నిప్పో.. తుప్పో.. ఎవడిక్కావాలి.?

'పొద్దస్తమానం నేను నిప్పు.. నేను నిప్పు..' అని చెప్పుకోవడమెందుకని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఆయన ప్రశ్నించారని కాదుగానీ, 'పచ్చ మీడియా'లో వారంలో ఒక్కసారైనాసరే, 'నేను నిప్పు' అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బ్యానర్‌లో దర్శనమిస్తుంటాయి. అంటే, ఇక్కడ చంద్రబాబులో ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ సుస్పష్టం. తన వెనుకాల జరుగుతున్న తప్పులు, తన మెడకు చుట్టుకుంటాయనే భయం ఆయనలో తొంగి చూస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 

అతి ధనవంతులైన మంత్రుల్లో చంద్రబాబు సర్కార్‌కి ప్రధమ స్థానం దక్కింది. మన మంత్రి నారాయణగారే రిచ్చెస్ట్‌ మినిస్టర్‌. ఆయనగారే ఇప్పుడు అమరావతికి ఇన్‌ఛార్జ్‌. మొత్తంగా అమరావతి నిర్మాణమంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. 457 కోట్ల రూపాయల ఆర్జనపై నారాయణకు ఉండవల్లి సూటి ప్రశ్నలు సంధించారు. 'నేను చేసిన ఆరోపణలు నిజం కాకపోతే నా మీద కేసులు పెట్టండి.. నేను చేసిన ఆరోపణలకు మీరు సమాధానం ఇవ్వకపోతే నేను న్యాయపోరాటం చెయ్యక తప్పదు..' అంటూ మంత్రి నారాయణకు ఉండవల్లి అల్టిమేటం జారీ చేశారు. 

ఇక, పదే పదే నిప్పు.. అని చెప్పుకునే చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికింది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా.? అని ప్రశ్నించారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌. చంద్రబాబు అనుకూల మీడియాలో కూడా ఈ రేవంత్‌రెడ్డి దొంగతనం బయటపడిందనీ, అలాంటి వ్యక్తుల్ని పార్టీలో ముఖ్య పదవుల్లో కూర్చోబెట్టిన చంద్రబాబు నిప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారాయన. 

ఎవరన్నా తన మీద ఏదన్నా విమర్శ చేస్తే చాలు, 'నిప్పులా బతికాను..' అని చంద్రబాబు చెప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తే 'నేను నిప్పు' అంటారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ తెరపైకి వస్తే 'నేను నిప్పు' అని చెప్పుకుంటారాయన. చినబాబు నారా లోకేష్‌పై అవినీతి ఆరోపణలు వచ్చినా అంతే. అంతకు మించి, ఆరోపణలన్నీ అసత్యమనీ చెప్పుకునేంత ధైర్యం మాత్రం చంద్రబాబుకి లేదు. 

పదే పదే నిప్పు.. అని చెప్పుకుంటోంటే, అది నిప్పు కాదు.. తప్పుని నిప్పులా కవరింగ్‌ ఇచ్చుకోవడానికి చంద్రబాబు పడ్తున్న పాట్లు.. అనే విషయం తెలుసుకోలేనంత అమాయకులా ప్రజలు.?

Show comments