భూమా నాగిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేనా?

నంద్యాల ఉప ఎన్నికలో  టీడీపీ గెలుపు కోసం నానాపాట్లు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ నైతిక విలువల గురించి మాట్లాడటమే కాకుండా, సెంటిమెంటుతో ఓటర్లకు కన్నీళ్లు తెప్పించి, వారి హృదయాలను ద్రవింపచేయాలని ప్రయత్నిస్తున్నారు. నంద్యాల్లో తన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో 'తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై వైఎస్సార్‌సీపీ పోటీ పెట్టింది' అంటూ సెంటిమెంటును పండించే ప్రయత్నం చేశారు. రాజకీయ సంప్రదాయాలు, నైతిక విలువలు టీడీపీకే ఉన్నాయని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ఆ రెండూలేని వైకాపా కేవలం ఏడాదిన్నర పదవి కోసం నైతిక విలువలు, సంప్రదాయాలు వదిలేసిందన్నారు. రాజకీయ సంప్రదాయమంటే ఏమిటి? సిట్టింగ్‌ ఎమ్మెల్యే లేదా ఎంపీ దుర్మరణం పాలైతే, ఆ సీటు ఏ పార్టీకి చెందిందో అదే పార్టీ నుంచి సదరు కుటుంబ సభ్యుడిని ఏకక్రగీవంగా (పోటీ పెట్టకుండా) గెలిపించడం. ఎవరూ పోటీ పెట్టకపోతే ఆటోమేటిగ్గా గెలిచినట్లే కదా. ఇలా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని రాజ్యాంగం చెప్పలేదు.

 కాని సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులు దుర్మరణం పాలైనప్పుడో, తీవ్ర అనారోగ్యంతో చనిపోయినప్పడు ఇతర పార్టీలు పోటీ పెట్టకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో చాలాసార్లు జరిగింది. ఎక్కువసార్లు ఇలా జరిగేసరికి దీన్నొక సంప్రదాయంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇతర పార్టీలు పోటీ పెట్టినా గెలిచే అవకాశం ఉండదు. ఎందుకంటే చనిపోయిన సిట్టింగ్‌ ప్రజాప్రతినిధిపై జనంలో సానుభూతి ఉంటుంది కాబట్టి తిరిగి ఆ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారు. దీంతో అనవసరంగా పోటీ చేయడం ఎందుకులే అని ఇతర పార్టీలు అనుకుంటాయి. ఒక్కోసారి దీనికి రివర్స్‌ (తెలంగాణలో పాలేరు ఉపఎన్నిక) కావొచ్చు కూడా. వైఎస్సార్‌ మరణించినప్పుడు పులివెందుల ఉపఎన్నికలో తాము పోటీ పెట్టలేదని, భూమా శోభానాగిరెడ్డి చనిపోయినప్పుడు ఆళ్లగడ్డలో తాము పోటీ పెట్టలేదని, కాని ఈ సంప్రదాయాన్ని జగన్‌ పాటించలేదని చంద్రబాబు ఆరోపించారు.

ఆ రెండు ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టినా ఎట్టి పరిస్థితిలోనూ గెలిచే అవకాశంలేదు. సానుభూతి పవనాల్లో సాధ్యంకాదు. పైగా పులివెందుల కాంగ్రెసు స్థానం మాత్రమే కాకుండా అక్కడ నిలబడిన విజయమ్మ వైఎస్ సతీమణి, అదే పార్టీ అభ్యర్థి. ఆళ్లగడ్డలో కూడా ఇదే పరిస్థితి. సో... వాళ్ల స్థానాలు వాళ్లకు దక్కాయి. కాని నంద్యాల కథ వేరు. గత ఎన్నికల్లో నంద్యాల్లో వైకాపా గెలిచింది. దాని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన భూమా టీడీపీలో చేరాక మరణించారు.  కాని టీడీపీలోకి ఫిరాయించాక వైకాపాకు రాజీనామా చేయలేదు. టీడీపీ కండువా కప్పుకున్నంత మాత్రాన టీడీపీ ఎమ్మెల్యే అయిపోయినట్లేనా? వైకాపాకు రాజీనామా చేయలేదు కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేగానే చూడాలి. అంటే వైకాపా ఎమ్మెల్యేగానే మరణించారు. కాబట్టి నంద్యాల వైకాపా స్థానమే. దాన్ని మళ్లీ దక్కించుకోవడానికి పోటీపడితే తప్పేముంది? భూమా టీడీపీ ఎమ్మెల్యే అయినట్లయితే బాబు చెప్పిన సంప్రదాయం గురించి ఆలోచించవచ్చు.

ఇక బాబు మరోసారి టీడీపీ నైతికత గురించి చెప్పుకున్నారు. కొన్ని రోజుల కిందట నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ కొందరు నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు నీతినిజాయితీపై ఉపన్యాసమిచ్చారు. ఏమన్నారాయన? ''డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడమంటే అవినీతిని ప్రోత్సహించడమే. దీనికి నేను వ్యతిరేకం. ఓటుకు రూ.500, 1000 ఇస్తే నష్టపోయేది మనమే. ఓటుకు 5వేలు ఇవ్వడం నాకు చేతకాదా? అది ఇవ్వాలంటే నేను రూ.5 లక్షలు సంపాదించాలి. నేను కొంత మిగుల్చుకొని కొంత మీకివ్వాలి. అది సరైందేనా? దీన్ని నేను ప్రోత్సహించను'' అన్నారు బాబు. ఉపన్యాసం బాగానే ఉంది. చెప్పిందాంట్లో తప్పేమీ లేదు.

ఇలాంటి సూక్తిముక్తావళి వినిపించడానికి చంద్రబాబుకు అర్హత ఉందా? ముందు తాను స్వచ్ఛంగా ఉండి ఎంత నీతిబోధైనా చేయొచ్చు. కాని తానే ఒక్క ఓటు కోసం కోట్లు లంచంగా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు నీతిపరుడినని చెప్పుకోవడం ఎంతవరకు సమర్థనీయం? ఇక బాబు పాటించే నైతిక విలువలకు పార్టీ ఫిరాయింపులు చక్కటి ఉదాహరణ.  పార్టీ ఫిరాయింపుల అంశం ఆయనకు తెచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. మరి పొరుగు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే పని చేస్తున్నారు కదా అని ప్రశ్నించవచ్చు. కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మంచి పని చేశారని ఎవ్వరూ అనడంలేదు. ఆయన చేసింది, చేస్తున్నది అనైతికమే. అదే అనైతికమైన పని చంద్రబాబు ఎందుకు చేయాలి? అనేదే ప్రజాస్వామ్య ప్రియుల ఆవేదన.

Show comments