కమెడియన్‌ అలీ.. రాజకీయాల్లోకి.!

కమెడియన్‌ అలీ రాజకీయాల్లోకి రానున్నాడంటూ 2014 ఎన్నికలకు ముందు ప్రచారం జరిగింది. రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు అలీ అప్పట్లో ప్రయత్నించాడు కూడా. టీడీపీ నుంచి టిక్కెట్‌ ఆశించిన అలీకి, చంద్రబాబు మొండిచెయ్యి చూపించిన విషయం విదితమే. రాజకీయాల సంగతెలా వున్నా, సొంతూరు రాజమండ్రి అంటే అలీకి మమకారమెక్కువే. వీలుచిక్కినప్పుడల్లా రాజమండ్రికి వెళ్ళడం, అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం చేస్తుంటాడు అలీ. 

తాజాగా, అలీ ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడే అలీని, 'రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారు.?' అని ప్రశ్నించారు కొందరు. 'ఇంకా, 2019 ఎన్నికలకు చాలా సమయం వుంది కదా.. అప్పుడు అడగండి ఆ మాట..' అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూనే, 'అప్పుడు ఇలా కాదు, ఇక్కడే.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చెబుతా..' అని, రాజకీయ రంగ ప్రవేశంపై తనకున్న ఆసక్తిని చెప్పకనే చెప్పేశాడు అలీ. 

ఇక, పవన్‌కళ్యాణ్‌ గురించి అలీని ప్రశ్నించారు ఇంకొందరు. ఎంతైనా పవన్ కళ్యాణ్ కి అలీ అత్యంత సన్నిహితుడు కదా. అందుకే, ఆయన ముందుకి ఈ ప్రశ్న వచ్చింది. '2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తారని మీరెలా ఎదురుచూస్తున్నారో, నేనూ అలాగే ఎదురుచూస్తున్నాను.. మీకెంత తెలుసో, నాకూ అంతే తెలుసు..' అని అలీ చెప్పుకొచ్చాడు. ప్రత్యేక హోదా అంశమూ ప్రస్తావనకు వచ్చిందిక్కడ. ప్రత్యేక హోదా అడిగి తెచ్చుకోవాలి.. కొట్లాడితే కుదరదు.. అని ఇటు పవన్‌ డైలాగునీ, అటు చంద్రబాబు డైలాగునీ అలీ కలిపి చెప్పేశాడు. మొత్తమ్మీద, అలీ తెలివైనోడే. రాజకీయాల్లోకి వస్తే రాణించే తెలివితేటలు బాగానే వున్నట్టున్నాయి అలీకి. 2019 ఎన్నికల్లో అలీ పోటీ చేయడం ఖాయమేనా.? వేచి చూడాల్సిందే.

Show comments