లీడర్లన్నాక కూసింత సబ్జెక్టుండాల...!

'మడిసన్నాక కాస్తంత కలాపోసన ఉండాలయ్యా'...అన్నాడు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు. మామూలు మనుషులకు కళాపోషణ ఉన్నా లేకపోయినా కొంపలు మునగవు. కాని ఏదైనా ఒక రంగంలో రాణించాలనుకునేవారికి ఆ రంగానికి సంబంధించిన నాలెడ్జ్‌  ఉండాలి. లెక్కల మాస్టారుకు లెక్కలు తెలియకపోతే విద్యార్థులకు నష్టం. అలాగే రాజకీయ నాయకులకు రాజ్యాంగానికి, ప్రాజెక్టులకు, సామాజిక సమస్యలకు, జాతీయ రాజకీయాలకు, చట్టాలకు...ఇలా అనేక అంశాలకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోతే పార్టీలకు నష్టం. వారు నాయకులుగా చెలామణి అవుతారేమోగాని సమర్థులైన నాయకులుగా గుర్తింపు పొందలేరు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పుడున్న , ఆ తరువాత కొన్ని తరాలవరకు ఉన్న రాజకీయ నాయకులకు ఉన్న నాలెడ్జ్‌ ఇప్పటి నాయకులకు ఉండటంలేదు. నాయకుల్లో ఉన్నత విద్యావంతులున్నారుగాని సామాజిక సమస్యల పట్ల అవగాహన తక్కువగా ఉంటోంది. వివిధ అంశాల పట్ల అవసరమైనంతమేరకు పరిజ్ఞానం ఉండటంలేదు. ఇందుకు కారణం అధ్యయనం, ఆసక్తి లేకపోవడమే. గూండాలు, రౌడీలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా కార్పొరేట్లు రాజకీయాల్లోకొస్తున్నారు. చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు. వీరికి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ పెంచుకోవడంకంటే పెత్తనం చెలాయించడంమీదనే ఆసక్తి ఎక్కువ. 

రాజకీయాలు చేస్తూ సంపాదించుకోవాలనే ధ్యాస తప్ప అధ్యయనం పట్ల ఇంట్రెస్ట్‌ ఉండదు. చట్టసభలకు ఎన్నికైనవారు లైబ్రరీ గడప తొక్కడం చాలా అరుదు. నాలెడ్జ్‌ లేనివారు చట్టసభల్లో నోరు మూసుకొని కూర్చుంటారు. ప్రత్యర్థుల విమర్శలకు సరైనరీతిలో సమాధానాలు ఇవ్వలేరు. ఇప్పటి నాయకులకు సరైన సమాధానాలు చెప్పే సామర్థ్యం లేదు కాబట్టే ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటారు. బూతులు తిడతారు. ఇలాంటివారి వల్ల పార్టీలకు ఒక్కోసారి తీవ్ర నష్టం జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి నాయకులే తలనొప్పి కలిగిస్తున్నారు. 

పిచ్చిపిచ్చిగా మాట్లాడే నాయకులతో, ప్రత్యుర్థుల విమర్శలకు దీటుగా (సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తో) సమాధానాలు ఇవ్వలేని లీడర్లతో ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెడుతున్నారు. సాక్షి మీడియా రాజధాని నిర్మాణంలో, ఇతరత్రా జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో సహా ప్రచురిస్తోంది. టీవీలో ప్రసారం చేస్తోంది. ఈ ఆరోపణలకు పాయింట్‌ టూ పాయింట్‌ సమాధానం చెప్పగల నాయకులు టీడీపీలో కరువయ్యారనేది చంద్రబాబు భావన. సరైన సమాధానాలు చెప్పకుండా పాడిందే పాడుతూ విరుచుకుపడటంవల్ల పార్టీ ప్రజల్లో పలుచనైపోతుంది. 

అందుకే పార్టీ నాయకుల్లో మెరికల్లాంటి కొందరిని ఎంపిక చేసి ఉపన్యాస కళలో ఆరితేరిన నిపుణులతో, వ్యక్తిత్వ వికాస నిపుణులతో, వివిధ అంశాల్లో నిష్ణాతులైనవారితో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బాబు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాకపోతే ఈసారి ఈ విషయంలో మరింత పర్టిక్యులర్‌గా ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. అందరు నాయకులకు రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించిన తరువాత వారి నుంచి 150 మందిని 'ప్రచారకర్తలు'గా ఎంపిక చేశారు. వీరు పార్టీ, ప్రభుత్వం తరపున అన్ని విషయాలు కూలంకషంగా, వివరంగా మాట్లాడాల్సివుంటుంది. 

మీడియా సమావేశాల్లో ఎదురయ్యే ప్రశ్నలకు వీరు సమర్థంగా సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. ఈ 150 మందిలో ప్రాథమికంగా మూడు జిల్లాల నుంచి 25 మందిని ఎంపిక చేశారు. శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యేలు ప్రసంగిస్తున్నప్పుడు వీడియో తీశారు. నిపుణులు ఆ వీడియోలను వారికి చూపించి నాయకుల తప్పొప్పులను వివరించారు. బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలో చెప్పారు. కాంగ్రెసు హయాంలో జరిగిన కుంభకోణాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, పథకాలు...అలా అన్నింటిపై అవగాహన ఉండాలని సీనియర్లు బోధించారు. కమ్యూనిస్టు పార్టీల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు రెగ్యులర్‌గా కార్యకర్తల నుంచి తలపండిన నాయకుల వరకు నిర్వహిస్తూనే ఉంటారు. 

ఇక చంద్రబాబుకు మరో తలనొప్పి కూడా ఉంది. ముఖ్యంగా పార్టీ ఎంపీల్లో చాలామందికి ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడటం రాదు. హిందీ పూర్తిగా రానివారు చాలామంది ఉన్నారు. కొందరు ఇంగ్లీషు సరిగా మాట్లాడలేరు. దీంతో ఢిల్లీలో జాతీయ మీడియా విలేకరులు ఏమైనా అడిగితే సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దీంతో మీడియాలో తప్పుగా వస్తున్నాయట...! భాష రాకపోవడంతో సభలోనూ మాట్లాడలేకపోతున్నారు. కొందరు తెలుగులో మాట్లాడుతుండటంతో మంత్రులకు, ఇతర ఎంపీలకు అర్థం కాదు. ఎంపీలు హిందీ, ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని బాబు వారి వెంట పడుతున్నారు. నేర్చుకోవడం కష్టం కాదు. కాని నిర్లక్ష్యం డామినేట్‌ చేస్తోంది. 

Show comments