమ తరలి వెళ్ళాలనుకుంటే పోసాని మాటలు చెల్లవు. వరుసగా సినిమాలు తీసేంత సీన్‌ కూడా ఆయనకి లేదిప్పుడు. పోసాని అంతే, ఆయన ఆవేశమూ అంతే.! 

అయినా, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ తరలి వెళ్ళిపోతుందని ఎవరన్నారు.? హైద్రాబాద్‌లానే, అమరావతిలోనో, విశాఖలోనో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందితే కాదనేవారెవరు.? తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో వుండిపోయిందిగనుక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం తెలుగు సినిమాల్ని చూడటం మానేశారా.? లేదే.! చెన్నయ్‌ నుంచి హైద్రాబాద్‌కి తెలుగు సినీ పరిశ్రమ రావడానికే నానా కష్టాలూ పడాల్సి వచ్చింది. ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

సో, ఇప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికో వెళ్ళిపోతుందనుకోవడం హాస్యాస్పదం.. ఆ పేరుతో ఆవేశం ఎవరు ప్రదర్శించినా అంతకన్నా మూర్ఖత్వం ఇంకొటుండదు. భవిష్యత్తులో తెలుగు సినిమాకి ఇంకో ఇల్లు ఆంధ్రప్రదేశ్‌లో తయారయితే అవ్వొచ్చుగాక.. దానికి అభ్యంతరం వ్యక్తం చేసెదెవరు.?

Show comments