మోడీ మిషన్‌ సూపర్‌ సక్సెస్‌

'జనాన్ని ఏడిపించడం' అనే మిషన్‌ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. సాక్ష్యం కావాలా.? దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు వద్దకైనా వెళ్ళి చూడండి.. మూడు రోజుల సెలవుల అనంతరం నేడు బ్యాంకులు తెరుచుకుంటుండడంతో, అర్థ రాత్రి నుంచే బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది. 

'తప్పదు, ప్రజలు అర్థం చేసుకోవాలి.. అర్థం చేసుకుంటున్నారు, కేంద్రానికి సహకరిస్తున్నారు.. క్యూలైన్లలో ఆ క్రమశిక్షణే చెబుతోంది మాకు ప్రజల నుంచి మద్దతు ఎంతలా వుందో చెప్పడానికి..' అంటూ కేంద్రం బుకాయిస్తోంది. సహనం అనేది కేంద్రానికి చేతకానితనంలా కనిపిస్తున్నట్టుంది. అందుకే ఇంకా ఇంకా ఆంక్షలతో సామాన్యుడి నడ్డి విరిచేస్తోంది.. సహనానికి పరీక్ష పెడుతోంది. 

అసలు పెద్ద పాత నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా.? ఈ నిర్ణయం చట్టబద్ధమైనదేనా.? అన్న చర్చ ఓ పక్క జరుగుతున్నా, కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. పెద్ద పాత నోట్లు మాత్రమే కాదు, అతి త్వరలో పెద్ద కొత్త నోట్లు కూడా రద్దవుతాయంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా సంకేతాలు పంపింది కేంద్రం. ప్రస్తుతం మార్కెట్‌లోకి వెల్లువలా వచ్చిపడిన పెద్ద 2 వేల రూపాయల నోటు అతి త్వరలో రద్దు కానుంది. ఇది నిజం. ముందుగా ఇదేదో ఉత్త గాసిప్‌ అని అంతా అనుకున్నారు. కానీ, ఇది కేంద్రం వదిలిన 'లీక్‌'గా ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పాక, అది మోడీ వాయిస్‌ కాక ఇంకేమవుతుంది.? 

2 వేల రూపాయల నోటు రద్దు పట్ల జనంలో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఉపయోగం లేని 2 వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చినట్లు.? అన్న ప్రశ్నకు సమాధానం సింపుల్‌.. నల్ల కుబేరుల్ని రక్షించేందుకు. 500 రూపాయల బండిల్స్‌ నాలుగు దాస్తే, రెండు లక్షల రూపాయలు. అదే 2 వేల రూపాయల నోట్ల బండిల్‌ ఒకటి దాస్తే, అది రెండు బండిల్స్‌. దాచేందుకు వీలుగా వుంటుంది కదా.. అదీ, మోడీ వ్యూహం. 

ప్రజలకు చేరాల్సిన డబ్బులేమో, చాలా తేలిగ్గా నల్ల కుబేరుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇది నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యంగా చెప్పక తప్పదు. కానీ, ప్రశ్నించేవారేరీ.! ప్రశ్నిస్తే, వారంతా దేశద్రోహులైపోతున్నారు. ఎక్కడ ఏ క్యూ లైన్‌లో అయినా ఇదే చర్చ.. '2 వేల రూపాయల నోటు కోసం నాలుగైదు గంటలు పడిగాపులు కాస్తున్నాం.. నల్ల కుబేరులకు నోట్ల కట్టలెలా దొరుకుతున్నాయ్‌..' అని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఏదిఏమైనా, మోడీ మిషన్‌ సక్సెస్‌.. పాట్లు జనానికి.. కట్టలు కట్టలుగా కొత్త నోట్లు మాత్రం నల్ల కుబేరులకి.. ఇట్‌ హ్యాపెన్స్‌ ఇన్‌ ఇండియా ఓన్లీ.!

Show comments