పవన్ కల్యాణ్ కూ వేయండొక వీరతాడు..!

బహుశా.. ఈ ప్రపంచంలో దేనికైనా అర్హత ఉండాలేమో కానీ, నీతులు చెప్పడానికి, శుద్దుపూసల్లా మాట్లాడటానికి మాత్రం అర్హత అవసరం లేదు కాబోలు! అది కూడా సినిమా వాళ్లు చెప్పే నీతులు వింటేనే వాంతులు వస్తాయి. సినిమాల్లో వీరు వేసే వేషాలకూ, చేసే చేష్టలకూ అస్సలు పొంతన ఉండదే!  

దీనికి  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మినహాయింపులా కనిపించడం లేదు. యూకే పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ భారతీయ కళల గురించి, జానపదుల గురించి తనకు తెలిసినదాన్ని చెప్పుకొచ్చారు. తన సినిమాల ద్వారా సంప్రదాయాలను ప్రోత్సహిస్తానని, మన కళలలను సంప్రదాయాలను మరవరాదని, గౌరవించుకోవాలని.. పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. బాగుంది.

మరి గౌరవించడం అంటే ఏమిటి? మరిచిపోకుండా వాటిని పునశ్చరణ చేయడం అంటే ఎలా? సంప్రదాయాలను సినిమాల ద్వారా గుర్తు చేయడం ఏలా? అంటే.. పవన్ సినిమాలను చూస్తే అర్థం చేసుకోవాలనమాట. ఉదాహరణకు ఈ హీరో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘అత్తారింటికి దారేదీ’లో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా.. ‘ ను రీమిక్స్ చేసిన తీరును గుర్తు చేసుకోవాలనమాట!

ఆ పాట  మీనింగేమిటి? దాన్ని వాడిన తీరు ఏమిటి? ఆ పాటకు చేసే డాన్సులేమిటి? అనే విషయాలను పరిశీలించాలనమాట! ఒక జనపదానికి.. విష్ణు అవతరాల గురించి రాయలసీమ మాండలికంలో వివరించిన పాటకు పవన్ కల్యాణ్ అండ్ కో వేసిన స్టెప్పులు దానికి లభించిన ప్రోత్సాహం అనుకోవాలనమాట. మరుగున పడిపోయిన జనపదాలను ప్రోత్సహిచండం అంటే అలా అనమాట! ఈ విషయాన్నే పవన్ గర్వంగా చెప్పుకున్నాడు. తన సినిమాల్లో జానపదాల ప్రస్తావన ఉంటుందని అయన వివరించాడు.  

గుళ్లో భజన పాటను తీసుకొచ్చి.. ఆడంగి వేషాలతో డాన్సులు చేయడం, కామెడియన్ ను బఫూన్ చేసుకుని ఆడుకునే టప్పుడు భజన పాట పాడటం.. దానికి మిగతా తారాగణం వేసే చిల్లర డాన్సులు అదనం. అదేమంటే.. ఆ పాటకు తామే గుర్తింపును తెచ్చామని చెప్పుకోవడం! ఎక్కడో మరుగున పడ్డదాన్ని వెలుగులోకి తెచ్చి.. దానికి ఐటమ్ సాంగ్ కలరిచ్చి గుర్తింపునిచ్చి.. హిందూ సమాజాన్ని ఉద్దరిస్తున్న పవన్ ను విమర్శించడమా? ‘రామ రామా..’ అనే భక్తజనాలూ లేకపోలేదు.

హిందూ భజన పాటలను ఐటమ్ సాంగ్స్ లో వాడి వాటికి వ్యాంప్ క్యారెక్టర్లతో గెంతించిన రాజమౌళికి పద్మశ్రీ దక్కింది.. ఎప్పటిదో యుగాల నాటి కీర్తనను ఐటమ్ సాంగ్ స్థాయి  కన్నా కొంచెం కిందికి తీసుకొచ్చిన పవన్ కల్యాణ్ తను జనపదాలను ప్రోత్సహిస్తున్నా.. అని ప్రకటించుకున్నాడు. మొత్తానికి సినిమా వాళ్లు హిందూ సమాజానికి చేస్తున్న సేవ అంతా ఇంత కాదయా! మరి పవన్ కూ వేయండొక వీరతాడు! 

-జీవన్ రెడ్డి.బి

Show comments