జగన్.. ఓ లాటరీ సిఎమ్!

జగన్ పోరాడారు.. సోనియాను ఎదిరించారు. జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి జనంలో తిరిగారు. ఎత్తులు వేసారు. సిఎమ్ అయ్యారు.

ఇది అందరికీ తెలుసు. అందుకే చాలా మంది జగన్ వీరుడు అనుకున్నారు. జగన్ తెలివైన వాడు అనుకున్నారు. జగన్ పొలిటికల్ గేమ్ నే వేరు అనుకున్నారు.

కానీ.. ఇప్పుడు అర్థం అవుతోంది జగన్ జస్ట్ ఓ లాటరీ సిఎమ్ అని. అదృష్టం, టైమ్, పరిస్థితులు కలిసి వచ్చి సిఎమ్ అయ్యారు తప్ప మళ్లీ మరోసారి సిఎమ్ అయ్యే అవకాశం లేదు అని. ఎందుకంటే అధికారం చేజారడం పెద్ద అద్భుతమేమీ కాదు. మళ్లీ సాధించలేనిదీ కాదు. కానీ అలా సాధించాలంటే చేయాల్సిన కృషి వేరు. వెళ్లాల్సిన దారి వేరు. ఆ దారి జగన్ కు తెలియదు. తెలిసినా ఆ దారిలో వెళ్లరు. చేయాల్సిన కృషి చేయరు. కేవలం తన చుట్టూ పెట్టుకున్న కోటరీ మీద భారం వేసి, తను తన ఇంట్లో సేద తీరుతారు.

మీడియా, సోషల్ మీడియా ప్రపంచం ఇది. వాళ్లు ఏదంటే అదే నిజం. వాళ్లు ఏమని టముకు వేస్తే అదే సరైన వార్త. అలాంటి మీడియా జగన్ కు ఎలాగూ దూరం. ఎందుకు దూరం. అసలు మీడియా అంతా ఎందుకు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని, జగన్ ను ఓ భూతం మాదిరిగా ప్రొజెక్ట్ చేసింది అన్నది అందరికీ తెలిసిందే. అయినా నమ్మారు.

Readmore!

అందువల్ల జగన్ ఇక ఆ మీడియా నుంచి సహకారం ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక మిగిలింది సోషల్ మీడియా. ఇక్కడ కూడా జగన్ పోకడ చిత్రంగా వుంది. 2014 నుంచి 2024 వరకు జగన్ కు స్వంత సోషల్ మీడియా వుంది. ఈ సోషల్ మీడియాలో పాతిక శాతం మంది జగన్ మీదనో, జగన్ కులం మీదనో, తెలుగుదేశం మీద ద్వేషంతోనో వాళ్లంతట వాళ్లు ముందుకు వచ్చిన వారు. మిగిలిన 75శాతం జగన్ జీతాలు ఇచ్చి పోషించిన వారు.

కానీ గమ్మత్తేమిటంటే తెలుగుదేశం వైపు నుంచి చూస్తే ఇది రివర్స్. 75 శాతం మంది తెలుగుదేశం మీదనో, లేదా కమ్మ కులం మీదనో అభిమానంతో వున్న వారు. మిగిలిన పాతిక శాతం మంది పార్టీ మీడియా విభాగం నుంచి వున్నవారు.

ఇప్పుడు ఏం జరిగింది. 2019 నుంచి 2024 వచ్చేసరికి వైకాపాలో స్వచ్ఛందంగా వున్న పాతిక శాతం మంది సోషల్ మీడియా జనాలు జగన్ వైఖరితోనో, జగన్ చుట్టూ వున్న కోటరీ వైఖరితోనో విసిగి, దూరం అయ్యారు. పెయిడ్ బ్యాచ్ గా వున్న డెభై అయిదు శాతం మందిని ఇప్పుడు వదిలేసారు. ఎందుకంటే అధికారం లేదు. జగన్ డబ్బులు తీయరు, ఎవరో ఒకరు పోషించాలి. ఎందుకు పోషిస్తారు ఇప్పుడు.

తెలుగుదేశం పార్టీకి సహజంగా వున్న సోషల్ మీడియా జనాలు అధికారం అందింది కదా అని రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. తమని ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని ధీమాతో పని చేస్తున్నారు. అంటే ఇటు ఫుల్ గా డౌన్ అయింది.. అటు ఫుల్ గా రైజ్ అయింది.

దాంతో ఆంధ్రలో ఏం జరిగినా రివర్స్ అటాక్ చేస్తున్నారు తప్ప, తప్పు అని ఎత్తి చూపే సోషల్ మీడియా హ్యాండిల్స్ కరువయ్యాయి. జగన్ దగ్గర ఒకటి రెండు సొషల్ మీడియా హ్యాండల్స్ పొరపాటున ఎత్తి చూపినా, మీద పడిపోయి, మీదే తప్పు అనే వాళ్లు సంఖ్య వందల్లో వుంది. దాంతో అస్సలు తప్పులు కనిపించడం లేదు.

దీని అంతటికీ జగన్ తప్ప వేరు కారణం కాదు. వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేసాడు అని పదే పదే చెప్పడం కాదు. పార్టీని, పార్టీ విభాగాలను ఎలా మేనేజ్ చేయాలో జగన్ నేర్చుకోవాలి. తనకు జనాలకు మధ్య పరదాలు కట్టించినట్లు, తనకు పార్టీ జనాలకు మధ్య ఒకరిద్దరు కోటరీ నాయకులను అడ్డంగా పెట్టేసుకున్నారు. అందువల్ల ఇలా జరుగుతోంది అని జగన్ కు చెప్పేవారు లేకుండా పోయారు. ఎవరైనా ధైర్యం చేసి చెప్పినా మళ్లీ వాళ్లదే తప్పు అన్నట్లు జగన్ చుట్టూ వున్న వారు క్రియేట్ చేస్తున్నారు.

ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం జగన్ మబ్బుల్లోనే వుంటారు. తన లాటరీని నమ్ముకుని, తను మళ్లీ సిఎమ్ అవుతానని కలలు కంటూనే వుంటారు. లాటరీ అన్నది ఒకేసారి తగులుతుంది అన్ని సార్లూ తగలదు. ఆది జగన్ కి ఎప్పటికీ తెలియదేమో?

Show comments

Related Stories :