'హోదా'పై కేంద్రం కచ్చితంగా చెప్పలేదా?

గాఢంగా నిద్రపోయేవాడిని లేపడం సులభం. కాని నిద్ర నటించేవాడిని లేపడం సాధ్యం కాదు. వాడై వాడు లేచేదాకా ఎదురుచూడటం తప్ప మరేం చేయలేం. పవర్‌ స్టార్‌ కమ్‌ జనసేన అనే పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రస్తుతం ఆయన అన్నీ వదిలేసిన సన్యాసిలా చాలా కూల్‌గా ఉన్నాడు. 'జరిగేదేదో జరుగుతుంది...ఆవేశపడటం ఎందుకు?' అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎందుకు ఆవేశపడ్డాడో, ఇప్పుడెందుకు  తాపీగా ఉన్నాడో ఆయనకే తెలియాలి. అలాగని ఆయన రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేయాలని అనడంలేదు. కాని తత్వం బోధపడిన మనిషిలా నిరామయంగా ఉన్నట్లు కనబడుతోంది. 

ఏపీకి ప్రత్యేక హోదా సమస్య ఇప్పటిలా పీటముడి పడకముందు అంటే లేతగా ఉన్నప్పుడు ఆవేశపడిన పవన్‌ ఇప్పుడు పూర్తిగా ముదిరిపోయిన తరువాత 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌' అని దేవదాసు పాడినట్లుగా పాడుతున్నాడు. 'కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వను అని కచ్చితంగా చెప్పలేదు. ఒకవేళ అలా చెబితే అప్పుడు చూద్దాం'...అన్నాడు. కేంద్రం కుండ బద్దలుకొట్టినట్లు చెబితే అప్పుడు తాను ఎంటర్‌ అవుతాననే అర్థంలో మాట్లాడాడు. ఇప్పుడు తానొక్కడినీ ఏమీ చేయలేనన్నాడు. అది వాస్తవమే. ఆయనొక్కడూ ఏమీ చేయలేడు. 

కాని ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం కచ్చితంగా చెప్పలేదని పవన్‌ ఎలా అన్నాడు? జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేయడంలేదా? అర్థం చేసుకోవడంలేదా? రాజ్యసభలో కాంగ్రెసు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రయివేటు బిల్లుపై జరిగిన నాటకం చూడలేదా? చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారో తెలుసుకోలేదా? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మంత్రులే స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన విషయం తెలియదా? ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పిన విషయం పవన్‌ దృష్టికి పోలేదా? 'ప్రత్యేక హోదా ఇవ్వం' అని తెలుగులో చెప్పకపోయినా హిందీ, ఇంగ్లీషులో అనేకసార్లు చెప్పారు. ఎందుకు రాదో కారణాలు చెప్పారు. 

హోదాకు మించి సాయం చేస్తామని, ఇప్పటికే బోలెడు చేశామని చెప్పారు. ఇంత చెప్పిన తరువాత కూడా ఇంకా కచ్చితంగా చెప్పలేదని పవన్‌ ఎలా అన్నాడో అర్థం కావడంలేదు. కేంద్రాన్ని, మోదీని ప్రశ్నించే ఉద్దేశం ఆయనకు లేనట్లుంది.  'వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి ఇష్టం...పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం'...అన్నారు మహాకవి. పవన్‌ సినిమాలకే పరిమితమైతే ఆయనతో నాయకులకుగాని, జనాలకుగాని పనుండకపోయేది. కాని రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి, గత ఎన్నికల్లో ఘాటుగా ప్రచారం చేసి, పార్టీ పెట్టి, మధ్యమధ్య అమరావతిలో భూసేకరణ గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడాక పవన్‌ను నిలదీసే హక్కు ప్రజలకుంది. 

అందుకే ఆయన స్పష్టమైన అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటున్నారు. మొన్నటివరకు ప్రత్యేక హోదా అంత ముఖ్యమైంది కాదని చంద్రబాబు తన అభిప్రాయంగా చెప్పారు. అది సంజీవిని కాదన్నారు. కాని ప్రతిపక్షాలు హోదాను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు సాధించాలని చూడటంతో హోదా జీవన్మరణ సమస్య అంటున్నారు. బాబు మాదిరిగా మాటలు మార్చకుండా స్పష్టమైన అభిప్రాయాలు చెబితే పవన్‌ విలువ పెరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు కృషి చేయడంలేదని గతంలో ఒకసారి ఆయన తీవ్రంగా విమర్శించాడు. 

ఆ సందర్భంలో టీడీపీ నాయకులు పవన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మాటల తూటాలు వదిలారు. పవన్‌ బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని, హోదా గురించి మోదీతో ఎందుకు మాట్లాడటంలేదని మండిపడ్డారు.  అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డి   'ఎట్టి పరిస్థితిలోనూ ప్రత్యేక హోదా రాదు' అని బల్ల గుద్దినట్లు  చెబుతూనే ఉన్నారు.  చివరకు అదే నిజమైంది.  ఓసారి పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేసిన సందర్భంలో 'ఇదంతా పవన్‌ కళ్యాణ్‌ను సంతృప్తిపరిచేందుకు చేస్తున్నాం. హోదా వస్తుందని కాదు' అన్నారు. అలా టీడీపీ ఎంపీలను కూడా గడగడలాడించిన పవన్‌ ఇప్పుడు నిరాసక్తంగా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం అనేకసార్లు స్పష్టంగా చెప్పినా అవేవీ ఆయన చెవిన పడకపోవడం రాజకీయమేనా? అమాయకత్వమా?

Show comments