పాచి ప్రసంగాల ప‌వ‌న్‌...'ప్రత్యేక' పొలిటీషియ‌న్‌...

మూడు ప‌బ్లిక్ మీటింగుల‌య్యాయి. ఆయ‌న వ‌చ్చాడు. మాట్లాడాడు. వెళ్లాడు. జ‌నం వ‌చ్చారు. విన్నారు. వెళ్లారు. అంతే. అంత‌కు మించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీటింగుల్లో చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. ఆయ‌న రెండో స‌భ‌లో ప్యాకేజీ పేరుతో పాచిల‌డ్డూలు ఇచ్చార‌ని అంటూ విమ‌ర్శించాడు. అదేమో గాని ఆయ‌న ప్రసంగాలైతే మాత్రం నిఖార్సయిన పాచి క‌బుర్లే అన‌డంలో సందేహం లేదు. 

ఉదాహ‌ర‌ణ‌కి మొన్న తాజాగా అనంత‌పురంలో చేసిన ప్రసంగం. అందులో ఆయ‌న అతి క‌ష్టం మీద నోరు పెగ‌ల్చుకుని చంద్రబాబుపై చేసిన విమ‌ర్శ... ప్యాకేజీని చంద్రబాబు ఎలా స్వాగ‌తిస్తారు? అని. ఆ విమ‌ర్శ అప్పటికే పాచి ప‌ట్టి పోయింది. చంద్రబాబు స్వాగ‌తించాన‌ని చెప్పిన వెంట‌నే  విప‌క్షనేత అదే ప్రశ్న సంధించాడు. దాని మీద విమ‌ర్శలు, ప్రతి విమ‌ర్శలు కూడా అయిపోయాయి. మ‌ళ్లీ కొత్తగా ప‌వ‌న్ వ‌చ్చి అదే ప్రశ్న వేస్తుంటే స‌మాధానం ఏం వ‌స్తుందా అనే ఆస‌క్తి కూడా క‌ల‌గ‌డం లేదు. 

ఇక ప్యాకేజీ విష‌యంలో చేయించుకున్న స‌న్మానాల‌పైన విమ‌ర్శలు కూడా అంతే. ఆ స‌న్మానాల‌ను విమ‌ర్శించ‌ని (తేదేపా, భాజాపా త‌ప్ప) రాజ‌కీయ పార్టీ లేదు. అంద‌రూ ఎడా పెడా విమ‌ర్శించేసిన త‌ర్వాత తీరుబాటుగా ప‌వ‌న్ సారొచ్చి మ‌ళ్లీ అదే విమ‌ర్శలు చేయ‌డం ఎలా ఉందంటే... అంత పెద్ద మీటింగు పెట్టి అధికార పార్టీని కాస్తయినా తిట్టిన‌ట్టు ఉండ‌క‌పోతే బాగుండ‌ద‌ని తిట్టిన‌ట్టు ఉంది. విమ‌ర్శలు మాత్రమే కాదు ఆయ‌న ప్రసంగంలో చాలా వ‌ర‌కూ చెప్పిందే చెప్పిన‌ట్టు సాగుతుంది.

నేను ఆచి తూచి మాట్లాడ‌తాను. ఆవేశంగా మాట్లాడ‌ను, నాకు వ్యక్తిగ‌తంగా ఎవ‌రిపైనా కోపం లేదు, హోదాపై పోరాటం నిరంత‌రం కొన‌సాగిస్తాను, అంద‌రికీ అండ‌గా ఉంటాను... ఇవి త‌ప్ప కొత్తగా ఆయ‌న చెప్పేవీ ఏవీ ఉండ‌డం లేదు. ప్రసంగాల్లో ప‌స‌లేక‌పోయినా, సంద‌ర్భశుధ్ది లేకుండా మాట్లాడుతున్నా... ఆయ‌నేమో పెద్ద సినిమా స్టార్‌. దాంతో మీడియా మొత్తం ఆయ‌న స‌భ‌ల‌కు లైవ్ క‌వ‌రేజ్‌లు ఇవ్వక త‌ప్పడం లేదు ( ఏకైక ప్రతిప‌క్ష నేత‌ స‌భ‌లకు అందులో పావు వంతు ప్రాధాన్యం కూడా ద‌క్కడం లేదు). 

అయ‌న మాట‌ల్లో పెద్దగా చెప్పుకోవ‌ల్సింది లేక‌పోయినా చానెళ్ల డెస్క్ లు త‌మ ప్రావీణ్యానికి వీలైనంత ప‌ద‌ను పెట్టి వాటిల్లో నుంచి కొన్ని ఏరుకుంటున్నారు. అలాంటి వాటిల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌రిలో ఉంటుంది అనేది ఒక‌టి. నిజానికి ఇది కూడా ప‌వ‌న్ ఎప్పుడో చెప్పేసిన పాచి కంపే. ఇక మీటింగంటూ  పెట్టాక మాట్లాడ‌క‌పోతే ఎట్టా అన్నట్టు మాట్లాడిన ఆయ‌న ప్రసంగానంత‌రం ప్రత్యేక చ‌ర్చలు. త‌మ‌దైన శైలిలో వాటికి భాష్యాలు. గొప్ప రాజ‌కీయ వ్యూహం క‌లిగిన నాయ‌కుడి మాట‌ల్ని వ‌డ‌పోసిన‌ట్టు ఆయ‌న మాట‌ల్ని ఛిత్రిక ప‌ట్టడాలు... ఇదీ తంతు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌నుకుంటున్న ప‌వ‌న్ దీని కోసం ప్రత్యేక‌హోదా అనే నినాదాన్ని తోడు చేసుకోవాల‌ని కోరుకుంటున్నాడ‌నేది నిస్సందేహం. అందుకే అప్పటి దాకా దీనిపై ఆయ‌న పోరాడ‌తా, పోరాడ‌తా అంటూనే ఉంటాడు. ఇద‌మిద్ధంగా కార్య‌చ‌ర‌ణ ప్రక‌టించ‌కుండా స‌భ‌ల‌తో కాలం సాగ‌దీస్తూ ఉంటాడు. అప్పటిదాకా ఆయ‌న పాచి ప్రసంగాల‌ను మ‌నం వింటూనే ఉంటాం. దానిపై మీడియా హ‌డావిడి కంటూనే ఉంటాం. 

Show comments