తెలుగుదేశం, జనసేన కూటమికి ఏపీ ప్రజలు జై కొట్టారు. నిస్సందేహంగా భారీ మెజారిటీలను కట్టబెట్టి, రికార్డు స్థాయి సీట్లను అప్పగిస్తూ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ ఏపీ ప్రజలు ఈ కూటమికి జై కొట్టారు. తన పాలన నచ్చితేనే తనకు ఓటేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు నచ్చలేదని స్పష్టంగా చెప్పారు!
తన పాలన నచ్చి ఉంటేనే ఓటేయాలని, లేకపోతే వద్దని చెప్పిన జగన్ కు ప్రజా తీర్పు స్ఫష్టంగా అర్థమయ్యే ఉండాలి! తన తీరు సరిగా లేదని ప్రజలు తనకు చెప్పారని జగన్ అర్థం చేసుకోవాలి. వీలైతే ఆ తీరు మార్చుకుని ప్రజల ముందు కనిపించాలి. అలా కాకుండా..మళ్లీ అదే తీరే అనుకుంటే మాత్రం జగన్ తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నట్టే. ఆడవాళ్లను, వృద్ధులను నమ్ముకుని రాజకీయం చేద్దామనుకున్న జగన్ అమాయకత్వాన్ని చూసి జాలి పడాలి!
ఎవరినైతే రాజకీయంగా నమ్ముకుంటే ప్రయోజనం ఉండదో వారిని నమ్ముకుని జగన్ భంగపడ్డాడు. సంప్రదాయ విరుద్ధమైన రాజకీయం చేసి.. నా పాలన నచ్చితే అంటూ బీరాలకు పోయాడు. 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అయితే రాజకీయం అంటే అది కాదని.. జగన్ అర్థం చేసుకునే ఉండాలి. పైకి ఒప్పుకోకకపోయినా..కనీసం ఆచరణలో అయినా జగన్ తీరు మారితే అది ఆయనకే మంచిది. లేకపోతే జగన్ వెంట నడవడానికి కూడా ఇకపై ఎవరూ ఉండకపోవచ్చు!
అయితే ఇప్పటికీ జగన్ చుట్టూరా పాత బ్యాచ్చే కనిపిస్తూ ఉంది. కనీసం అంత దారుణమైన ఓటమి తర్వాత అయినా.. తన చుట్టూ ఉండి వ్యవహారాలను నడిపిన నలుగురిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి, మీ మొహాలు కూడా నాకు చూపించొద్దు అంటూ సాగనంపి ఉంటే, అలాంటి వార్తలు ఏవైనా వచ్చి ఉంటే మంచిదయ్యేది! అయితే జగన్ తీరు పెద్దగా మారినట్టుగా ఏమీ కనిపించడం లేదు. మళ్లీ అదే సజ్జల, అదే సలహాదారులు అంటే జగన్ ఖర్మ అనుకుని వదిలేయడం తప్ప ఇక చేయగలిగింది ఏమీ లేదు!
ఆ సంగతలా ఉంటే.. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి రాజకీయం కేరాఫ్ కక్ష సాధింపు అన్నట్టుగానే కొనసాగుతూ ఉంది. తమకు అధికారం ఇస్తే కక్ష సాధింపే చేస్తామని నారా లోకేష్ గతంలోనే ఎర్ర బుక్కును చూపించి బాహాటంగా ప్రకటించారు. ఎర్రర్రెని బుక్ లో అందరి పేర్లనూ రాసుకుంటూ ఉన్నట్టుగా, ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అందరి పని పడతామంటూ లోకేష్ అప్పట్లోనే బాహాటంగా ప్రకటించారు.
తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలు, అధికారులు, ఆఖరికి కానిస్టేబుళ్లకు కూడా లోకేష్ అదే వార్నింగ్ ఇచ్చారు. మరి అప్పట్లోనే అలా బాహాటంగా ప్రకటించుకున్న వాళ్లకు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలను అమల్లో పెట్టడం పెద్ద కష్టం కానే కాదు! అయితే ఏదేమైనా ఈ దఫా తెలుగుదేశం పార్టీ చర్యలు చాలా చాలా తీవ్రంగానే ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఒక పత్రికాఫీసు మీదకు బాహాటమైన దాడికి తెగబడటం అప్పుడే పరాకాష్టకు చేరిన వైనం అని అనుకోవాలి! అదైనా జగన్ పత్రికాఫీసు మీదకు దాడికి దిగారా అంటే అది కూడా కాదు!.. విశాఖ ఉక్కు విషయంలో మారుతున్న తెలుగుదేశం ధోరణి గురించి రాసిన పత్రిక మీద పచ్చదళం రెచ్చిపోయింది. మరి పార్టీ పవర్ లోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇలా పత్రికాఫీసుల మీద కూడా పడుతున్నారంటే.. ఇంకా తెలుగుదేశం చర్యలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది!
ఇక గ్రామగ్రామాన కూడా పచ్చదళం చర్యలు తీవ్రంగానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పై భౌతిక దాడులకు ఎక్కడా తెలుగుదేశం వెనుకాడటం లేదు. దొరికిన వారిని దొరికనట్టుగా చితకబాదుతూ ఉన్నారు కూడా! ఇక వైఎస్ఆర్ విగ్రహాలను అగ్గి పెట్టడం, ప్రత్యర్థుల ఆస్తులకు నష్టం కలిగించడం, ఇంకా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం నాటి శిలాఫలకాలను పగులగొట్టడం, ఆఖరికి సచివాలయాల గోడలను బద్ధలు కొట్టడం.. ఇలా తెలుగుదేశం పార్టీ ఎంత చేయొచ్చు అంతకు పది రెట్లు చేస్తూ ఉంది కూడా!
మరి తెలుగుదేశం కూటమికి ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు అంటే.. ఇలాంటి చర్యలు యధేచ్ఛగా చేసుకోవడానికి కాబోలు! చంద్రబాబు చిత్తానికి చంద్రబాబు పాలిస్తారు, ఎన్నికల ముందు ఒకటి చెప్పి ఇప్పుడు ఇంకోటి చేస్తారు, తెలుగుదేశం కార్యకర్తలు చిత్తానికి రెచ్చిపోవడం ఇదే కాబోలు అభివృద్ధి అంటే!
ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పచ్చబిల్ల ఒకటి పెట్టుకు వెళ్లాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో అలాంటి బిల్ల చూపిస్తే కాఫీ, టీ ఇచ్చి మర్యాద చేసి పనులు చేసి పెడతారని.. అచ్చెన్నాయుడు ప్రకటించారు. మరి ఎంత మంది పచ్చ పార్టీ కార్యకర్తలు ఇక పచ్చబిల్లలు పట్టుకుని వెళ్లి దాన్ని ఒక మారకంగా వాడుకుంటారో చూడాల్సి ఉంది. పచ్చబిల్ల పెట్టుకుంటే వాళ్లను టచ్ చేయకూడదని ఏదైనా చట్టం కూడా వస్తుంది కాబోలు!
ఇక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జనాల హడావుడి కూడా బాగానే ఉంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈ తాలూకా జనాలు హడావుడి చేస్తూ ఉండటం నెల రోజుల్లోపే హైలెట్ అవుతున్న అంశం. మరి వీరి స్ఫూర్తితో ప్రతి ఊళ్లోనూ ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ బైక్ నంబర్ ప్లేట్ల మీద రాసుకుని తిరుగుతూ అదో అర్హతగా భావించే వాళ్లూ ఎక్కువ అవుతున్నారు.
ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకోవడం మొదలుపెడితే అది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మనుషుల అర్హతే కాదు కదా, పెనుకొండ ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ నంబర్ ప్లేట్ల మీద లిఖించుకుని తిరిగే వారూ ఉంటారు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ నంబర్ ప్లేట్ల మీద అచ్చేసుకుని తమ జోలికి రావొద్దని హెచ్చరించే వారూ ఉంటారు! మొత్తానికి ఆంధ్రాలో ఇలాంటి అనాగరిక సంప్రదాయాలు, వార్నింగ్ రాజకీయాలు, బైకుల నంబర్ ప్లేట్ల బదులు ఎమ్మెల్యే పేర్లు, ఫొటోలతో చలామణి అయిపోవచ్చు అనుకునే వాళ్లు పెరుగుతూ ఉన్నారు!
ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటే పోలీసులు ఆపరు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగనక్కర్లేదు, రోడ్ రేజ్ చేయొచ్చు, ఎవడైనా అడ్డొస్తే కొట్టొచ్చు, ఆకతాయి తనానికి అయినా, రౌడీ యిజానికి అయినా అది లైసెన్స్ బిల్లే కదా! అలాంట లైసెన్స్ కోసమే కదా అలా రాసుకునేది! ఇలాంటి మంచి మంచి కట్టుబాట్లు ఏపీలో వస్తూ ఉన్నాయి. ఇన్నాళ్లూ రాజకీయ నేతల మనుషులు, ఎమ్మెల్యే దగ్గరగా తిరిగే వారు కూడా మహా అంటే బైక్ కు ముందు వైపు తమ పార్టీ నేతల ఫొటోలను వేయించుకునే వారు!
హైదరాబాద్ లో చౌదరి అని ఎల్లో కలర్ లో బైక్ మీద రాసుకోవడం, ఎన్టీఆర్ ఫొటోను ముద్రేసుకోవడం ఒక కుల కట్టుబాటుగా కనిపించేది. దాని స్ఫూర్తితో ఇతర కులాల వారు కూడా ఆ బాట పట్టారు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జనాలు డైరెక్టుగా తాము ఎమ్మెల్యే మనుషులం జాగ్రత్త అన్నట్టుగా బైక్ నంబర్ ప్లేట్ల మీదే రాసుకుని హెచ్చరిస్తూ ఉన్నారు. తేడా వస్తే తేడా అవుతుందని వారు చెప్పకనే చెబుతూ ఉన్నారు.
రవాణా చట్టంలో అయితే చాలా క్లియర్ గా ఉంది. బైక్ నంబర్ ప్లేట్ మీదే కాదు, ఎక్కడా ఎలాంటి స్టిక్కర్ లైన్లు ఉండకూడదు! కొత్త బైక్ ను కొని స్టిక్కర్ తో తోచిన పేర్లను, ఫొటోలను రాసుకుని వెళితే ... ఆర్టీఓ అధికారి దాని రిజిస్టర్ చేయడు. బైక్ కు రెండు వ్యూ మిర్రర్ లేకపోయినా, బైక్ పై ఎక్కడైనా ఎలాంటి స్టిక్కర్ ఉన్నా.. దాని రిజిస్ట్రేషన్ ఆపేస్తారు. వెళ్లి మిర్రర్ బిగించుకురావాలని, స్టిక్కర్ లు ఏవైనా అతికించుని ఉన్నా, అది దేవుడి పేరును నంబర్ ప్లేట్ల మీద కానీ, లైట్ పై భాగంలో కానీ రాసుకుని వచ్చినా వెళ్లి వాటిని తీయించుకురావాలని అధికారి రిజిస్ట్రేషన్ ఆపేస్తాడు.
గతంలో బైక్ ను అధికారి దగ్గరుండి తనిఖీ చేసి నంబర్ ఇచ్చే సమయాల్లో ఇలాంటి నియమం స్ట్రిక్ట్ గా ఉండేది. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే.. బైక్ లపై రకరకాల స్టిక్కర్లు వేయించుకునే వాళ్లు ఉండేవారు. అయితే అప్పటికీ నంబర్ ప్లేట్ల మీద ఏ పేరు ఉన్నా.. అది దేవుడి పేరు ఉన్నా.. అధికారులు ఆపే వారు. ప్రమాణాలకు అనుగుణంగా నంబర్ ప్లేట్ లేదని ఫైన్లు వేసే వారు. జాయింట్ స్టేట్ లో హైదరాబాద్ లో నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అంతే సంగతులు అన్నట్టుగా ఉండేది పరిస్థితి.
ఇటీవలే ఒక యూట్యూబ్ చానళ్లో ఒక రవాణా శాఖ అధికారి ఇంటర్వ్యూ ఇచ్చి.. బైక్ మీద నంబర్ ప్లేట్ మీదే కాదు, ఎక్కడా ఎలాంటి స్టిక్కర్ ఉండకూడదని.. చట్టం చెబుతోందని సెలవిచ్చారు! అయితే చట్టం అలానే చెప్పినా.. ఎమ్మెల్యే గారి తాలూకా జనాలు ఇప్పుడు అలాంటి చట్టాలను ఖాతరు చేసే పరిస్థితుల్లో అయితే లేరు!
ఇక కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన అనేక హామీల అమలు ఎలాంటి పురోగతి కూడా లేదు! ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఉచిత ప్రయాణం ఊసే ఇంకా లేదు! ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకూ అమ్మకు వందనం అంటూ తెలుగుదేశం హోరెత్తించింది. అప్పటి వరకూ 15 వేలే ఏడాదికి, అలాంటిది ఒక్కసారిగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ అని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రచారం చేసే సరికి ఆ ప్రభావం గట్టినే పడింది.
అయితే ఆ పథకం అమలు సీన్ లేని నెల రోజుల్లోనే స్పష్టత వస్తున్నట్టుగా ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ అనడం ద్వారా కుటుంబ నియంత్రణ పాటించని వారిని కూడా చంద్రబాబు ప్రోత్సహించారు! పిల్లలను కనాలని తనే ఇప్పుడు చెబుతున్నట్టుగా చంద్రబాబే చెప్పుకుంటున్నారు! మొత్తానికి నెల రోజుల్లోనే ఇన్ని మార్పులంటే.. ఇంకా ముందు ముందు ఇలాంటి ముచ్చట్లుంటాయో!