పవన్ ను ఎలా అర్థం చేసుకోవాలి

వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి సొంతం...పబ్లిక్ లోకి వస్తే ఏమయినా అంటాం. అంటాడు శ్రీశ్రీ. ఆ లెక్కన సెలబ్రిటీలు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు తమ తమ చర్యలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఎందుకంటే వారి చర్యలను బట్టి, ప్రజలు లేదా అభిమానులు ఈ సోకాల్డ్ నాయకులు లేదా సెలబ్రిటీల మనోవైఖరిని అర్థం చేసుకుంటారు కాబట్టి.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా రాజకీయాల్లో ఓ వేలు, సినిమాల్లో రెండు కాళ్లు పెట్టి నిల్చున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే. దేశం అంతా మారుమోగిపోయింది. సింధు సాధించిన విజయం. మన వాళ్లే కాదు, పొరుగు రాష్ట్రాలు కూడా సింధు ఘనకీర్తిని వేనోళ్ల పొగుడుతున్నాయి. రజనీ, అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు సింధు సాధించిన విజయానికి ఫిదా అయిపోయామని ప్రకటించారు. 

మరి లక్షలాది మంది అభిమానులు వున్న పవర్ స్టార్ మాత్రం సింధు సాధించిన విజయంపై తన స్పందన తెలియచేయలేదు. ఆ విధంగా ఆయన తన  అభిమానులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అధికారం అందుకోవాలనుకుంటున్నారు. అందులో అణువంత అవాస్తవం లేదు. మరి ఇలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే, ఇలాంటి విజయాలకు స్పందించరా? ఎటువంటి బహుమతి ప్రకటించరా?

అంటే దేశం గర్వించే విజయానికి స్పందించేంత తీరుబాటులేనంతగా పవన్ కళ్యాణ్ వున్నారనుకోవాలా? మరి అంత తీరుబాటు లేని వ్యక్తి రాజకీయాలు ఎలా చేస్తారు?  ప్రజలకు ఏం సేవ చేస్తారు?  అసలు పవన్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి. ఏప్రిల్ 30 తరువాత ఆయన ఇంతవరకు ట్విట్టర్ ద్వారా ఏ విషయం మీద కూడా తన అభిప్రాయాలు వెల్లడించలేదు. మరి దీన్ని బట్టి పవన్ మనసును ఏ విధంగా అర్థం చేసుకోవాలి ? ఆయన సిద్ధాంతం ఏమిటో ఎలా తెలుస్తుంది ప్రజలకు?

Show comments