'కాలా' తలైవా.. ఇదిగో ఇలా.!

పొద్దున్నే టైటిల్‌.. సాయంత్రానికి ఫస్ట్‌ లుక్‌.. నిర్మాతగా మారిన తమిళ హీరో ధనుష్‌, తన కొత్త సినిమాకి విపరీతమైన మైలేజ్‌ తెచ్చేందుకు బాగానే సినీ వ్యూహాలు రచించాడు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ టైటిల్‌ ఎప్పుడొస్తుందా.? అని ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడటం సహజమే. ఇక, ఫస్ట్‌ లుక్‌ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఒకే రోజు.. డబుల్‌ ధమాకా. ఉదయం 10 గంటలకు 'కాలా' పేరుతో టైటిల్‌ లోగోని విడుదల చేశాడు ధనుష్‌. సాయంత్రం 6 గంటలకి 'కాలా' సినిమాలో రజనీకాంత్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి అభిమానులకి అమితానందాన్ని పంచాడు. 'కబాలి' సినిమా తరహాలోనే గడ్డంతో కనిపిస్తున్నాడు 'కాలా' ఫస్ట్‌ లుక్‌లో రజనీకాంత్‌. చిన్న చేంజ్‌ ఏంటంటే, లుంగీలో ఈ లుక్‌ని డిజైన్‌ చేశారు. 

ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్‌ కూర్చున్న జీప్‌ మీద మహారాష్ట్ర నెంబర్‌ ప్లేట్‌, వెనకాల హిందీ, మరాఠీల్లో దుకాణాల పేర్లు.. ఇలా 'కాలా' సినిమా ఫస్ట్‌ లుక్‌ డిజైన్‌లోనే చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మాఫియా నుంచి బెదిరింపులు షురూ అయ్యాయి. సినిమాలో తన తండ్రి పాత్రని నెగెటివ్‌ యాంగిల్‌లో చూపిస్తే ఊరుకునేది లేదంటూ ఒకప్పటి మాఫియా 'గూన్‌' తనయుడు అల్టిమేటం జారీ చేశాడిప్పటికే. 

'కబాలి' ఫేం పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.

Show comments