రెడ్డి గారి అమ్మాయి

నో డౌట్... రెడ్డీస్ అమ్మాయిలు ప్రౌడ్‌గా ఫీలవ్వొచ్చు!

ఎందుకంటే.. రెడ్డిగారి అమ్మాయిలు... ఆదర్శవంతమైన సమాజానికి బాటలు వేస్తున్నారు!

కులాల వారీగా విడిపోయిన సమాజాన్ని కలిపేస్తున్నారు ఈ అమ్మాయిలు!

ఆత్మాభిమానం, అహంకారం, ఆత్మీయత... అన్నీ మెండుగా కలిగిన వీరు చేసుకుంటున్నవి ‘‘ఆదర్శ’’ వివాహాలు. ‘ఆదర్శంగా’ నిలుస్తున్న వివాహాలు. అది కూడా సెలబ్రిటీల స్థాయి వివాహాలు కాబట్టి.. అనేకమంది దృష్టిన పడుతున్నాయి.. వీరిని చూసి రేపు అనేక మంది కులాంతర వివాహాల బాట పట్టే అవకాశాలున్నాయి. తద్వారా ఈ సమాజంలో కుల పట్టింపులు, కుల జాడ్యం వదిలితే అంత కన్నా గొప్ప విషయం ఏముంది? కాబట్టి అదే జరిగితే ఎంతో కొంత క్రెడిట్ ‘రెడ్డి గారి అమ్మాయి’కి దక్కుతుంది! ఇదే సమయంలో గమనించాల్సిన విషయం.. సెలబ్రిటీ సర్కిల్స్‌లో రెడ్డీస్ అమ్మాయిలకు దక్కుతున్న ప్రాధాన్యత. అన్ని కులాల్లోనూ ప్రముఖులు ఉన్నారు, అన్ని కులాల్లోనూ అమ్మాయిలూ ఉన్నారు.  వాళ్లందరి మధ్యనా వీళ్లే ప్రత్యేకంగా నిలుస్తుండటం ఆసక్తికరమైన అంశం.

సినిమా హీరోలు.. చాలా మంది అమ్మాయిలకు కలల రాకుమారులు! ఆ రాకుమారులకు కలల రాణులుగా నిలిచే అర్హత మాత్రం రెడ్డిగారి అమ్మాయిలదేనేమో అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు.. అనేక మంది టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల వాళ్లు వరసగా రెడ్డీస్ ఇంటి నుంచినే కోడళ్లను తెచ్చుకుంటుండటాన్ని చూసి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి వస్తోంది. ఆ టాలీవుడ్ స్టార్లు తమ తమ కుల దీపాలు! కానీ వాళ్లింట్లో దీపం పెట్టడానికి వెళుతున్న అమ్మాయిలు మాత్రం రెడ్డి కులస్తులు! ఆ స్టార్లలో కొందరు నిలదొక్కుకోవడంలో తమ తమ కులాలను బాగానే ఉపయోగించుకున్నారు. మరికొందరికి కుల నేపథ్యం అనుకోకుండా కలిసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. విహంగ వీక్షణంలో రాజకీయంగా వైరుధ్య భావాలత ఉండే కులాల మధ్యన ఈ వివాహాలు జరిగాయి!

టాలీవుడ్ మేల్ సెలబ్రిటీల్లో పై స్థాయిలో ఉన్న వారిలో ఎవరిదైనా పెళ్లి అనే వార్తలు రాగానే... అమ్మాయి ‘‘రెడ్డి కులస్తురాలేనా..?’’ అనే ఆరాలు తీయాల్సి వస్తోంది. ఈ విషయంలో ‘‘కాదు’’ అనే సమాధానానికి అవకాశమే లేకుండా పోతోంది!

చేసింది ఒక సినిమానే అయినా.. బోలెడంత సినీ నేపథ్యాన్ని కలిగిన అక్కినేని అఖిల్‌కు కాబోయే భార్య కూడా రెడ్డి కుటుంబానికే చెందిన అమ్మాయి కావడంతో.. టాలీవుడ్‌లో ఈ పరంపర కొనసాగుతున్నట్టవుతోంది. దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన జీవీకే రెడ్డి మనవరాలిని అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడు.

ఇది వరకూ ఈ జాబితాలో ఉన్న వారిని పరిశీలిస్తే... సుమంత్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, బ్రహ్మానందం తనయుడు గౌతమ్, మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్  తదితరులున్నారు. విభిన్నమైన నేపథ్యం, విభిన్నమైన సామాజికవర్గాల నుంచి వచ్చిన వీళ్లందరి ఎంపికా ‘రెడ్డి’ కులానికి చెందిన అమ్మాయిలే కావడం బహుశా యాధచ్చికమే కావొచ్చు. కానీ.. ఆ యాధచ్చికం అంతా ఒకే సామాజికవర్గానికి చెందిన అమ్మాయిల విషయంలో కావడంతో ఆ అమ్మాయిల్లోనే ఏదో ప్రత్యేకత ఉందేమో అనుకోవాల్సి వస్తోంది.

ఈ వివాహాలన్నీ ప్రేమ వివాహాలు అనేది మొదట వినిపించే మాట. కానీ ఆ కులాంతర ప్రేమకు పెద్దల ఆశీర్వాదం దక్కడంలో ముఖ్య పాత్ర పోషించేది ఆర్థిక శక్తి అనే అభిప్రాయం సహజంగానే వినిపిస్తుంది. ఆ అమ్మాయిల బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉండటంతోనే పెద్దలు ఈ పెళ్లిళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చనే మాట వినిపిస్తుంది. కానీ.. సదరు సెలబ్రిటీల నేపథ్యంలో కూడా ‘కులం’ క్రియాశీల పాత్రను పోషించిన నేపథ్యంలో.. వారి వారి కులాల్లో కూడా ఈ మాత్రం ఆర్థిక శక్తి కలిగిన అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కదా అనే విషయం కొట్టి పారేసేదేమీ కాదు. ఒకవేళ ఎంత ఆర్థిక కారణాలు క్రియాశీల పాత్ర పోషించిన ఇక్కడ వీరు కులం గోడలు దాటడం నిజంగా గొప్పదనమే అనుకోవాలి.

బహుశా.. కొన్నేళ్ల కిందట సుమంత్ ప్రారంభించాడు కాబోలు.. రెడ్డీస్ అమ్మాయిల వెంట పడటం! తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేత గంగిరెడ్డి మనవరాలు కీర్తి రెడ్డి. అప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కీర్తిరెడ్డి, సుమంత్‌ల ప్రేమ అప్పట్లో చర్చనీయాంశం. నాగేశ్వరరావు కుటుంబంలో నాగార్జున దగ్గర నుంచి కులాంతర వివాహాలు మొదలయినట్టున్నాయి. ఆ సంప్రదాయాన్ని సుమంత్ పొడిగించాడు. సుమంత్- కీర్తి రెడ్డిల వివాహబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు, ఆ విడాకుల గొడవ వేరే కథ.

తన తనయుడికి వివాహ సంబంధాలు చూడటం మొదలుపెట్టిన దశలో చిరంజీవి చాలా స్పష్టంగా చెప్పాడట.. ‘‘రెడ్డి’’ కులస్తుల అమ్మాయినే చూడండి అని! తన కులంలోని అమ్మాయినే కోడలిగా చేసుకోవాలనే పట్టింపు మెగాస్టార్‌కు ఏ మాత్రం లేకపోయింది. ఏం లెక్కతో అలా ఆలోచించాడో కానీ.. కోడలి విషయంలో ‘రెడ్ల’ మీద గాలి మళ్లింది చిరంజీవికి. ఆ తర్వాత  పెద్దలు వెదికిన సంబంధం గాక, ప్రేమ వివాహానికి చిరు తనయుడు మొగ్గు చూపడం ఒక విశేషం అయితే, చరణ్ ప్రేమించింది ‘రెడ్డి’ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కావడం, ఈ విధంగా చిరంజీవి కోరిక నెరవేరడం మరో విశేషం. ఇక అల్లు అర్జున్ ప్రేమ విషయానికి వస్తే.. ఆర్థిక పరమైన డీలింగ్ ఏ మాత్రం కాదిది. ఇంజనీరింగ్ కాలేజీల యజమానులే కానీ, మరీ మల్టీ మిలియనీర్లు కాదు స్నేహా రెడ్డి వాళ్లు. అయితే స్నేహ ప్రేమకు ఫిదా అయిపోయాడు బన్నీ. కాబట్టి అన్ని కులాంతర వివాహాలూ ఆర్థికపరమైన వ్యవహారాలతో ముడి పడినవి కావు అని నొక్కి వక్కాణింవచ్చు.

ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా, సామాజికంగా ఒక రేంజ్‌లో ఉన్న కుటుంబం నుంచి పెద్ద కోడలిని తెచ్చుకున్నాడు మోహన్ బాబు. వైఎస్ సోదరుడి కుమార్తెను కోడలిగా తెచ్చుకోవడంపై గర్వపడుతూ, తన కోడలి గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. మోహన్ బాబు పెద్ద కోడలి స్నేహితురాలే ఆయనకు రెండో కోడలయ్యింది. ఆ విధంగా వారి ఇంటి రెండో కోడలు కూడా రెడ్ల ఇంట పుట్టి పెరిగిన అమ్మాయే అయ్యింది.
జాతీయ స్థాయిలో రెడ్డీస్ అమ్మాయిల రెపరెపలు!

డెక్కన్ క్రానికల్ గ్రూపు అధిపతి తిక్కవరపు వెంకటరామిరెడ్డి తనయ గాయత్రి రెడ్డి వివాహం ఇటీవలే జరిగింది. ఐపీఎల్‌లో డెక్కన్ చార్జెస్ ఉన్న రోజుల్లో గాయత్రి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. వివిధ ప్రాంచైజ్‌ల ఓనర్లుగా ఉండిన సినీ సెలబ్రిటీలకు ధీటుగా గాయత్రికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆర్కుట్‌లో ఆమె ఫ్యాన్ కమ్యూనిటీలే వెలిశాయి. ఆ తర్వాత వెంకటరామిరెడ్డి కుటుంబం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. చార్జెస్ టీమ్ రద్దు అయ్యింది, డీసీ చైర్మన్ అయిన ఆయనను అరెస్టు చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్టుగా కనిపించిన ఆ కుటుంబం నుంచి గాయత్రి రెడ్డి ఒక పేరున్న వ్యాపార వేత్తల ఇంటికి కోడలిగా వెళ్లడం.

ఎయిరేషియా స్టేక్ హోల్డర్లు, ప్రముఖ రియాల్టర్లు అయిన ఒక ఉత్తరాది కుటుంబానికి కోడలయ్యింది గాయత్రి. స్టీల్ బ్యారన్ లక్ష్మీ మిట్టల్ కూతురును ఇచ్చిన ఇంటికే, గాయత్రిని ఇచ్చారు. ప్రపంచ స్థాయి శ్రీమంతుడు లక్ష్మీ మిట్టల్ అల్లుడి తమ్ముడే గాయత్రి భర్త, ఇదంతా గాయత్రికి ఉన్న ఛరిష్మా, రెడ్డీస్ అమ్మాయిలకు నడుస్తున్న ఉచ్ఛదశే అని చెప్పాలి!

సంసారాల్లో సరిగమలు!

టాలీవుడ్‌లో రెడ్డి ఇంటి నుంచి కోడలిని తెచ్చుకున్న ఒక కుటుంబం ఇప్పుడు ఆమె కనుసన్నల్లో నడుచుకుంటోందని ఒక టాక్. ఒక పెద్దింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయి తన సహసిద్ధమైన డ్యామినేషన్‌ను అత్తారింటిపై కొనసాగిస్తోందట! భర్తను కొంగున కట్టేసిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఇంట్లో తన మాటను ఎవరూ జవదాటలేని స్థాయిలో గ్రిప్‌ను సంపాదించిందట. ఆత్మాభిమానం, కాస్తంత అహకారం సహజ లక్షణాలుగా ఉండే కుటుంబాల నుంచి కోడళ్లను తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితి తప్పదు మరి! అలాగే వివాహాల అనంతరం ఈ సెలబ్రిటీ కోడళ్ల పేర్ల వెనుక ఐదక్షరాల ఇండికేటర్ మాత్రం ఉంటోంది సుమా, పుట్టుకతో వచ్చింది కదా అది!

ఆదర్శ వివాహాలు.. ఆదర్శమైన వివాహాలు!

సినిమా వాళ్లను కులాల ప్రకారం చూసి ఆ లెక్కలతోనే అభిమానించే వాళ్లే ఎక్కువ కాబట్టి, సదరు  సినీ స్టార్లు కులాంతర వివాహాలు చేసుకోవడం అమితాశ్చర్యాన్ని కలిగించే అంశంగా నిలుస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా అభిమానులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే... తమకు ఉన్నంత కుల పిచ్చ.. తమ కుల దీపకులకు లేదనేది! వారు ఆర్థిక వ్యవహారాలకో, కుటుంబానికి ఉన్న నేపథ్యానికో, పిల్లల ప్రేమకో ప్రాధాన్యతను ఇస్తారు కానీ.. ‘కులం’ అనేది వ్యక్తిగత ఆనందాలకు, అభిమానాలకు అడ్డు రాకూడదు.. అని సెలబ్రిటీలు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడం, చేసుకోకపోవడం కులం కుళ్లులో మగ్గే అభిమానుల ఇష్టం.

ఒకవైపు కాపుల రిజర్వేషన్ల విషయంలో ఉద్యమిస్తానంటున్న చిరంజీవి.. తనకు కోడలు మాత్రం కాపుల అమ్మాయి కావాలనే భీష్మించుకోలేదు. నాగార్జున మా కమ్మ వ్యక్తి అని గర్వించే వాళ్లు గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. ఆయన తన వ్యక్తిగత, కుటుంబ, వ్యాపార వ్యవహారాల్లో ఎక్కడా కులానికి పిసరంత విలువ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా సాగుతున్న ఈ ఆదర్శ వివాహాలు ఈ హీరోలను పిచ్చిగా అభిమానించే వాళ్లకూ కాస్తంత జ్ఞానోదయాన్ని కలిగించినా అదో గొప్ప పరిణామమే అవుతుంది.

మెగా ఫ్యామిలీ మా కులానికి చెందినదే అని చొక్కాలు చించుకునే వాళె్లైనా, ఈ అభిమానంతో ప్రాణాల మీదకు తెచ్చుకునే వాళ్లు అయినా.. సదరు మెగా ఫ్యామిలీ తమ వ్యక్తిగత విషయాల్లో కులానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తోందో అర్థం చేసుకుని, కులం అనేది ఎంత తక్కువ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అంశమో నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

ఇలాంటి అభిమానాల్లో మార్పులు తీసుకురాకపోయినా.. ఈ వివాహాలు ఆలోచన పరులను మాత్రం కొంత వరకూ ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. అంత పెద్ద కుటుంబాల వాళ్లే ఇంటర్ క్యాస్ట్‌లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.. మనమేముందిలే, అనే ధోరణిని వ్యక్తపరచడం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి.. అనే విషయంలో సెలబ్రిటీలు అనేక మంది తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అన్నీ సెలబ్రిటీ ప్రభావం వల్ల కాదు కానీ, పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితిలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. కుల పట్టింపులు ఇందుకు సంబంధించిన ఇగోలు తీవ్ర స్థాయిలో ఉండే రాయలసీమ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పల్లెటూళ్లలో ఊరికి ఒకటో రెండో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం నగర బాట పట్టిన యువత ఆఫీసులోనో, చదువుకున్న సమయంలోనో పరిచయం అయిన కొలీగ్‌లను పెళ్లి చేసుకుంటామని పెడుతున్న ప్రతిపాదనలకు తల్లిదండ్రులు కాదనలేని పరిస్థితి. అబ్బాయిలకు అయితే ఈ విషయంలో పూర్తిగా గ్రీన్ సిగ్నలిస్తున్నారు తల్లిదండ్రులు. 

అగ్రకులాల్లో అమ్మాయిల విషయంలో మాత్రం ఇంకా ఆ పరిస్థితి రావడం లేదు. కానీ ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరినవారు.. మానసికంగా కూడా పరిణతితో వ్యవహరిస్తున్నారని, అమ్మాయిలను కూడా ఇతర కులాల అబ్బాయిలకు ఇవ్వడానికి వెనుకాడటం లేదని సెలబ్రిటీల పెళ్లిళ్లు సాక్షిగా నిలుస్తున్నాయి.

-వెంకట్ ఆరికట్ల

Show comments