వీరిద్దరే బాహుబలులు...ఫిక్స్‌ అయినట్లేనా...?

'బాహుబలి' సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి ఆ పేరును రాజకీయ నాయకులు, మీడియావారు ఎక్కువగా వాడుకుంటున్నారు. బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో విజయం సాధించడం, మరో రెండు రాష్ట్రాల్లో ప్రబుత్వాలు ఏర్పాటు చేయడంతో మీడియా ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేసింది. వార్తల శీర్షికల్లో ఆయనను బాహుబలి అని రాయడం ప్రారంభించారు. బలమైన నాయకుడిని బాహుబలి అనడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. కొంతకాలం కిందట తెలంగాణ కాంగ్రెసులో బాహుబలి ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది. రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి కదా. కాబట్టి టీ-కాంగ్రెసును ముందుకు నడిపించే, గెలిపించే బాహుబలి ఎవరు? అని అర్థమన్న మాట. కాంగ్రెసు పార్టీలో బలమైన నాయకుడు అనుకున్న సీనియర్‌ నేత జానారెడ్డి కాంగ్రెసు కంటే టీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఉపయోగపడుతున్నారనే అభిప్రాయముంది. ఆయన తమకు పెద్ద తలనొప్పిగా మారారని కాంగ్రెసు నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెసు తరపున అసెంబ్లీలో నాయకుడైన జానా రెడ్డి ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈమధ్య కాంగ్రెసును రక్షించడానికి బాహుబలి వస్తాడని, పార్టీని ముందుకు తీసుకెళతాడని వ్యాఖ్యానించారు. ఇది రోజుల తరబడి కాంగ్రెసులో, రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కాంగ్రెసును రక్షించే బాహుబలి ఎవరు? అనే ఉత్కంఠ రేగింది. బాహుబలి రావడమంటే ప్రస్తుత టీ-కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి ఉద్వాసన చెప్పడమే. కాని ఆ ప్రమాదం తప్పినట్లు తాజా సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క నాయకత్వంలోనే 2019 ఎన్నికల్లో కాంగ్రెసు బరిలోకి దిగుతుందని ఏఐసీసీ నాయకుడు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని, మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని కుంతియా చెప్పినట్లు సమాచారం. సో...ఉత్తమ్‌, భట్టి నాయకత్వానికి ఢోకా లేదని అర్థమైపోయింది. ఉత్తమ్‌కుమార్‌ను మారుస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.  రాష్ట్ర నాయకత్వాలను మార్చి కొత్త తలకాయలను పెడితే పార్టీని గెలిపిస్తాయని హైకమాండ్‌ విశ్వాసం.

పార్టీ నాయకత్వాలను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చడమే సమస్యలకు పరిష్కారమని కాంగ్రెసు మొదట్నుంచీ నమ్ముతున్న సిద్ధాంతం. కాంగ్రెసు ఎప్పుడూ వ్యక్తుల ఛరిస్మాను నమ్ముకుంటుందే తప్ప విధానాలను, సిద్ధాంతాలను కాదు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ తెలంగాణలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని మార్చి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను నియమించాలని చెప్పారట. టీఆర్‌ఎస్‌పై కాంగ్రెసు ఏమాత్రం పోరాడలేని స్థితిలో ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి జరిగిన పలు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌ నాయకత్వంలోని కమిటీయే  వచ్చే ఎన్నికల్లోనూ పనిచేస్తే పార్టీ చిత్తుగా ఓడిపోతుందనే అభిప్రాయముంది. 'పీతల సీసాకు మూతక్కర్లేదు' అనే సామెత కాంగ్రెసుకు బాగా వర్తిస్తుంది. ఒక నాయకుడిని అధ్యక్షుడిగా నియమించగానే ఆయన్ని దించడానికి ప్రయత్నాలు మొదలవుతూనేవుంటాయి. ఉత్తమ్‌ విషయంలోనూ ఇదే జరిగింది.

అధ్యక్ష పదవి కోసం అజర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనకు వచ్చాయి. విచిత్రమేమిటంటే...ఈ జాబితాలో మాజీ హీరోయిన్‌, గత ఎన్నికల్లో ఓడిపోయిన విజయశాంతి పేరు కూడా ఉండటం. అసలామె కాంగ్రెసులో ఉందా? అనే విషయం బహుశా ఆ పార్టీ నాయకులు కూడా మర్చిపోయారేమోనని అనుమానంగా ఉన్న నేపథ్యంలో ఆమె పేరు పరిశీలనకు రావడం విచిత్రమే. ఇక అజారుద్దీన్‌ పేరు తెర మీదకు రావడానికి కారణం ముస్లింలను ఆకర్షించడానికి. వారిని టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వైపు నుంచి కాంగ్రెసు వైపు తిప్పుకోవడానికి. నిజానికి అజర్‌  హైదరాబాదీ అయినా తెలంగాణ కాంగ్రెసు రాజకీయాలతో ఆయనకు సంబంధం లేదు. కాంగ్రెసు పార్టీలో పదవులు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. దీనిపై సస్సెన్స్‌ కొనసాగుతూనే ఉంటుంది. మరి ఉత్తమ్‌, భట్టి పదవులకు ఢోకా లేకపోవడం పక్కాయేనా...?

Show comments