పవన్ పై మోహన్ బాబు.. ప్రెస్ నోట్ పంచ్!

ఉత్తరాది, దక్షిణాది అంటూ.. వివక్ష అని చెబుతూ.. రాజకీయ పల్లవిని అందుకున్న పవన్ కల్యాణ్ కు ఇప్పుడు సౌతిండియా నుంచి, అందునా తెలుగు నాట నుంచి, అందునా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని నుంచి పంచ్ పడింది. టీటీడీకి ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ను ఈవో గా నియమించడంపై పవన్ కల్యాణ్ కాస్త లేటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది అంటూ వేరు చేసే వేర్పాటు వాదపు మాటలు మాట్లాడటానికి రెడీగా ఉండే పవన్ కల్యాణ్ కు టీటీడీ ఈవో నియామకం ఇష్యూ బాగానే ఉపయోగపడింది. దానిపై చంద్రబాబు సమాధానం ఇవ్వాలని పవన్ ట్వీట్ పెట్టగా.. చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు కానీ, మోహన్ బాబు నుంచి మాత్రం వచ్చింది!

అది కూడా ఏకంగా దీనిపై ప్రెస్ నోటే విడుదల చేశాడు కలెక్షన్ కింగ్. శ్రీవారి ముందు ఉత్తరాది, దక్షిణాది తేడాలు చెల్లవని మోహన్ బాబు అనేశారు. వెంకటేశ్వరుడు విశ్వమంతా ఉన్న హిందువులందరికీ దేవుడు.. ఆయన ముందు ఉత్తరాది, దక్షిణాది తేడాలు ఏమిటని మోహన్ బాబు ప్రశ్నించారు. టీటీడీకి దక్షిణ భారతీయులనే ఈవోలుగా చేయాలనే వాదనను తను ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. అలా అయితే.. ఉత్తరభారతదేశంలోని హైందవ దేవాలయాల్లోని దక్షిణాది అధికారుల మాటేమిటి? అని కూడా మోహన్ బాబు ప్రశ్నించారు.

మరి తన ప్రెస్ నోట్ లో ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించలేదు కానీ, పవన్ వాదనను మాత్రం మోహన్ బాబు తీవ్రంగా ఖండించారు. టీటీడీ కొత్త ఈవోకు శుభాకాంక్షలు సైతం చెప్పారు బాగా సేవలు చేసి శ్రీవారి కృపకు పాత్రుడు కావాలని సూచించారు.

మరి పవన్, మోహన్ బాబులు ఇది వరకూ ఒకసారి పరోక్షంగా సెటైర్లు వేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మెగా, మంచు ఫ్యామిలీల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడినా.. తర్వాతి కాలంలో రాజీ అయ్యారు. ఇప్పుడు మోహన్ బాబు ఇచ్చిన ప్రెస్ మీట్ పంచ్ ను చూస్తుంటే.. ఇది ముందు ముందు కూడా వెళ్తుందా? అనే సందేహాలు కలుగక మానవు.

Show comments