కొమ్మినేని: మారిన జగన్ ప్రసంగ బాణి

విపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తన ప్రసంగంలో స్టైల్ మార్చుకున్న తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ పేరుతో జగన్ నిర్వహించిన సభ సఫలం అవడం ఆ పార్టీకి ఉత్సాహం తెచ్చే అంశం. దానికన్నా జగన్ కొత్త స్టైల్‌లో చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఇంత పెద్ద ఎత్తున జరిగే సభలలో ఆద్యంతం సభికులను తమతో పాటు తీసుకువెళ్లడం వక్తలకు చాలా కష్టంతో కూడుకున్నది అవుతుంది. కాని జగన్ ఈసారి మార్చిన తన ప్రసంగ బాణీతో అందరిని చివరి వరకు తనతోనే ఉండేలా చేసుకోగలిగారు. 

సుమారు గంటన్నర సేపు జగన్ చేసిన ఉపన్యాసంలో ఎక్కడా అపశతులు కాని, చెప్పిన మాట చెప్పే పునరుక్తులు కాని లేవు. స్థల ప్రాముఖ్యతతో ఆరంభించి, బెట్రాండ్ రసెల్ వంటి తత్వవేత్తల కొటేషన్‌ల వరకు వాడి సభను పండించారు. గత ఎన్నికల ఫలితాల రీత్యా అక్కడ పార్టీ బలహీనంగా ఉందన్న అబిప్రాయం ఉంది. కాని సభకు పెద్ద ఎత్తున హాజరవడమే కాకుండా ప్రత్యేక హోదాపై వారు కూడా నినదించిన తీరు పార్టీకి ఊతం ఇస్తుంది. అంతేకాక ప్రత్యేక హోదాపై ప్రజలలో ఉన్న ఆర్తి అర్థం అవుతుంది. 

జగన్ సంధించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి అటు టీడీపీ నేతలకు కాని, ఇటు బీజేపీ నేతలకు కాని లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు పోటీలు పడి ప్రత్యేక హోదాపై చేసిన ప్రసంగాలు వారు మళ్లీ, మళ్లీ వింటే వారు అబద్దమాడారా? లేక మోసం చేశారా? లేక న్యాయం చేస్తున్నామా? అన్న విషయం అర్థం అవుతుంది. జగన్ ఆ విషయాలను లయబద్ధంగా ప్రశ్నల రూపంలో సంధించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ర్టంలో ఎనభైశాతం మంది సంతోషంగా ఉన్నారనో, ఉండాలనో చేసే ప్రచారానికి జగన్ విరుగుడుగా ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్న వేశారు. 

ఎవరూ సంతోషంగా లేరని ఆయన ప్రజలతో చెప్పించారు. అంతేకాక చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నిటిని కూడ ఒక క్రమబద్ధంగా ప్రస్తావించి అవేవి అమలు కాలేదని జనం నుంచి సమాధానాలు రాబట్టారు. చంద్రబాబుపై విమర్శలు చేసినా, అవినీతి ఆరోపణలు చేసినా, ఎక్కడా పద ప్రయోగంలో అభ్యంతర పదాలు దొర్లకుండా జాగ్రత్త పడ్డారు. లయ, ప్రాసల కోసం కాకుండా, విషయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పిన విషయాలే చెప్పకుండా, ఒకదానికికోకటి పొంతన లేకుండా మాట్లాడే ఉపన్యాసంలా కాకుండా ఒక స్పష్టతతో, సూటి ప్రశ్నలతో ప్రదాని మోడీ, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను నిలదీశారని చెప్పాలి. 

కేసులకు భయపడే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నాడని కూడా జగన్ వాదించారు. మరో విశేషం ఏమిటంటే గతంలో ఎన్‌టీఆర్ గురించి జగన్ పెద్దగా ప్రస్తావించినట్లు అనిపించదు. ఈసారి సభలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్‌టీఆర్ పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని చెప్పడం ద్వారా ఎన్‌టీఆర్ అబిమానులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక రాజకీయ నాయకుడు శ్రద్దపెట్టి విషయంపై అధ్యయనం చేసి ప్రసంగం తయారు చేసుకుంటే ఎంత మెచ్యూర్‌గా ఉంటుందో, అలా జగన్ చేయగలగడం విశేషమే. 

అయితే కొంత నిడివి తగ్గించినా మంచిదే. ప్రత్యేక హోదాపై వెంకయ్య నాయుడు కాని, చంద్రబాబు నాయుడు కాని గత పదిరోజులుగా చేస్తున్న ప్రచారానికి ఒక్కసారిగా విరుగుడు మంత్రాన్ని జగన్ వదలినట్లయింది. జగన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా టీడీపీ నేతలు కొందరు అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. వాటిలో టీడీపీ ఎంపీలు సమైక్యాంధ్ర కోసం పోరాడుతుంటే, జగన్ విభజన కోరుకున్నాడనో, పార్లమెంటులో ఏమీ చేయలేదనో ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో ప్రకటన చేయించారు. 

విభజన లేఖలను ఒకటికి రెండుసార్లు ఇచ్చి, తాము విభజనకు కట్టుబడి ఉన్నామని చెప్పిన విషయాన్ని జనం మర్చిపోయి ఉంటారని వెంకన్న ఇలాంటి అసత్యాలకు పూనుకున్నట్లుగా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మొదట ఆర్టికిల్3 కింద తగు నిర్ణయం తీసుకోవాలని సూచించినా, ఆ తర్వాత పూర్తిగా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేసిన సంగతిని విస్మరించి విమర్శలు చేస్తున్నారు. విశాఖ సభకు వచ్చిన స్పందన చూసి అయినా టీడీపీ నేతలు కాని, బీజేపీ నేతలు కాని తమ వైఖరిని మార్చుకుంటారా అన్నది అనుమానమే.

టీడీపీలో విలువలు ఇలా పతనమవుతున్నాయేమిటో!

విశాఖపట్నంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, విపక్ష నేత జగన్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ పైన, ఆయన ప్రసంగంపైన తెలుగుదేశం మంత్రులు, నేతలు స్పందించిన తీరు పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. వారు దీనిపై ఎంత ఆంందోళన చెందుతున్నది విశదం అవుతుంది. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కాని ఇటీవలి రాజకీయాలలో విమర్శలకు హేతుబద్దత ఉండడం లేదు. అర్ధం అసలే ఉండడం లేదు. ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముందంజలో ఉంటారు. 

జగన్ ప్రతిపక్ష నేతగా పోరాడడం లేదని ఆయన అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదాపై సభ జరగ్గానే మంత్రులంతా కావ్, కావ్ అంటూ జగన్‌పై విమర్శలు చేశారన్న దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. నిజంగానే జగన్ స్పీచ్ ప్రభావం లేకపోతే మంత్రులు పట్టించుకోనవసరం లేదు కదా! జగన్ స్పీచ్ జనాన్ని ఆకట్టుకుందన్న అభిప్రాయంతోనే టీడీపీ మంత్రులంతా రెచ్చిపోయారన్న అభిప్రాయం కలగడం లేదా! ప్రజల తరపున కాకపోతే ప్రత్యేక హోదా కోసం పెట్టిన సభ ఎవరికోసం? విపక్ష నేత ఆందోళనలు నిర్వహించక ప్రభుత్వానికి భజన చేస్తారా? జగన్ చేసిన ప్రసంగంపై విమర్శో, విశ్లేషణో చేయకుండా మాట్లాడిన తీరు ఉమాలో డొల్లతనం తెలియచేస్తుంది. 

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక ఈ కొత్త ట్రెండ్ ఎక్కువ అయింది. అదేమంటే ఎదుటి రాజకీయ నాయకుడిపై వ్యక్తిగత దూషణకు దిగడం, ఉన్నవి, లేనివి అబద్దాలు చెప్పడం తద్వారా అసలు విషయాలను పక్కదారి పట్టించే యత్నం చేయడం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనపై కేసులు అంటూ చిట్టా విప్పేవారు. అవేమంటే ఎన్నికల సమయంలో బ్యానర్లు కట్టారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని.. ఇలాంటి కేసుల ద్వారా ఆయనను ప్రజలలో పలచన చేయడానికి ప్రయత్నించేవారు. ఆ తర్వాత కేసులన్నిటిని కోర్టులు కొట్టివేశాయి. 

అదే సమయంలో చంద్రబాబుపై ఉన్న కేసుల గురించి మాత్రం అవన్ని ఒట్టివేనని టీడీపీ నేతలు అంటారు. అంతదాకా ఎందుకు చంద్రబాబు నాయుడు సైతం కర్నూలులో ఏమన్నారు? ఓటుకు నోటు అంటే తెలుసా? డబ్బులు ఎవరిచ్చారు అని అన్నారు. జగన్ యువభేరీలో ఒక విద్యార్థిని ఓటుకు నోటు కేసు గురించి ప్రశ్నించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. విపక్షనేత జగన్ ఒకమాట అన్నారు. ఇలా ఓటుకు నోటు కేసులో పట్టుబడిన ఏ సీఎం కూడా రాజీనామా చేయకుండా ఉండలేదని, ఆ ఒక్కదానికి ఆత్మసాక్షిగా టీడీపీ మంత్రులు జవాబు చెబితే ఆ తర్వాత జగన్‌పై వారు ఎన్ని విమర్శలు చేసినా వాటికి విలువ వస్తుంది.

ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరాడాలని కూడా దేవినేని ఉమా చెప్పారు. మరి జగన్ ఢిల్లీలో దీక్ష చేశారు కదా అంటే దాని గురించి మాట్లాడరు. ఎంపీలతో రాజీనామా చేయిస్తాననడం ఏమిటని మళ్లీ అదే మంత్రి అంటారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ముద్దుకష్ణమ నాయుడు అంటారు. ఢిల్లీలో పోరాడాలని, ప్రధాని మోడీని జగన్ ఏమీ అనలేదని కూడా వీరు ప్రచారం చేస్తుంటారు.. ప్రత్యేక హోదా కోసం మరి టీడీపీ అన్ని మాటలు మార్చిన విషయం గురించి  వీరు మాట్లాడగలుగుతారా? అన్నది కూడా చెప్పాలి. 

ఇక మరో  ఇద్దరు మంత్రులు అయ్యన్న పాత్రుడు, పీతల సుజాతలు ఏపీకి పెట్టుబడుల వెల్లువ వచ్చేసిందని అంటున్నారు. రెండులక్షల పాతికవేల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని అన్నారు. వచ్చిన పరిశ్రమల జాబితా, ఉద్యోగాలు ఇచ్చిన వైనంపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని వైపీసీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ చేశారు. నిజంగానే అంత పెట్టుబడులు వస్తే ప్రత్యేక హోదా అవసరం లేదని అనుకుంటే రెండుసార్లు అసెంబ్లీలో ఎందుకు దీనిపై తీర్మానాలు చేశారో మంత్రులు వివరించాలి. ఇంకో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరో అడుగు ముందుకేసి ఎన్నికల హామీల్లో ఇప్పటికే సగం నెరవేర్చామని, నిరుద్యోగ భతిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని అన్నారు. 

ఇప్పటికి రెండున్నర ఏళ్లు అయితే నిరుద్యోగ భతి ఇంకా ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారు? జగన్ ఆయా హామీలపై ప్రజలలో ప్రశ్నలు వేశారు కదా? జగన్ చేసిన ప్రకటనలన్నీ కరేక్టనని, అధికారపక్షం చేసేదంతా తప్పని కాదు. జగన్ తన విమర్శలలో ఎక్కడ పొల్లు మాటలు లేకుండా పద్ధతిగా మాట్లాడితే టీడీపీ నేతలు సంస్కారంతో నిమిత్తం లేకుండా ఏది బడితే అది మాట్లాడి, అదేదో తాము గొప్పగా మాట్లాడేశామని సంబరపడుతున్నారు. రాజకీయాలలో ఇప్పటికే రకరకాల రూపాలలో విలువలను దిగజార్చుతున్న తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్‌టీఆర్ ఉన్నప్పుడు మాదిరి పార్టీ కాదని పదే పదే రుజువు చేస్తున్నారు. అది బాధ కలిగించే అంశం. 

ఎన్‌టీఆర్‌ను ఆ రోజులలో ప్రత్యర్ధి పార్టీలు ఏమైనా విమర్శించేవి కాని, అబద్దాలు ఆడతారని, మోసాలు చేస్తారని, చెప్పిన మాటను తప్పుతారని అనేవి కాదు. కాని ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని ఈ మాటలన్ని అంటున్నారు. అబద్దాలు ఆడడంలో డిగ్రీ కాదు.. పీజీ ఇవ్వాలన్నట్లుగా మంత్రులు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ సంస్కతిలో వచ్చిన మార్పునకు నాతో సహా ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నాం. ఏమి చేస్తాం. కాల మహిమ. విలువ పతనం అవుతున్న రోజులివి అని సరిపెట్టుకోవడం తప్ప.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్ 

Show comments